(సిఎస్ సలీమ్ బాష)
మనం ఎప్పుడన్నా ఒక కారు కొనాలనుకుంటే చాలామందిని సంప్రదిస్తాం. అందులో కారు ఓనర్స్ ఉండొచ్చు, తెలిసిన వాళ్ళు ఉండొచ్చు ,కారు మెకానిక్ ఉండొచ్చు. అలాగే కారు కంపెనీలకి వెళ్లి కొటేషన్ తీసుకుంటాం.
చివరికి ఎంతో పరిశోధన చేసి మనకు నచ్చిన కారే తీసుకుంటాం.
అలా ఏదైనా కొనాలనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఎంతో సమాచారాన్ని సంపాదించి చివరకు అనుకున్న పని చేసి దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తాం.
సైకాలజీలో దీన్ని “కాగ్నిటివ్ బయాస్” (అభిజ్ఞాత్మక పక్షపాతం) అంటారు. సాధారణంగా మనం ఒక నిర్ణయం తీసుకునే ముందు ఎంతో ఆలోచించి తీసుకోవాలి కానీ అభిజ్ఞాత్మక పక్షపాతం అనేది మన నిర్ణయానికి అనుకూలంగా అది నెగిటివ్ ఐనా సరే పనిచేస్తుంది.
ఇది దాదాపుగా చాలామంది మనుషుల్లో కనబడే ఒకానొక డిఫెన్సివ్ మెకానిజం. మన ఈ పక్షపాతం వల్ల మెదడు కూడా మనకు అనుకూలమైన పద్ధతిలోనే ఆలోచించడం మొదలు పెడుతుంది.
అయితే తర్క రహిత ఆలోచన సరళికి , అభిజ్ఞాత్మక పక్షపాతానికి చిన్న తేడా ఉంది..మొదటిది ఆలోచనల్లో సరైన తర్కం లేకపోవటం, రెండోది అసలు సరిగ్గా ఆలోచించక పోవటం. మొదటి దాంట్లో ఆలోచనలను సరైన రీతిలో అమర్చుకోక పోవటం, రెండో దాంట్లో సరైన ఆలోచనలు లేకుండా గుడ్డిగా వెళ్ళటం.
ఇంత ముందు చెప్పిన కారు కొనుగోలు లో మనం ఫలానా కారు కొనాలనుకున్నప్పుడు ఆ కారు కొనడానికి ఎన్ని పద్ధతులు ఉంటే, వాటన్నింటినీ మనకి అనుకూలంగా మలచుకుంటూ మెదడు కూడా అదే పని చేస్తుందన్నమాట ఉదాహరణకి వ్యాగన్ఆర్ కారు కొనాలని అనుకుంటే కొనడానికి కొన్ని అభిప్రాయాలు పెట్టుకుంటాం.
విచిత్రం ఏమిటంటే మన ఆ కారు కొనాలనుకున్న మరుక్షణం నుంచి మనకు రోడ్డుమీద అవే కార్లు కనబడటం మొదలుపెడతాయి. నిజం చెప్పాలంటే ఇంత ముందు కూడా అవే కార్లు మనం ఎన్నో చూసి ఉంటాం.
అవి మన స్ఫు రణకు అప్పుడు రావు. మనమా కారు కొనాలనుకున్నప్పుడు మాత్రమే అవి రోడ్డు మీద కనబడుతున్నాయి అని మనం అనుకుంటాం కానీ నిజానికి మన మెదడు మనకు ఒక అనుకూల వాదనను నిర్మించే క్రమంలో ఆ కార్లను స్ఫురణలోకి తీస్తుంది అంతే! దాంతో వ్యాగనార్ కారు మంచిది అనే మన నిర్ణయానికి ఊతం వస్తుంది.
అలాగే గర్భం దాల్చేంత వరకు ఒక మహిళ కి గర్భిణీలు కనపడరు. తర్వాత తన చుట్టూ ఉన్న మహిళలలో గర్భిణులే ఎక్కువగా కనబడ్డం మొదలవుతుంది, ఇది ఒకానొక అభిజ్ఞాత్మక పక్షపాతం. చాలామంది తమ తో ఏకీభవించే వారితోనే స్నేహం చేస్తారు. అభిప్రాయాన్ని గౌరవిస్తారు. వారితోనే స్నేహం చేస్తూ మిగతా వారిని తక్కువ అంచనా వేస్తూ పట్టించుకోకుండా ఉంటారు.
మరో ఉదాహరణ చెప్పుకోవాలంటే మనం చాలాసార్లు ఎక్కువమంది కి నచ్చే వస్తువు లే కొంటాం. ఒక కుటుంబంలో ఎక్కువమందికి నచ్చే వస్తువుల్ని కుటుంబ సభ్యులు మొత్తం కొనడం దీనికి ఉదాహరణ.
మనం ఒక ఖరీదైన వస్తువు అనవసరంగా కొనేస్తాము.తర్వాత ఆ వస్తువు మనకు ఎంత అవసరమో చెప్పటం మొదలు పెడతాము. అది పనికిరానిదైనా అది చాలా అవసరం అని రుజువు చేసే వాదన చేస్తూ మన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తాం.