తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి,మాజీ మంత్రి నారా లోకేష్ కు ముఖ్యమంత్రి జగన్ పాలన మీద కోపమొచ్చింది. ఈరోజు ఆయ మంగళగిరిలో మాట్లాడుతూ రాష్ట్రంలో సాగే పాలన మీద నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి జగన్ చెప్పేది ఒకటి.. చేసేది ఒకటి అని అంటూ ఏపీలో బీహార్ తరహా పాలన నడుస్తోందని మండి పడ్డారు.
’రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తలను వేధిస్తున్నారు, టీడీపీకి మెజార్టీ వచ్చిన గ్రామాల్లో గోడలు కడుతున్నారు.ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు.ఇప్పటి వరకు ఆరుగురు టీడీపీ కార్యకర్తలను హత్య చేశారు.130 కార్యకర్తల పై దాడులు చేసి ఆస్తులు ధ్వంసం చేసారు,’ అని లోకేష్ ఈ రోజు మంగళగిరిలో చెప్పారు.
తాము సంయమనంతో ఉన్నా అయినా కావాలనే రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారరని ఆయన ఆరోపించారు. హత్యలపై డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తామని అన్నారు.
తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడలేదుని ఈ దాడుల సమయంలో కార్యకర్తలకు టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారాయని, రాజకీయ హత్యలు జరుగుతుంటే సీఎం జగన్ ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
‘2004 లో వైయస్ ముఖ్యమంత్రి అయిన సందర్భంలో కూడా ఇలానే టిడిపి కార్యకర్తలను హత్య చేసారు.తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకొం, పార్టీ కార్యకర్తలు, నాయకులకు అండగా ఉంటుంది,’ అని ఆయన పేర్కొన్నారు.
మంగళగిరిలో దాడులకు గురయిన కుటుంబాన్ని ఆయన పరామర్శించారు.