తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరుగనున్న జ్యేష్ఠాభిషేకం శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ప్రతి ఆషాఢ మాసంలో జ్యేష్ఠా నక్షత్రం నుంచి తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారికి జ్యేష్ఠాభిషేకం నిర్వహించడం ఆనవాయితీ.
ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి కైంకర్యాలతో కార్యక్రమం ప్రారంభమయింది.
ఉదయం 8 నుండి 10 గంటల వరకు శతకలశస్నపనం, మహాశాంతి హోమం చేపట్టారు. ఉదయం 10 నుండి 11.30 గంటల వరకు ఆలయంలోని కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు.
అనంతరం స్వామివారి కవచాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి కవచాధివాసం చేశారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాఢ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.