సివిల్స్ ఎంపికయిన వారిలో కొంత మంది ఎక్కడో మారుమూల పల్లెటూర్ల నుంచి సూదూరమయిన ముళ్లబాటలో నడుచుకుంటూ వచ్చిన వాళ్లు న్నారు.
వాళ్ల జీవితాలు చాలా సాదాసీదా ఉంటాయి. వాళ్ల అఛీవ్ మెంట్ ఉత్తేజకరంగా ఉంటుంది తప్ప జీవితం నిస్సారంగా ఉంటుంది. అక్కడ కష్టాలు తప్ప చెప్పుకునేందుకు మరొక విశేషం కనిపించదు.
వాళ్లని ఢిల్లీ యుపిఎస్ సి దాకా నడిపించింది కేవలం పట్టుదలే. అది ఏమాత్రం సడలింపు లేని పట్టుదల.అనుమానాలకు, అపోహలకు తావీయని పట్టుదల.
ఇలా ముళ్ల బాటలో నడిచి వచ్చి, 22 సంవత్సరాలకే, అందునా మొదటిసారే, ఐఎఎస్ కొట్టిన పేద విద్యార్థి ప్రదీప్ సింగ్.
ఇంత చిన్న వయసులోనే ఐఎఎస్ కు ఎంపికయిన వాళ్లు చాలా అరుదుగా ఉంటారు.అందుకే ఆయన ఉద్యోగ జీవితంలో చాలా ఉన్నత స్థాయికి చేరుకుంటారు.
ప్రదీప్ సాధించిన ఆల్ ఇండియా ర్యాంక్ (AIR) 93. ఏప్రిల్ 7న ఫలితాలు వచ్చినపుడు ప్రదీప్ గురించి తెలిసిన వాళ్లెవరూ దీనికి ఆశ్చర్యపోలేదు.
ప్రదీప్ పట్టుదల, కుటుంబం ప్రోత్సాహం చూసిన వాళ్లు ఆయన ఏదో ఒకటి సాధిస్తాడని అనుకున్నారు. ఆశ్చర్య పోయింది చుట్టూర ప్రపంచమే.
ప్రదీప్ తండ్రి మనోజ్ సింగ్ మధ్య ప్రదేశ్ ఇండోర్ లోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పెట్రోల్ పంపులో పనిచేస్తారు. ఆయనకు చదువు మీద అపారమయిన నమ్మకం ఉంది. చదివినంత మాత్రాన ఉద్యోగాలొస్తాయా అనే పాడు ప్రశ్నఎపుడూ మనుసులోకి రానీయనేలేదు.
పిల్లలను చదివిస్తే ప్రయోజకులవుతారనే నమ్మకంతోనే బీహార్ గోపాల్ గంజ్ వదిలేసి 1991లో బతుకుదెరువు వెదుక్కుంటూ ఇండోర్ వచ్చాడు.
అక్కడ ఐవొసి పెట్రోల్ పంపులో ఉద్యోగంలో చేరాడు. వూర్లో కొద్దిగా వ్యవసాయ భూమి ఉన్నా, దాని మీద వచ్చే రాబడి కుటుంబానికి, తాను ఆశిస్తున్నట్లు పిల్లల చదువులకు చాలాదని మనోజ్ సింగ్ భావించాడు.
తనకు బతుకు దెరువు కావాలి, పిల్లలకు చదువులు అందుబాటులో ఉండాలి. దీని కోసం మధ్య ప్రదేశ్ ఇండోర్ కు వలస వచ్చాడు.
ధర్మరాజు స్వరం వొడ్డి జూదమాడినట్లు ఆయన కూడా ప్రదీప్ చదువు మీద సర్వం వొడ్డారు.
సిబిఎస్ఇ స్కూల్ చదువు అయిపోయాక ప్రదీప్ ఇండోర్ లోని ఐఐపిఎస్ లో బికామ్ ఆనర్స్ పూర్తి చేశాడు. తర్వాత ఉద్యోగం వెదుక్కునేందుకు తండ్రి ప్రదీప్ కు అవకాశమీయలేదు.
ఢిల్లీయే నీ గమ్యం అని చెప్పాడు. ముందు వెనక చూడకుండా ఢిల్లీ రైలెక్కమన్నారు తెగింపుతో.
ఉన్నదంతా వూడ్చి ఢిల్లీ పంపిస్తే , ప్రదీప్ విఫలమయి తిరిగొస్తే ఎట్లా అనే అర్బన్ మిడిల్ క్లాస్ భయం ఆయన్ని పీడించలేదు.
ప్రదీప్ ని ఢిల్లీకి పంపాలనే అనుకున్నారు. డబ్బు సమకూర్చారు. ఈ డబ్బు ఎక్కడిదో తెలుసా? ఇల్లు అమ్మి తెచ్చింది. దీనికి చాలా కరేజ్ ఉండాలి.
ఎందుకంటే, సివిల్స్ పాసవడం లక్షల్లో ఒక్కరికే సాధ్యం. అలాంటిది ఒక పెట్రోలు పంపు కూలీ, ఇల్లమ్మి, కొడుకుని ఐఎఎస్ కోచింగ్ కోసం ఢిల్లీ పంపిస్తే ఎలా? ఒక వేళ పాస్ కాలేక పోతే….ప్రదీప్ ని ఢిల్లీ పంపాలను కోవడంలోనే గొప్పదనం ఉంది. అది చదువుమీద మనోజ్ సింగ్ కు ఉన్న అపారమయిన నమ్మకం. అందుకే పిచ్చి పిచ్చి భయాలను దరికి రానీయలేదు.
పరీక్షలకు ప్రిపేరవుతున్నపుడు తల్లి ఆరోగ్యం క్షీణించిందన్న విషయాన్ని కూడా కొడుక్కి తెలియ చెప్పకుండా మనోజ్ సింగ్ జాగ్రత్తపడ్డారు.
‘నేను ఏదయినా ఒక ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం సంపాయించాలనుకున్నా. అందుకే బికామ్ చేరాను. అయితే, నేను ఉద్యోగం చేస్తానంటే ఇంట్లో వాళ్లెవరూ ప్రోత్సహించలే. ఇంకా చదువు అన్నారు.ఢిల్లీ వెళ్లమన్నారు. అంతేకాదు, సివిల్స్ కు ప్రిపేర్ కావాలని వత్తిడి తెచ్చారు,’ అని ప్రదీప్ తన మైండ్ లోకి సివిల్స్ అనే మాట ఎలా చొరబడిందో చెప్పారు.
‘నాకసలు ఈ సివిల్స్, ఐఎఎస్ అనేవి తెలియనే తెలియవు. కొంత మంది పిల్లలు ఎంతో కష్టపడి సివిల్స్ పాసయి పెద్ద పెద్ద ఆఫీసర్ లయిన సక్సెస్ స్టోరీలను మానాయనే అపుడుపుడు ఎక్కడెక్కడినుంచో మోసుకొచ్చి చెప్పేవాడు. మా నాయనకు కూడా ఇలాంటి కల ఉందని అపుడు నాకు అర్థమయింది,’ అని ప్రదీప్ ఫలితాలు వచ్చాక మీడియా వాళ్లతో ఈ విషయం పంచుకున్నాడు.
రెండేళ్ల కిందట ప్రదీప్ ఢిల్లీ వెళ్లాడు.
‘ఢిల్లీలో ఎకామిడేషన్, భోజనం, కోచింగ్ అనేవి ఖరీదయిన వ్యవహారాలు, ఇవి మానాయన ఆదాయంతో రావు.అందుకే ఆయన ఇల్లు కూడా అమ్మేశాడు’, అని ప్రదీప్ చెప్పాడు.
ఇవన్నీ నేను పట్టుదలతో చదివేలా చేశాయి. రోజు పద్నాలుగు గంటలు చదివే వాడినని ఆయన తన ప్రిపరేషన్ గురించి చెప్పాడు.
సివిల్స్ పాసయ్యే వాళ్లకు ఆయనొక సలహా ఇస్తున్నాడు: ” పూర్తిగా కోచింగ్ మీద ఆధారపడవద్దు. కోచింగ్ మీకు 9 నుంచి 10 శాతం వరకే పనికొస్తాయి. అంటే సివిల్స్ ప్రిపేరయ్యే విద్యార్థులు 90 శాతం సొంతంగా ప్రిపేర్ అయ్యేందుకు సిద్ధపడాలి.”
(ఈ స్టోరీ మీకు నచ్చితే, అందరికీ షేర్ చేయండి. trendingtelugunews.com ను ఫాలో చేయండి)