సిద్ధిపేట : ప్రతి ఇంటికీ సాయం. ప్రతి కుటుంబానికి జీవనోపాధి. గ్రామంలో రామాలయం తర్వాత శివాలయ నిర్మాణం. చింతమడక గ్రామస్తులను ఆర్థికంగా బలపరచడమే రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లక్ష్యమని రాష్ట్ర మాజీ మంత్రి హరీశ్ రావు చెప్పారు. సిద్ధిపేట జిల్లా సిద్ధిపేట రూరల్ మండలం చింతమడకలో శుక్రవారం జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి, పోలీసు కమిషనర్ జోయల్ డేవీస్, జాయింట్ కలెక్టర్ పద్మాకర్ లతో కలిసి దాదాపు మూడు గంటల పాటు గ్రామంలోని వాడ వాడలో శివారు ప్రాంతాలలో పర్యటించారు. గ్రామ సందర్శనలో భాగంగా గ్రామస్తులతో.. హరీశ్ రావు మాట్లాడుతూ.. ప్రతి కుటుంబానికి ఉపాధితో కూడిన ఆర్థిక సాయం అందించాలని గ్రామంలో ఇంటింటా అధికారులచే ప్రత్యేక సర్వే చేయిస్తున్నట్లు., సర్వే చేసేందుకు మీ ఇంటికి వచ్చిన అధికారులకు సంపూర్ణమైన సమాచారాన్ని ఇవ్వాలని గ్రామస్తులను కోరారు. భూమి ఉన్నవారు లేదని చెబితే తమకు భూమి ఇస్తారనే దురాశకు పోయి తప్పుడు సమాచారం ఇవ్వొద్దని గ్రామస్తులను కోరారు. భూమి ఉన్న రైతులకు భూమిపైన ఏలాంటి ఆదాయం లభిస్తుందని, ఇందుకు అవసరమైన, కావాల్సిన చర్యలను చేపట్టి ఆ భూమి ద్వారా నిరంతరం ఆ కుటుంబాలకు ఆర్థిక అభివృద్ధి లభించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. అసైన్డ్ భూములు ఉన్న దళిత రైతులకు భూములను పూర్తిస్థాయిలో సాగులోకి వచ్చే విధంగా అభివృద్ధి చేస్తామని, భూమిలేని రైతులకు వాహనాలు, యంత్రాలు ఇచ్చి ఉపాధి కల్పిస్తామని తెలుపుతూ.. ఒక్కరు ఆటో తీసుకుంటున్నారని., ఒక్కరు దరఖాస్తు ఇచ్చారని., మరొకరు కూడా వారి తరహాలోనే ఆటో కావాలని కోరుకోవడం సరైన పద్ధతి కాదని ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామంలో ఎంత మందికి ఆటోలు ఇచ్చినా., ఒక్కో సందర్భంలో సత్ఫలితాలు ఇవ్వకపోవచ్చని., మీ ఇంటికే వచ్చి మీ జీవన స్థితిగతులను గురించి అధికారులు సర్వే ద్వారా కుటుంబ సభ్యుల్లో ఎవరు ఎంత చదువుకున్నారు..? ఎవరి పేరు మీద ఎంత భూమి ఉంది..? ఎవరికి ఉద్యోగం ఉంది..? ఎవరు నిరుద్యోగులు.. వారి శక్తి సామర్థ్యాలు ఎమిటి.? వారికి ఎలాంటి సహాయసహకారాలు అవసరం ఉందని తెలుస్తుందని వివరించారు. ఈ విషయంలో స్పష్టత ఉండేలా సీఎం కేసీఆర్ గ్రామంలో సర్వే నిర్వహిస్తున్నారని వెల్లడించి, చింతమడకలోని ప్రతి ఇళ్లు ఆర్థికంగా ఆధారం కావాలంటూ., యుద్ధ ప్రాతిపదికన గ్రామంలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ గ్రామానికి వచ్చి ఒక్కరోజు మీతోనే ఉంటారని, మీతోనే కలిసి సహపంక్తి భోజనం చేస్తారన్న సంగతిని గుర్తు చేస్తూ., సీఎం కేసీఆర్ పర్యటనలో భాగంగా అందరినీ కలిసేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. సీఎం వచ్చిన రోజున ఏర్పాటు చేసే సభకు గ్రామస్తులు అందరిని ఆహ్వానిస్తామని,, ఒక పద్ధతి ప్రకారంగా ఒక్కొక్కరికీ కేటాయించిన గుర్తింపు కార్డుల ఆధారంగా సీఎం కేసీఆర్ గారిని కలిసే అవకాశం ఉంటుందని వివరించారు. గ్రామస్తులను ఒక్కొక్కరికీ కేటాయించిన గుర్తింపు కార్డుల ఆధారంగా సీఎం కేసీఆర్ గారిని కలిసే అవకాశం ఉంటుందని.. కాబట్టి అధికారులు ఇచ్చిన సలహాలు, సూచనలు చేస్తారని వాటిని గ్రామస్తులు పాటిస్తేనే గ్రామంలోని ప్రతి ఒక్కరు కలుసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. గ్రామస్తులకు డబుల్ బెడ్ రూమ్ నిర్మిస్తారని, ఇంటి స్థలం ఉన్న వారికి రూ.5లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లు, గ్రామస్తులు అనవసరంగా అపోహలకు పోవద్దని., మీ ఇంటికే సర్వేకు వచ్చిన అధికారులకు సమగ్ర సమాచారం ఇవ్వాలని గ్రామస్తులను కోరారు.
– చింతమడకలో సీఎం రాక సందర్భంగా ఏర్పాట్లపై స్థల పరిశీలన
సీఎం కేసీఆర్ స్వగ్రామమైన చింతమడకకు రానున్న నేపథ్యంలో గ్రామంలో సభ, సమావేశం నిర్వహించేందుకు అవసరమైన స్థలాలను మాజీ మంత్రి హరీశ్ రావు జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి, పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ లు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చింతమడక గ్రామ శివారులోని దమ్మ చెరువు వద్ద హెలిప్యాడ్ ఏర్పాటుపై స్థలాన్ని పరిశీలించారు. అనంతరం సభ, సమావేశం జరిగే ఖాళీ స్థలాలను క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. ఐకేపీ గోదాము సీసీ ఫ్లాట్ ఫామ్ పరిశీలించి, అక్కడ ఆత్మీయ సమ్మేళనం జరిపేలా ఆ ప్రాంతం సరిపోతుందని ఫైనల్ చేయాలని అధికారులకు హరీశ్ చెప్పారు. అక్కడి నుంచి పెద్దమ్మ దేవాలయం సమీపంలో వన భోజనాలు ఏర్పాట్లపై స్థల పరిశీలన చేసి, ఆలయం పక్కనే ఉన్న చింత చెట్టు కింద సీఎం కేసీఆర్ సహపంక్తి భోజనం చేసే ఏర్పాట్లు, పక్కన ఖాళీ స్థలంలో గ్రామస్తులంతా భోజనం చేసే విధంగా ఏర్పాట్లపై కలెక్టర్, సీపీలతో చర్చించారు. వన భోజనాల వద్ద మహిళలు, పురుషులకు వేర్వేరుగా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. అలాగే ఆలయం సమీపంలోని నరెడ్ల గడ్డ వద్ద హెలిప్యాడ్ కోసం స్థలాన్ని పరిశీలించారు. అనంతరం గ్రామంలోని శివాలయాన్ని సందర్శించి సీఎం కేసీఆర్ దర్శించుకునే విధంగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. నిర్మాణంలో ఉన్న రామాలయాన్ని సందర్శించి పనులను పర్యవేక్షించారు. ఆలయ పనులలో వేగం పెంచాలని, పరిసరాలను అనుకూలంగా మార్చాలని సూచనలు చేశారు. గ్రామంలో చేపట్టిన విద్యుత్ తాగునీరు మురికి కాల్వల నిర్మాణం, రోడ్డు విస్తరణ పనులు, పారిశుద్ధ్యం తదితర అంశాలను తొందరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిద్ధిపేట ఆర్డీఓ జయచంద్రా రెడ్డి, డీసీపీ నర్సింహ్మా రెడ్డి, ఏసీపీ రామేశ్వర్, వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు, సిద్ధిపేట రూరల్ తహశీల్దారు రమేశ్, ఎంపీడీఓ సమ్మిరెడ్డి, చింతమడక గ్రామ సర్పంచ్ హంసకేతన్ రెడ్డి, ఎంపీటీసి జ్యోతి దేవేందర్, సుడా ఛైర్మన్ రవీందర్ రెడ్డి, నాయకులు సత్యనారాయణ గౌడ్, బిక్షపతి, తిరుపతి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.