(పి.వరలక్ష్మి)
ప్రజాధనాన్ని అడ్డగోలుగా తిని బలుస్తున్న ప్రయివేటు స్కూళ్లకు దోచిపెట్టే పథకంలానే కనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన ‘అమ్మ ఒడి’.
వాళ్లకు మేలు జరిగితే జరిగింది. కనీసం పేద పిల్లలకు మేలు జరుగుతుంది కదా అనుకోవచ్చా? ఆ కాసిన్ని డబ్బులు ఇస్తే జరిగే వ్యక్తిగత మేలు ఎంత? మొత్తంగా సమాజానికి జరిగే మేలు ఎంత? తద్వారా పిల్లల విద్యావికాసం, భవిష్యత్తు భరోసా ఎంత?
సమాధానం చెప్పుకునేకన్న ముందు ఇప్పుడు స్కూళ్ళ పరిస్థితి ఆలోచించాలి.
కొన్ని దశాబ్దాలుగా ప్రయివేటు స్కూళ్ళు విద్యా ప్రమాణాల్ని దారుణంగా పడేసాయి. కానీ అదే నిజమైన విద్యగా ఎస్టాబ్లిష్ చేసి, పనిగట్టుకొని ప్రభుత్వ పాఠశాలలను నాశనం చేస్తున్నారు.
సుమారుగా చేసేసారు కూడా. శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మక జ్ఞానం, సామాజిక బాధ్యత, మానవ విలువలు నేర్పించడం ద్వారా వ్యక్తి వికాసానికి తోడ్పడడం విద్యావ్యవస్థ బాధ్యత.
ఈ క్రమంలో మంచి నైపుణ్యాలు నేర్చుకుని తమకిష్టమైన రంగంలో బతుకుతెరువును చూసుకుంటారు విద్యార్థులు. కానీ వ్యవస్థ దానికి తగిన మనుషులనే అది తయారు చేసుకుంటుంది.
ఇప్పుడు కావాల్సింది కార్పొరేట్ కు సేవ చేసే వెన్నెముక లేని కూలీల తరాన్ని తయారుచేయడం కాబట్టి దానికి ఇతరేతర విలువలేవీ ఉండవు. అట్లా ఏ విలువల్లేని, డబ్బు సంపాదనే లక్ష్యంగా ఉండే వ్యాపారస్తుల చేతులకు విద్యను అప్పగించారు.
వీళ్ళను ప్రోత్సహించడం కోసం ప్రభుత్వ విద్యాసంస్థలకు నిధులివ్వకుండా, అక్కడ చదువులు చెప్తున్నారో లేదో పట్టించుకోకుండా, ఏ పర్యవేక్షణ చేయకుండా వాటిని నీరుగార్చారు. గవర్నమెంటు బడులలో చదువురాదు అని పేరు పడేలా చేసారు. ప్రైవేట్ దుకాణాలను తెరిపించారు. నారాయణ వంటి వ్యాపారులను కుట్రపూరితంగా కొన్ని దశాబ్దాలుగా ప్రోత్సహించారు. అటువంటి కార్పోరేట్ స్కూళ్ళలో విద్యను బోధించే పద్ధతే సుమారుగా అన్ని ప్రైవేట్ స్కూళ్ళూ, ఇటీవలి కాలంలో గవర్నమెంట్ స్కూళ్ళు కూడా ప్రమాణంగా తీసుకుంటున్నాయి.
ఫలితంగా నిజమైన జ్ఞానానికి విలువనివ్వక, సామాజిక బాధ్యతను తెలియజెప్పక, అనారోగ్య పోటీలను పెంచి, విద్యార్థులను ఒత్తిడికి గురిచేసి, శారీరకంగా, మానసికంగా వారిని చేవలేని చచ్చు శరీరాలుగా తయారుచేస్తున్న విద్యావిధానం అభివృద్ధి చెందింది. అన్నీ ప్రక్షాళన చేస్తానంటున్న ప్రభుత్వానికి ఈ స్థితిని మార్చే నిజాయితీ ఉందా?
ఎల్లెడలా పాకిపోయిన అనైతిక, అవినీతి విద్యాసంస్థల గురించి ఒక్క మాటన్నా మాట్లాడే ధైర్యం ఉందా? యువతరాన్ని రోజూ ఆత్మహత్యల వైపు తోసేస్తున్న స్థితి పట్ల బాధ్యత ఉందా?
ప్రభుత్వ పాఠశాలల సౌకర్యాల గురించి కూడా మాట్లాడుకుందాం. కానీ కనీస ప్రమాణాలు పాటించే ప్రయివేటు స్కూళ్ళు రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి? టీచర్లకు సక్రమంగా జీతాలిచ్చేవి, పిల్లలకు లైబ్రరీ, ప్లే గ్రౌండ్, గాలీ వెలుతురూ సోకే తరగతి గదులు ఉన్నవి, విద్యార్థుల సంఖ్యకు సరిపడా టీచర్ల నిష్పత్తి ఉన్నవి ఎన్ని ఉన్నాయి? కోళ్ల ఫారాల వంటి స్కూళ్లను కళ్ళు తెరిచి ఏ విద్యాశాఖ అధికారి అయినా చూస్తున్నారా? ప్రభుత్వ స్కూళ్లకు నిధులివ్వరు. ప్రయివేట్ స్కూళ్లకు ఏమీ లేకున్నా అనుమతులిస్తారు. విద్యార్థులు చచ్చిపోతున్నా పట్టించుకోరు.
మార్కులే ప్రమాణంగా ఉండే విద్య నేడు మార్కెట్లో ఉంది. అది పిల్లల్లో సృజనాత్మకతను ఎదగనివ్వకుండా చేస్తోంది. కానీ ఉన్నత విద్య అవకాశాలు పొందాలంటే ఆ మార్కులే కావాలి. ఇదో విచిత్రమైన స్థితి. ఆ మార్కులు రావాలంటే కార్పెరేట్ స్కూళ్ళే గత్యంతరం అని ప్రభుత్వం కూడా పరోక్షంగా ప్రచారం చేస్తుంది.
ʹకార్పొరేట్ʹ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలని అప్పుడప్పుడూ విద్యాశాఖ అధికారులు మాట్లాడుతుంటారు. ఏమిటి ఆ స్థాయి? సేవా సంస్థ (ట్రస్ట్) పేరుతో రిజిస్టర్ చేయించుకొని వ్యాపారం చేస్తూ లక్షలు దండుకునే స్థాయి.
వందల కోట్లకొద్దీ నల్లధనం దాచుకోగలిగే స్థాయి. అవసరమైతే ప్రశ్నాపత్రాలు లీక్ చేయించునే స్థాయి. అధికారులను కొనగలిగే స్థాయి. ఏటా వందల మంది పిల్లలను చచ్చేదాకా శిక్షణ ఇచ్చే స్థాయి. గత్యంతరంలేక ఈ రోగగ్రస్తమైన విద్యావ్యవస్థలోనే సర్దుకుపోతున్నారు గానీ దీనిపట్ల లాభాలు దండుకునే వ్యాపారులకు తప్ప పిల్లలకు, తల్లిదండ్రులకు ఏ మాత్రం సంతృప్తి లేదు.
అత్యంత లోపభూయిష్టాంగా, సంక్షుభితంగా విద్యావ్యవస్థ ఉంటే, దాన్నేక్కడా ముట్టుకోకుండా, మీ పిల్లలను ఎక్కడైనా చదివించుకోండి, మీకు డబ్బులిస్తాం అని ముఖ్యమంత్రి అంటున్నాడంటే ఏమని అర్థం? రోగికి శాస్త్ర చికిత్స చేయాలంటే పారాసెటమాల్ మందు ఇచ్చి ఏదో గొప్ప సేవ చేస్తున్నట్లు ప్రకటించుకోవడంలా ఉంది ఇది. రాజన్న రాజ్యం అన్నా సంక్షేమ రాజ్యం అన్నా ఇదే. ప్రజలకు హక్కుగా రావలసినవన్నీ రద్దు చేసి, ఆ ప్రజల వద్ద దండుకున్న డబ్బుల నుండే చిల్లర విదిల్చి వాళ్ళను బిక్షగాళ్ళను చేయడం.ఫీజ్ రీఎంబర్స్ మెంట్ తో ప్రభుత్వ కాలేజీలను నాశనం చేశారు.
విశాలమైన మైదానాలు, లైబ్రరీలు, ప్రయోగశాలలతో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి, ఎంతో మంది మేధావులను తయారుచేసిన ప్రభుత్వ కాలేజీలు మూతపడి, సరిపడా రూమ్స్ గానీ, ల్యాబ్స్ కానీ లేని ప్రయివేట్ కాలేజీలు రోడ్లమీద దుకాణాల్లా తెరుచుకుని డబ్బులు దండుకుంటున్నాయి.
ఫీజ్ రీఎంబర్స్ మెంట్ కు పెట్టే ఖర్చు మరిన్ని ప్రభుత్వ కాలేజీలు స్థాపించడానికి, ఉన్నవాటిని మెరుగుపరచడానికి పెట్టి ఉంటే విద్యా ప్రమాణాలు ఉన్నతంగా ఉండేవి. ప్రభుత్వ కళాశాలలు అలా అంతరించిపోతుంటే, ఇప్పుడిక ప్రభుత్వ బడులు కూడా కనుమరుగు కావడానికి మరో పథకం వస్తోంది.
విద్యాప్రమాణాలు, విలువలతో కూడిన విద్య, ఒత్తిడి లేని విద్య ఎప్పటికైనా అందివ్వగలరా అనే సీరియస్ ప్రశ్న సామాజం నుండి చాలా ఏళ్లుగా వస్తున్నది. దానిని స్వీకరించే నిజాయితీ పాలకులకు ఉంటుందనుకోవడం దురాశే. అమ్మఒడి పథకాన్ని ప్రకటించిన వెంటనే ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు దీనిని ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే వర్తింపజేయమని, లేదంటే మిణుకుమిణుకు మంటున్న దీపంలా ఇవాలున్న ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా మూతపడుతాయని విజ్ఞప్తి చేస్తున్నారు. కనీసం దీనినైనా స్వీకరిస్తారా?
(ఫోటో వ్యాసం విరసం సౌజన్యం)