ఇరుకు ఇరుకు గదులలో, దూరేందుకు కష్టమయిన స్టెప్స్ ఉన్న ఒక సూరత్ కోచింగ్ సెంటర్ లో అగ్ని ప్రమాదం జరిగి ఘటన తర్వాత జీహెచ్ఎంసీ మేల్కొంది.
భద్రతా ప్రమాణాలు పాటించని శిక్షణ సంస్థలమీద కొరడా ఝళిపించింది.
నిజానికి ఈ చర్య ఎపుడో జరిగి ఉండాలి. ఒకే బిల్డింగ్ లో వందల బోర్డులు తగించి కోచింగ్ సెంటర్లు కాలేజీలు నడపడం హైదరాబాద్ లో దశాబ్దాలుగా ఉంది.
దిల్ షుక్ నగర్ , అమీర్ పేట, కూకట పల్లిలతో పాటు అనేక జంక్షన్ లో ఈ కోచింగ్ సెంటర్లు రెడ్డు పక్కనే నడుస్తున్నా ఎపుడు చర్యలు తీసుకునేందుకు అధికారులు ముందుకు రాలేదు.
ఈ ఏడాది మే 25న సూరత్ లోని ఒక కోచింగ్ సెంటర్ 21 మంది విద్యార్థులు మంటల్లో చిక్కుకుని మాడిమసయిపోయిన నేపథ్యంలో హైదరాబాద్ అధికారులకు ఇక్కడి కోచింగ్ సెంటర్లు కూడా ప్రమాదం అంచుల్లోని ఉన్నాయని కనుగొన్నారు.చర్యలు తీసుకునేందకు ముందుకురికారు.
ఆలస్యంగా నైనా కదిలినందుకు సంతోషించాలి. చిత్రమేమంటే, ఇవన్నీ విద్యాసంస్థలే అయినా, ఇవి విద్యాశాఖ పరిధిలో లేవు. వీటి మీద ఎలాంటి అజమాయిషీ లేదు.అందుకే మూరెడు జాగా కనబడితే చాలు 30 కోచింగ్ సెంటర్లు వస్తున్నాయి.
ఉద్యోగాలు తక్కువ కావడంతో ఎపుడో వచ్చే ఉద్యోగం కోసం ఇప్పటినుంచి కోచింగ్ తీసుకునేందుకు దేశం నలుమూలల నుంచి విద్యార్థులు హైదరాబాద్ కు తరలి వస్తున్నారు.
కొన్ని రకాల కంప్యూటర్ కోర్సుల కోసం ఉత్తర ప్రదేశ్,బీహార్, మధ్యప్రదేశ్ లనుంచి కూడా వస్తున్నారు. ఇక టీచర్, పబ్లిక్ సర్వీస్ కమిషన్, బ్యాంకులు,కాన్ స్టేబుళ్ల ఉద్యోగాలకోసం సూదూర గ్రామాలనుంచి కూడా వేలాది మంది విద్యార్థులు హైదరాబాద్ కు వస్తున్నారు. దీనితో నగరంలోని కూడళ్లన్నింటా కోచింగ్ సెంటర్లు వెలుస్తున్నాయి.
అగ్నిప్రమాదం జరిగితే, నివారించగలిగే ఏర్పాట్లు ఈ సెంటర్లలో ఏ మాత్రం లేవు. ప్రమాదం చోటు చేసుకున్న పరిస్థితుల్లో మంటలను ఆర్పేందుకు అవసరమైన అగ్నిమాపక సాధనాలను ఒక్క సెంటర్ కూడా అందుబాటులో ఉంచుకోవడం లేదు.
అందువల్ల సూరత్ ఆగ్ని ప్రమాదం తర్వాత కోచింగ్ సెంటర్ల భవనాలను పరిశీలించడం మొదలు పెట్టారు. ఇందులో ఆసక్తికరమయిన అంశాలను అధికారులు కొనుగొన్నారు.
చాలా కోచింగ్ సెంటర్లలో చిన్న చిన్న గదులలో వందకు మించి ఎక్కువ మంది విద్యార్థులను కుక్కి కోచింగ్ ఇస్తున్నారు. ఇలాంటి చోట్ల నేరు గా అధికారులు క్లాస్ రూమ్ లలోకి ప్రవేశించి తాము ఎంత భయంకరమయిన అభద్రత మధ్య కోచింగ్ తీసుకుంటున్నారో వివరించారు. తర్వాత విద్యార్థులను ఆగదులనుంచి ఖాళీ చేయించి, సంస్థలను సీజ్ చేశారు.
హైదరాబాద్ లో దాదాపు 671 కోచింగ్ సెంటర్లున్నాయి. సూరత్ ప్రమాదం తర్వాత వీరందరికి నోటీసులిస్తూ అగ్ని ప్రమాద నివారణ ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు.
జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విశ్వజీత్ ఆధ్వర్యంలో అధికారులు, డీఆర్ఎఫ్ సిబ్బంది అమీర్‌పేట్‌లోని దాదాపు 20 శిక్షణ సంస్థలపై అధికారులు దాడులు చేసి సీజ్ చేశారు.
671 శిక్షణ సంస్థలను గుర్తించి భద్రతా ప్రమాణాలు పాటించడం లేదన్న అభియోగాలపై రెండు నెలల కిందటే నోటీసులు జారీ చేశామని, వీటిలో కొందరు మాత్రమే నోటీసులకు స్పందించారని, ఎక్కువ మంది ఖాతరు చేయలేదని విశ్వజిత్ చెప్పారు.
నోటీసులు అందుకున్న వారిలో కేవలం 180 సంస్థలు మాత్రమే స్పందించాయని , ఏర్పాట్లు చేసేందుకు కొంత గడువుకావాలని కోరాయని ఆయన చెప్పారు.
తమ దాడులు కొనసాగుతాయని కూడా ఆయన చెప్పారు. ఒకసారి కోచింగ్ సెంటర్ ను సీల్ చేస్తే తర్వాత తెరవాలంటే సురక్షితచర్యలు ఏమితీసుకున్నారో నివేదిక ఇవ్వాలి. జిహెచ్ ఎంసి అధికారులు ఆ తర్వాత ఈ నివేదిక ఆధారంగా తనిఖీ చేస్తారు. అపుడు అన్నీ సజావుగా ఉంటేనే కోచింగ్ సెంటర్లు నడిపేందుకు అనుమతిస్తారు.