మెహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ మనకు ఎన్నో రూపాల్లో పరిచయం. ప్రవక్తగా, అధ్యాత్మిక గురువుగా,లౌకికవాదిగా, స్వాతంత్య్రయోధుడి, సాంఘిక సంస్కర్తగా … వెరసి మహాత్ముడిగా ఆయన దేశం ప్రజలందరికి పరిచయం. ఆధునిక భారత చరిత్రలో ఇంతగా ఆరాధ్యుడయిన మరొక నాయకుడు లేరు.
బారెడు బట్ట నడుముకు చుట్టుకుని, మరొక మూరెడు భజానేసుకుని,కాలినడకతోనే ఎంతదూరమయిన వెళ్లే బక్కపల్చటి ఈ మానవుడు కొన్ని కోట్ల హృదయాలను ఎలా దోచుకున్నాడనేది ఎవరికీ అర్థంకాని ప్రశ్న.
అందుకే ఆయన జీవితంలో తవ్వేకొద్ది కొత్త విషయాలు, ఆశ్చర్యకరమయిన విశేషాలు బయపడుతుంటాయి. ఇందులో కొన్ని అబ్బురపరిచే విశేషాలు:
1. గాంధీ రెండుచేతులా రాసే సవ్య సాచి
గాంధీజీ రాసిన ‘హింద్ స్వరాజ్’ (ఇండియన్ హోమ్ రూల్ ) అనే పుస్తకం ఆయన రాజకీయతాత్వికతను వ్యక్తం చేస్తుంది. ఈ పుస్తకాన్ని 1909 నవంబర్ 13-22 మధ్య ల ఇంగ్లండు నుంచి దక్షిణాఫ్రికాకు ఎస్ ఎస్ కిల్దోనన్ కాజిల్ అనే నౌకలో వెళ్తూ రాశారు. కుడిచేత్తో రాసి రాసి అలసిపోయి ఎడమచేత్తో రాయడం మొదలు పెట్టారు. 275 పేజీల హింద్ స్వరాజ్ పుస్తకంలో 40 పేజీలను ఆయన ఎడమచేత్తో రాశారు.
2. కస్తూర్బాతో ఓడ ప్రయాణం
గాంధీజీ, భార్య కస్తూర్బాతో మాత్రమే ఉంటూ ఒకే ఒక్క సారి ప్రయాణించారు. 1914 లో 45వ యేట దక్షిణాఫ్రికా నుంచి భారత్ తిరిగొస్తున్నపుడు ఇది జరిగింది. ఆపుడాయన ఎస్ ఎస్ అరేబియా అనే నౌకలో వస్తున్నారు. కస్తూర్బాతో పెళ్లయ్యాక పూర్తిగా ఆమెకే సమయం వెచ్చించి గడిపింది ఆయన నౌకా ప్రయాణంలోనే. ఇంటికి తిరిగొస్తున్నపుడు నౌకలో ఉన్నా, రైలులో ఉన్నా, రోడ్డు మీద ప్రయాణిస్తున్నా ఆయన పూర్తిగా భార్యతోనే చేసిన ప్రయాణమిదే అని ఆయన మనవవడు,రచయిత రాజ్ మోహన్ గాంధీ రాశారు.
3. డాక్టర్ కావాలనుకున్నారు…
గాంధీజీ ఇంగ్లండులో న్యాయ శాస్త్రం చదువుకున్నారు.అయితే, ఆయనకు మెడిసిన్ చదవాలన్న కోరిక బలంగా ఉండింది. కాని, వాళ్ల కుటుంబ సభ్యులు అంగకీరించలేదు. వైష్ణవుడిగా పుట్టి శవాలనుముట్టుకుంటూ చదువుకోవడమేమిటని వాళ్లు వైద్య వృత్తి గురించి ఆలోచించనే వద్దని చెప్పారు. ఆయనలో మాత్రం వైద్య శాస్త్రం చదవాలనే కోరిక లండన్ లో న్యాయశాస్త్రం చదువుతున్నపుడు కూడా ఉండింది. 1909 ఒక మిత్రుడితో ఈ విషయం షేర్ చేసుకున్నారు. కప్పలను కోసే వైద్య విద్య నేర్చుకోవాల్నా? అని అడుగుతూ అలాగయితే, నేను మెడిసిన్ చదవలేను బాబూ, అని ఆయన 1909లో ఆ మిత్రుడికి లేఖ రాశారు.
4. భార్యకు పురుడుపోసిన గాంధీజీ
మెడిసిన్ చదవలేకపోయినా వైద్య విద్యమీద ఆయన ఆసక్తి తగ్గలేదు. ఆరోగ్యం, శుభ్రత, పోషకా హారం వంటి అంశాల మీద ఆయన అధ్యయనం చేస్తూనే ఉండేవారు. 1900 మే 23న దక్షిణాఫ్రికాలో ఉండగా ఆయన చిన్న కొడుకు దేవదాస్ గాంధీ (1900-1957) పుట్టారు. అపుడు భార్యకు మంత్రసానిగా మారి పురుడుపోసింది గాంధీయే. పురుడు పోసేవిధానాన్ని సురక్షిత పురుడు మీద డాక్టర్ త్రిభువన్ దాస్ రాసిన పుస్తకం చదివి నేర్చుకున్నారు.
5. ఉపవాసాల వెనక రహస్యం
గాంధీజీ ఉపవాసాలెక్కువ చేసేశారు. బ్రిటిష్ ప్రభుత్వం మీద కోపం వచ్చినపుడల్లా ఆయన నిరాహారదీక్ష (సత్యాగ్రహం) చేసేవారు. ఇలా సులభంగా ఆహారమానేయడానికి కారణం ఆయన బ్రేక్ ఫాస్ట్ మీద చేసిన ప్రయోగాలే. ఆయన తరచు కీళ్ల వాపులు, మలబద్ధకం తలనొప్పి వంటి సమస్యలతో బాధపడేవారు. బాగా తిండితినే వారికే ఈలాంటి సమస్యలుంటాయని, వాటికి పరిష్కారం బ్రేక్ ఫాస్ట్ మానేయడమే నని మాంచెస్టర్ లో ప్రచారం చేస్తున్న ‘No Breakfast Association’ గురించి విన్నాడు. గాంధీజీ బ్రేక్ ఫాస్ట్ మానేశాడు. మొదట్లో కొద్ది రోజులు ఇది ఇబ్బందిగానే ఉన్నా, ఆయన తలనొప్పి పూర్తిగా మాయమయింది. దీనితో ఆయన తాను ఇన్నాళ్లు ఎక్కువగా తింటూవచ్చానని తీర్మానించారు. ఈ విషయాన్ని ఆయన ఆత్మకథలో రాసుకున్నారు.
6. గాంధీజీ వైద్యం
గాంధీజీకి ఇంజక్షన్లంటే అఇష్టం. ఎపుడూ సూది వేయించుకునే వారు కాదు. ఒక సారి తీవ్రమయిన విరేచనాలొచ్చాయి. డాక్టర్లు ఒక ఇంజక్షన్ వేయించుకోవాలన్నారు. గాంధీజీ వీలుకాదన్నారు. ఏనీమా ద్వారానే ఆయన ట్రీట్ మెంట్ తీసుకున్నారు.
7. గాంధీజీకి క్రీడలంటే ఇష్టం లేదు
గాంధీకి క్రికెట్ బారిన పడలేదు. ఆయనక్రికెట్ అభిమాని కాదు. అలాగే బాక్సింగ్, హకీ లతో పాటు ఏక్రీడలను ఆయన ఇష్టపడే వాడు కాదు. బ్రిటిష్ ఇండియాలో పుట్టిన వాళ్లు ఫుట్ బాల్, క్రికెట్ అంటే అంతగా వేలం వెర్రిగా ఎలా ఇష్టపడతారో ఆయనకు అర్థమయ్యేదే కాదు. ఆయన సంపాదకత్వంలో వస్తున్న ‘ఇండియన్ ఒపినియన్ ’ లో స్పోర్ట్స్ కాలమ్ ఎందుకు లేదని ఒక పాఠకుడు అడిగినపుడు , ఫుట్ బాల్,క్రికెట్ కంటే వ్యవసాయం మంచి వ్యాయామం, ఆరోగ్యాన్ని కాపాడుతుందని సమాచారమిచ్చారు. 1930-40 మధ్య బాంబేలో పంచముఖ క్రికెట్ టోర్నమెంట్స్ జరిగాయి. అందులో హిందువులు, యూరోపియన్లు, ముస్లింలు, పార్సీలు, రెస్ట్ ఆఫ్ ఇండియా అనే టీమ్ లు పాల్గొనేవి. ఇది మతతత్వాన్ని ప్రోత్సహించడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకసారి హిందువుల టీమ్ (పర్మానందదాస్ జీవన్ దాస్ హిందూ జింఖానా) పంచముఖ టోర్నెమెంట్లో పాల్గొనేముందు ఆయన సలహో కోసం వచ్చినపుడు ఆయన పోటీ లో పాల్గొనవద్దని చెప్పారు. చివరకు 1946లో ఈటోర్నమెంట్ ను రద్దు చేశారు.
8. అమెరికా వెళ్లని బాపూజీ…
తన జీవిత కాలంలో బాపూజీ అమెరికా సందర్శించనే లేదు. జాతీయోద్యమానికి అమెరికా మద్దతు కూడగట్టడానికి మాత్రం ఆయన అన్ని ప్రయత్నాలు చేశారు. అమెరికా నుంచి భారత్ సందర్శించే మిషనరీలను, మినిస్టర్లను, లాయర్లను, జర్నలిస్టులను సంప్రదించి భారత్ సాగిస్తున్న అహింసా ఉద్యమానికి మద్దతు కోరుతూ వచ్చారు.
(ఈ స్టోరీ మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి. trendingtelugunews.com ను ఫాలో కండి)
Thank you