అసెంబ్లీ లో నిమ్మకాయలు, క్షుద్ర పూజలు, చేతబడుల గొడవ గురించి విన్నారా . ఈ రోజు నిజంగా కర్నాటక అసెంబ్లీలో నిమ్మకాయ ప్రత్యక్షం కావడం పెద్దగొడవకు దారి తీసింది.
మామీద చేతబడి చేస్తున్నారా అని బిజెపి ప్రతపక్ష సభ్యులు చాలా సేపు రభస చేశారు. రూలింగ్ పార్టీని ముఖ్యమంత్రి కుమారస్వామిని నిలదీశారు.
కర్నాటకలో అసెంబ్లీలో కుమార్ స్వామి ప్రభుత్వం విశ్వాస తీర్మానం మీద చర్చ జోరుగా సాగుతూ ఉంది. ఎంతకు తెగడం లేదు. మీ చర్చ మధాహ్నం ఒకటిన్నరకు ముగించి వోటింగ్ జరపండని గవర్నర్ సూచించారు.
చర్చ ముగియలేదు. కొనసాగుతూ ఉంది వాడిగా వేడిగా. పోనీ ఆరుగంటలకు ముగించి వోటింగ్ జరపండని రెండో సారి రాజ్ భవన్ నుంచి సూచన వచ్చింది. అదీ జరగలేదు.
గవర్నర్ విజూభాయ్ వాలా ఉత్తర్వులను కుమార స్వామి ప్రభుత్వం ఖాతరు చేయలేదు.
ఇదొక రాజ్యంగ సంక్షోభం అని చాలా మంది అంటున్నారు.సభ సోమవారానికి వాయిదా పడింది. ఇపుడు గవర్నర్ ఏచర్య తీసుకుంటారో చూడాలి.
ఇంతలో ప్రతిపక్షం ఓడిపోవాలని, ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన తీర్మానం నెగ్గాలని మంత్రం (చేతబడి) వేస్తున్నారనే గొడవ మొదలయింది.
దీనికి కారణం సభలో ప్రవేశించిన నిమ్మకాయ.
ప్రతిపక్ష సభ్యులు ఈ ఆరోపణ చేశారు. దీనికి కుమార స్వామి సమాధానం కూడా చిత్రంగానే ఉంది.
నిమ్మకాయను సభలోకి తీసుకువచ్చింది కుమారస్వామి అన్న, దేవేగౌడ్ పెద్దకుమారుడు రేవణ్ణ. రేవణ్ణ తెచ్చిన నిమ్మకాయను చూసి సభలో చేత బడి జరుగుతూ ఉందని ప్రతిపక్ష సభ్యులు ఆరోపించారు.
‘ నిమ్మకాయను తెచ్చినందుకు రేవణ్ణను మీరు నిందిస్తున్నారు. మీరు (బిజెపి) హిందూ సంస్కృతిని నమ్మతామని చెబుతారు. మరిరేవణ్నను నిందించడమెందుకు?ఆయన ఎపుడూ తనతో నిమ్మకాయలు తెచ్చుకుంటాడు.ఆయన ఆలయానికి నిమ్మకాయలతో వెళుతుంటాడు. ఈ నిమ్మకాయను చూపి ఆయన చేతబడి చేస్తున్నాడని మీరు ఆరోపిస్తున్నారు. చేతబడితో ప్రభుత్వాన్ని కాపాడగలమా,’ కుమారస్వామి గర్జించారు.
అసెంబ్లీ సెక్యూరిటీ సిబ్బంది నిమ్మకాయను ప్రమాద కరమయిన వస్తువులజాబితాలో చేర్చారు. అయినా సరే రేవణ్న నిమ్మకాయను సభలోకి తీసుకువచ్చారు.
సభలో చర్చ జరుగుతున్నపుడు కాళ్లకి చెప్పలు లేకుండా ప్రవేశించారు. అంతేకాదు, నిమ్మకాయ తనతో పాటు తెచ్చుకునేందుకుఆయన సెక్యూరిటీ పర్మిషన్ కూడా తెచ్చుకున్నాడట.
ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఇలా చేతబడి దాకా వెళ్లడం మంచిది కాని ప్రతిపక్షం ఆరోపించింది. కొద్ది సేపటి తర్వాత ఈ వివాదం సద్దుమణిగింది.