హైదరాబాద్ అంటేనే చార్మినారు, గోల్కొండ, నోరూరించే బిర్యానీ.
పై రెండు చూడనివాళ్లు వాళ్లు ఉండరు, బిర్యానీ తినని వాళ్ళు ఉండరు.
అయితే పొద్దున్నే లేచి అలా హైదరాబాదు పాతబస్తీ రోడ్లమీద కారు నడుపుకుంటూ వెళ్లి చార్మినార్ మక్కా మసీద్ ల దగ్గర కాసేపు గడిపి రావడం అనేది చాలా సరదాగా, థ్రిల్లింగా ఉంటుందని నాకు ఈ రోజే తెలిసింది.
ఇవాళ ఉదయం ఆరున్నరకే నేను, మా అవిడ, అబ్బాయి తో కలిసి గబుక్కున చార్మినార్ చేరుకున్నాం. ఉదయం వేళ కాబట్టి పెద్దగా ట్రాఫిక్ లేకపోవడం కూడా మాకు కలిసొచ్చింది.
ముందు చార్మినార్ దగ్గర్లో ఉన్న మక్కా మసీద్ వెళ్ళాం. ప్రభాత వేళ గుంపులు గుంపులుగా పావురాలు ఎగరడం, పావురాలు గింజలు వేసేవాళ్ళు, ఒక చారిత్రాత్మకమైన కట్టడం, దాని యొక్క గ్రాండియర్ చూసి మా ఆవిడ థ్రిల్లయ్యింది .
పొద్దున్నే అలా గింజలు తింటున్న పావురాల మధ్య నుంచి వెళ్లినప్పుడు ఆ పావురాలు టపటపా రెక్కలు కొట్టుకుంటూ ఎగిరిపోవడం చూస్తే వావ్ అనిపిస్తుంది.
హైదరాబాద్ నగరంలో ఒక చారిత్రాత్మకమైన మసీదు ఇది. చూడటానికి రెండు కళ్ళు సరిపోవు! ఈశాన్యంగా మన చార్మినార్ ఉంది. ఒకప్పుడు వెలిగిపోయిన చార్మినార్ ఇప్పుడు కాస్త వెలిసిపోయింది కానీ, దాని ఠీవి మాత్రం ఇంకా కనిపిస్తోంది. మరమ్మత్తుల నిమిత్తం నాలుగు బురుజులకి కట్టిన వెదురు బొంగులు చూస్తే ఎలాగో అనిపించినా, పొద్దున్నే ఉదయించే సూర్యుడి వెలుతురు లో చార్మినారు ఇంకా అద్భుతంగానే ఉంది!
ఎవరో ఒకాయన అంటున్నాడు” చార్మినార్ ను చూసేవాళ్ళు తక్కువ చెడగొట్టే వాళ్లే ఎక్కువ” అని! నిజమే అనిపిస్తుంది.
చార్మినార్ చుట్టుపక్కల చాలా అపరిశుభ్రంగా ఉంది. దానికి కారణం పర్యాటకులే! చార్మినార్ కు కాస్త దూరంలో నే ఉంది ఖుర్రం నడుపుతున్న ” చార్మినార్ టిఫిన్స్”.
ఒకటే పెనంమీద ఏకబిగిన 10 నోరూరించే దోశలు వేస్తున్నాడు సీతారాం మాస్టర్. ఈ వేడి వేడి ఇడ్లీలు కూడా అప్పుడే ఒక వాయి తీశారు. మేము ఇంకా తినటం మొదలు పెట్టాం. దోసెల్లో దాదాపు 20 రకాలు దాకా ఉన్నాయట! సీతారాం మంచి చేయి తిరిగిన దోశగాడట! ఎవరో చెప్తుంటే విన్నాం. తిన్న తర్వాత నిజమే సుమా అనిపించింది.
అంతగా పల్చగా ఉండని, మరీ అంత మందంగా ఉండకపోవడం చార్మినార్ దోసే ప్రత్యేకత. ఉల్లిపొరలా పల్చగా ఉండే ఉడిపి దోసె నాకంత ఇష్టముండదు. అలాగనీ దిబ్బరొట్టేలాంటి దోసెన్నాకష్టమే. ఈ రెండింటికి మధ్య చక్కగా సంధి కుదిర్చి ఖుర్రం తన ట్రేడ్ మార్క్ దోసె తయారుచేశాడు.
ఇడ్లీలు కూడా బాగున్నాయి. చార్మినార్ టిఫిన్స్ 24 గంటలు ఉంటుందని. రాత్రి ఇంకా బాగా ఉంటుందని ఖుర్రం చెప్పాడు.
మమ్మల్ని మళ్లీ రాత్రి 11 గంటలకు రమ్మన్నాడు. పొద్దున పొద్దున్నే చాలాచోట్ల చాలాసార్లు టిఫిన్ చేశాము , కానీ ఖుర్రం హోటల్ దగ్గర ఇవాళ తిన్న దోశ లాగా ఎప్పుడు ఏ దోశ కుడా ఇంత టేస్టిగా అనిపించలేదు.
బహుశా దానికి కారణం బ్యాక్ గ్రౌండ్ లో నాలుగు బురుజుల(చార్)తో నాలుగువందల సంవత్సరాల చరిత్రను ప్రతిబింబిస్తూ, ఉదయించే సూర్యుడి కాంతి లో ఇంకా ఠీవీ గానే నిలబడి ఉన్న చార్మినార్ కావచ్చు!!(
(*సలీమ్ బాష, ఎడ్యుకేషనల్ సైకాలజిస్టు, లాఫ్ ధెరపిస్టు,రచయిత, స్పోర్ట్స్ జర్నలిస్టు. ఉండేది కర్నూలులో. ఫోన్ నెంబర్.9393737937)