తిరుమల తిరుపతి దేవస్థానాలకు అనుబంధంగా ఉన్న తిరుపతి శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో జూలై 12 నుండి 14వ తేదీ వరకు మూడు రోజుల పాటు జ్యేష్ఠాభిషేకం(అభిధేయక అభిషేకం) జరుగనుంది.
శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులకు ఏడాదికోసారి స్వర్ణకవచాలను తొలగించి శుద్ధి చేసి తిరిగి అమర్చుతారు.దీనినే జ్యేష్ఠాభిషేకం అంటారు.
ఇందులో భాగంగా జూలై 12న కవచాధివాసం, జూలై 13న కవచ ప్రతిష్ఠ, జూలై 14న కవచ సమర్పణ నిర్వహిస్తారు.
ఈ ఉత్సవం సందర్భంగా మూడు రోజుల పాటు ఉదయం మహాశాంతి హోమం, పుణ్యాహవచనం చేపడతారు. ఉదయం 10 గంటలకు స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం, మధ్యాహ్నం శతకలశస్నపనం, సాయంత్రం వీధి ఉత్సవం నిర్వహిస్తారు.
ప్రతి ఏడాదీ ఆషాడ మాసం, జ్యేష్ఠా నక్షత్రం రోజున ఆలయంలో జ్యేష్ఠాభిషేకం నిర్వహిస్తారు.
(ఫోటో TTD సౌజన్యం)