టీడీపీ ప్రభుత్వం అండతో అవినీతికి పాల్పడిన ఎపిఎండిసి ఎండి
(యనమల నాగిరెడ్డి)
ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవెలప్ మెంట్ కార్పొరేషన్ (ఎపిఎండిసి) మేనేజింగ్ డైరెక్టర్ (ఎండి)గా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పనిచేసిన వెంకయ్యచౌదరి 2015-2019 మధ్యకాలంలో బెరైటీస్ అమ్మకాలలో 2000 కోట్లకు పైగా కార్పొరేషన్ కు నష్టం కలిగించారని ఆరోపణలొస్తున్నాయి.
సంస్థ నిర్వహణ పేరుతొ మరో 70 కోట్ల మేరకు దుర్వినియోగం చేశారని, కార్పొరేషన్ లో ఎండి చేసిన అక్రమాలపై విచారణ జరపాలని ఏపీఎండీసీ కార్మిక సంఘం అధ్యక్షురాలు శ్రీమతి జయశ్రీ, గౌరవ సలహాదారు సి హెచ్ చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు.
ఈ మొత్తం వ్యవహారం మీద విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వారు లేఖ రాశారు.
అప్పటి అధికార పార్టీ అండదండలతో తలకెక్కించుకున్న కార్పొరేషన్ మాజీ ఎండి వెంకయ్యచౌదరి “అవినీతి, అక్రమాలు, టెండర్లలో గోల్ మాల్, బెరైటీస్ ఖనిజం ధర నిర్ణయించడంలో అవకతవకలు, కులపిచ్చితో వ్యవహరించి సొంత కులానికే అన్ని రకాల పనులు కట్టపెట్టడం” లాంటి అనేక అవకతవకలకు పాల్పడ్డారని వారు లేఖ లో పేర్కొన్నారు.
అధికారపార్టీ నాయకులను సంతృప్తి పరచడానికి ఆయన కార్పొరేషన్ కొంప కొల్లేరు చేసి తన పాలనా కాలంలో కనీసం రెండు వేల కోట్లకు పైగా అస్మ దీయులకు దోచి పెట్టారని , తాను కూడా భారీగా సొమ్ము చేసుకున్నాడని వారు ముఖ్యమంత్రికి పంపిన లేఖలో పేర్కొన్నారు.
ఈ అవినీతి బాగోతంపై విచారణ జరిపి ఎండితో పాటు ఇందుకు సహకరించిన అధికారులపైన, నాయకులపైన చర్యలు తీసుకోవాలని, వారు విజ్ఞప్తి చేశారు.
బెరైటీస్ ధరల నిర్ణయంలో ఎండి ఇష్టారాజ్యమే!
ప్రపంచ ప్రసిద్ధి పొందిన నాణ్యమైన బెరైటీస్ ఖనిజం కడప జిల్లా మంగంపేటలో మాత్రమే దొరుకుతుందనేది ప్రపంచ వ్యాప్తంగా తెలిసిన సత్యం. ఈ ఖనిజం ధరను అంతర్జాతీయ మార్కెట్ ధరల ప్రకారం రవాణా ఖర్చులు, కాంట్రాక్టర్ ఆదాయం (న్యాయమైన లాభం) లెక్క కట్టి ఏపీఎండీసీ ధర నిర్ణయిస్తుంది. ఈ ధరలకే ఓఎన్ జిసి లాంటి ఆయిల్ డ్రిల్లింగ్ కంపెనీలకు కూడా సరఫరా చేస్తారు.
అయితే ప్రస్తుత ఎండి వెంకయ్య చౌదరి ఈ ఖనిజం ధర నిర్ణయించడంలో అధికార పార్టీ నాయకుల అండతో “అందరికీ ఉపయోగపడే” విధానంలో అవినీతి వరదకు గేట్లు ఎత్తి సంస్థకు అధమపక్షం 2000 కోట్లు నష్టం వాటిల్ల చేశారని వారు ఆ పత్రంలో వివరించారు.
సంస్థకు చెందిన ఉద్యోగులు అందించిన పత్రాల మేరకు వివరాలిలా ఉన్నాయని వారు తెలిపారు. 2016-17, 17-18, 18-19 మూడు ఆర్థిక సంవత్సరాలలో ఏపీఎండీసీ 27 లక్షల టన్నుల ‘ఏ’ గ్రేడ్ రాయిని, 4.3 లక్షల టన్నుల ‘బి’ గ్రేడు రాయిని, 13 లక్షల టన్నుల ‘సి’ గ్రేడు రాయిని ఉత్పత్తి చేసింది. ఆయన ఎండీగా ఛార్జ్ తీసుకునే సమయానికి ఏ గ్రేడు టన్ను అమ్మకం ధర 6050గాను, బి గ్రేడు ధర 5800 గాను, సి గ్రేడు ధర 5186 గాను ఉంది. ఆ తర్వాత 2016-17లో ఆయన ఏ గ్రేడు ధరను 5050గాను, బి గ్రేడు ధరను 4000గాను, సి గ్రేడు ధరను 1600 గాను నిర్ణయించారు. అలాగే 17-18లో మరింత దూకుడు పెంచి ఏ గ్రేడు ధరను 4100గా, బి గ్రేడు ధరను 3025గా, సి గ్రేడు ధరను 1510గా నిర్ణయించి అమ్మకాలు సాగించారు. 2018-19లో సంస్థపై కొంత దయ చూపి ఏ,బి గ్రేడుల ఖనిజం టన్ను ధరను 100 రూపాయలు, సి గ్రేడు ధర 60 రూపాయలు పెంచారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపితే పూర్తి వ్యవహారం వెలుగు చూస్తుందని వారు అభిప్రాయపడ్డారు.
అయితే ఆశ్చర్యకరంగా అంతర్జాతీయ విఫణిలో 16-17లో ఏ గ్రేడు టన్ను 12100,17-18లో 13800,18-19లో 13800 ధర పలికింది. ఇక బి గ్రేడు 10,178(16-17),12440(17-18), 12447(18-19) ధర కాగా సి గ్రేడు ఖనిజం టన్ను 8200, 10027 చొప్పున ధర పలికింది. ఖనిజాన్ని తరలించడానికి రవాణా క్రింద సరాసరి టన్నుకు 4840 ఖర్చు అవుతుంది. ఈ వ్యవహారంలో 16-17లో 236కోట్లు, 17-18లో 829 కోట్లు, 18-19లో 993 కోట్లు చొప్పున సంస్థ ఆదాయానికి ఎండి చౌదరిగారు గండి కొట్టారని వారు ఆ పత్రంలో ఆరోపించారు. “ఒక్క ఏ గ్రేడు ఖనిజం అమ్మకాల ద్వారా 1165 కోట్లు దోచుకున్నారని” వారు వివరించారు.
కొనుగోలు దారులకు ప్రోత్సాహకాలు
తాను గత 25 సంవత్సరాలుగా ఈ కార్మిక సంఘం అధ్యక్షుడుగా పనిచేస్తున్నానని, కార్మికుల సహకారంతో సంస్థను నిలపెట్టగలిగామని, ఇంత అవినీతిని, అక్రమాలను ఇప్పటి వరకు చూడలేదని కార్మిక సంఘం ప్రస్తుత గౌరవ సలహాదారు సి హెచ్ చంద్రశేఖర రెడ్డి ఆవేదన వ్యకతం చేశారు. “ఖనిజం కొనుగోలులో ఎక్కువ ధర కోట్ చేసిన వారికి ఐదు శాతం ప్రోత్సాహకం” ఇచ్చిన మొట్టమొదటి ఎండి చౌదరిగారే నని ఆయన తెలిపారు. గత సంవత్సరం ఇలా 15వేల టన్నులు అప్పనంగా ఇచ్చిన ఎండి ఈ సంవత్సరం మొదటి రెండు స్థానాలలో కోట్ చేసిన వారికి 3%, 2% చొప్పున ప్రోత్సాహకాలు ఇవ్వడానికి ఆదేశాలు ఇచ్చారని ఆయన తెలిపారు. ఇది ఏపీఎండీసీ చరిత్రలోనే చరిత్రగా ఆయన అభివర్ణించారు. కార్పొరేషన్ లో పనిచేస్తున్నతన స్వకులస్తులైన ఇరువురు కాంట్రాక్టు ఉద్యోగులకు కాలపరిమితికి ముందే కాంట్రాక్ట్ పొడిగించడం ఎండిగారి పాలనకు అడ్డం పడుతున్నదని వారు ఆరోపించారు.
నిర్వహణ పేరుతొ సుమారు ఓ 70 కోట్లు స్వాహా!!
ఎండి స్వంత ఖర్చులు, కుటుంబ నిర్వహణ ఖర్చులు, సంస్థ నిర్వహణ, కేంద్ర కార్యాలయ నిర్వ్హహణ, సామాజిక భాద్యత క్రింద చేపట్టిన పధకాల నిర్వహణ క్రింద కనీసం 70 నుండి 100 కోట్ల వరకు ఖర్చు చేసి ఉంటారని వారు ఆ పత్రంలో ఆరోపించారు.
ప్రయివేటు వ్యక్తులకు కట్టపెట్టిన వైద్యశాల నిర్వహణకు 3.10 కోట్లు, మొబైల్ వైద్య సేవల క్రింద రెండు వాహనాలు నడపడానికి మరో 3 కోట్లు, స్కూల్ నిర్వహణకు 6 కోట్లు, విజయవాడలో కేంద్ర కార్యాలయానికి బాడుగగా 4. 5 కోట్లు, ఆఫీస్ లో క్యాన్ టీన్ నిర్వహణకు కోటికి పైగా ఖర్చు చేశారట.
ఇక ఆయన విజయవాడలో నివసించడానికి గెస్ట్ హౌస్ కోసం 60 లక్షలు, ఆయన కుటుంబం హైదరాబాదులో నివసించడానికి, వాహనాలకు, సిబ్బందికి టిఏ, డిఏలు మరో రెండు కోట్లు ఖర్చు చేశారని వారు వివరించారు. వే బ్రిడ్జి కొనుగోళ్ళకు 3 కోట్లు, మైన్ లో లైటింగ్ ఏర్పాటుకు మరో 2.5 కోట్లు కూడా తమ వారికే కట్టబెట్టారని వారు వివరించారు.
“ఆయన కుటుంబం నివసించడానికి హైదరాబాదులో సరైన ఇల్లు లభించలేదనే సాకుతో రోజుకు లక్ష రూపాయల బాడుగతో ఐదు నక్షత్రాల హోటల్ లో రెండు నెలలు ఉంచారనేది ఈ అవినీతి ఆరోపణలకు కొసమెరుపు” ఆఫ్ కోర్స్ ఈ డబ్బు ఆయనదేనట లెండి!
ఇంతకాలం ఎందుకు ఫిర్యాదు చేయలేదు?
“ఎండి చౌదరి ఇంత అవినీతి చేస్తుంటే కార్మిక సంఘం ఎందుకు స్పందించలేదు?” అన్న ప్రశ్నకు “ఎవరికి ఈ అవినీతి భాగోతం వినిపించమంటారు?” అని చంద్రశేఖర్ రెడ్డి ఎదురు ప్రశ్నించారు.
ఎండి గా వెంకయ్యచౌదరి రావడమే కుల, రాజకీయ ప్రాతిపదికన వచ్చారని, అధికార పార్టీ అండదండలు పుష్కలంగా ఉండటంతో ఏ అంశాన్ని గురించి మాట్లాడినా ఆయన నుండి సరైన సమాధానం రాలేదని, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వెళ్లినా ఫలితం ఉండదని నోరు విప్పలేక పోయామని ఆయన తెలిపారు. కార్మికుల గోడు, వారి న్యాయమైన డిమాండ్లు వినిపించుకొడానికి కూడా ఎండికి తీరిక లేదని, తన పదవీకాలంలో ఎండి కార్యాలయం టీడీపీ నేతలకు, కాంట్రాక్టర్ల అవినీతికి కార్యాలయం గా పని చేసింది తప్ప ఏపీఎండీసీ కార్యాలయంగా పనిచేసింది తక్కువని ఆయన ఆరోపించారు.
అన్నింటిలో స్వంత కులానికే ప్రాధాన్యం
ఎండీగా ఉన్న కాలంలో వెంకయ్య చౌదరి సొంత కులానికి, ఆ తర్వాత ఆయన(కు) కొమ్ము కాస్తున్న పార్టీకి పూర్తి అనుకూలంగా పనిచేసి, సంస్థ నిధులను విచక్షణా రహితంగా దోచి పెట్టారని ఆయన ఆరోపించారు.
“వైద్యశాల నిర్వహణ, మొబైల్ వైద్య సేవల నిర్వహణ, పాఠశాల నిర్వహణ, కార్యాలయ ఏర్పాటు, వే బ్రిడ్జిల కొనుగోలు, లైటింగ్ ఏర్పాట్లు, క్యాన్ టీన్ ల నిర్వహణ” లాంటి అన్ని పనులు ఒకే(ఆయన) కులానికి కట్టపెట్టారని, ఇవన్నీ రికార్డులలో ఉన్న వివరాలని ఆయన వివరించారు. మట్టి పనులు కూడా ఆయన కులానికి చెందిన కంపెనీకే దఖలు పరచారని వారు ముఖ్యమంత్రికి పంపిన పత్రంలో వివరించారు.
రాష్ట్రానికి ఆదాయవనరుగా ఉన్న మంగంపేట బెరైటీస్ ఖనిజాల అమ్మకాలలోను, నిర్వహణ పరంగాను ఎండి వెంకయ్య చౌదరి చేసిన అవినీతి, అందుకు సహకరించిన ఏపీఎండీసీ అధికారులపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని,వారు విజ్ఞప్తి చేశారు. అధికారుల అలక్ష్యం, అవినీతి వల్ల సంస్థకు నష్టం జరగకుండా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని వారు కోరారు. ముందు ముందు ఇలాంటి అవకతవకలు జరగకుండా కార్మికుల పట్ల, సంస్థ పట్ల నిబద్దత కల మంచి అధికారిని నియమించడంతో పాటు, కఠినమైన నిభందనలు ఏర్పరచి భవిష్యత్తులో అక్రమాలు జరగకుండా నిరోధించి “ఖజానాకు బంగారు గుడ్లు పెట్టె కార్పొరేషన్ ను కాపాడాలని వారు కోరారు.