కరువుకు కన్నతల్లిగా మారి, దేశంలోనే నిరంతర క్షామపీడిత ప్రాంతంగా గుర్తింపు పొందిన రాయలసీమ ప్రకృతి శాపంతో కాకుండా పాలకుల పాపం, పక్షపాత ధోరణి, అసమర్థ విధానాలతోనే ఇంతటి దురవస్థకు గురైందని చెప్పక తప్పదు.
ఈ కరువు ప్రాంతంపై ప్రకృతి కొంత మేరకు కన్నెర్ర చేసినా, పూర్తిగా శీతకన్ను వేయలేదని నీటి పారుదల శాఖ గణాంకాలు తెలియ చేస్తున్నాయి.
ఈ ప్రాంతంలో ప్రవహిస్తున్న నదులు, వాటి నీటి ప్రవాహల లెక్కలు ఈ సంగతిని స్పష్టం చేస్తున్నాయి. గత 6-7 దశాబ్దాలలో ఈ ప్రాంతం నుండి పారిన నీటి గణాంకాలు ఈ వాదనను రుజువు చేస్తున్నాయి.
కానీ ఈ ప్రాంత ప్రజలు, పశువుల గొంతు తడపడానికి కానీ, నెర్రలిచ్చిన వ్యవసాయ భూముల గొంతు తడిపి రైతన్నల కడుపు నింపడానికి కానీ చుక్క నీరు అందడం లేదు.
చేయడానికి పనులు లేక, బ్రతకడానికి మరో మార్గం కనిపించక పొట్ట చేత పట్టుకొని వలసలు వెళుతున్న బడుగు జీవుల ఆర్తనాదాలు ఎవరికీ (పాలకులకు, ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులకు) వినిపించడం లేదు. కనిపించడం కూడా లేదు.
సమీప పట్టణాలలో కూడా బ్రతకడానికి వీలులేక భార్య, బిడ్డలను వదలి కుటుంబ పెద్దలు, కట్టుకున్న వాడిని, కనుక్కున్న వారిని వదలి “ఇంటికి దీపాలుగా ఉండవలసిన” ఇల్లాళ్లు దేశాలు పట్టి పోతున్నారు. అలాగే తమ కడుపుతో పాటు, ఇతర కుటుంబ సభ్యుల కడుపులు నింపడానికి వయసుతో నిమిత్తం లేకుండా వ్యభిచార కూపాల పాలవుతున్నారు.
పుస్తెలతో సహా తాకట్టు పెట్టడం, బ్యాంకులలోను, అధిక వడ్డీలకు ప్రయివేటు వ్యక్తుల నుండి అందినంత మేరకు అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్నారు. అయితే సకాలంలో వర్షాలు లేకపోవడం, అరకొర వర్షాలు పడటం, నదుల నుండి ఈ ప్రాంత వాటాగా రావలసిన నీరు రాకపోవడం లాంటి అనేక కారణాలతో పంటలు పండటం లేదు.
అలాగే పండిన పంటకు గిట్టుబాటు ధరలు కూడా లభించక పోవడం మరో దురదృష్టం. అయితే ఇవన్నీ తట్టుకోలేక కొందరు అభాగ్యులు ఆత్మహత్యలకు పాల్పడుతుండగా, మిగిలిన వారు గుండె రాయి చేసుకొని బ్రతుకు బండిని భారంగా లాగుతున్నారు.
ఇంతటి వ్యధామయ జీవితాన్ని గడుపుతున్న రాయలసీమ నిర్భాగ్య జీవులను ఆదుకోడానికి రాష్ట్ర పాలకులు, ప్రజాప్రతినిధులు చేసింది సూన్యమని చెప్పక తప్పదు.
ఈ ప్రాంతం నుండి ఉన్నత స్థాయికి చేరుకున్న రాయలసీమ నాయకులు “తమ పదవులను, నాయకత్వాన్ని పదిలం చేసుకోడానికి, ఇతర ప్రాంత నాయకులను, ప్రజలను సంతృప్తి పరచడానికి, వారి గొంతెమ్మ కోరికలు తీర్చడానికే తమ అధికార సమయమంతా వెచ్చించారు.
ఇక వర్గ పోరుకు, ముఠా కక్షలకు పేరుపొందిన ఈ ప్రాంతం నుండి ఎన్నికైన ప్రజా ప్రతినిధులు “ప్రాంత సంక్షేమం, ప్రజా సమస్యల పరిష్కారం” లాంటి అంశాలకు తిలోదకాలిచ్చి నిరంతరం తమ గుంపును కాపాడుకోడానికి, ప్రత్యర్థిని దెబ్బ తీసి తన వర్గాన్ని బలపరుచుకోడానికి తమ శక్తి యుక్తులను వెచ్చించడం ఆనవాయితీగా మారింది.
మద్రాసు రాష్ట్రం నుండి విడిపోయి ఆంద్ర రాష్ట్రం ఏర్పడే సమయంలో ఈ ప్రాంత ఘనాపాఠీలు ఎంతో పోరాడి, ఈ ప్రాంత ప్రయోజనాలు కాపాడాలని “ పెద్ద మనుషుల ఒప్పందం పేరిట ‘శ్రీభాగ్’ ఒప్పందాన్ని” కాగితాలకు ఎక్కించారు.
అయితే ఆ తర్వాత ఈ ఒప్పందాన్ని అమలు చేయించడంలో(ఈ ప్రాంత నాయకులే ముఖ్యమంత్రులుగా ఉండి కూడా) పూర్తిగా విఫలమయ్యారు. సిద్దేశ్వరాన్ని పక్కన పెట్టి నాగార్జున సాగర్ నిర్మించడంతో రాయలసీమ వాసులు ఆశలకు ఉప్పు పాతర వేశారు.
హైడ్రో ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి కేంద్రంగా నిర్మించిన శ్రీశైలం ప్రాజెక్ట్ “రాయలసీమ అవసరాలు తీర్చడం కంటే” నాగార్జున సాగర్ ను అవసరమైనపుడు నింపడానికి స్టోరేజి ట్యాంక్ గామిగిలి పోయింది. విద్యుత్ ఉత్పత్తి పేరుతొ సాగర్ కు నీళ్లు తరలించడానికి మాత్రమే పనికి వచ్చే ఆనకట్టగా శ్రీశైలం మిగిలి పోయింది.
రాయలసీమకు, నదులు, వర్షాలు, చేసిన/ చేస్తున్న ద్రోహానికి, ప్రకృతి పెడుతున్న శాపాల కంటే కొన్ని వేల రెట్లు పాపాలు చేసింది, శాపాలు పెట్టిందీ ఈ ప్రాంత పాలకులు, ప్రజా ప్రతినిధులే అని ఘంటాపదంగా చెప్పవచ్చు.
నిరుడు సీమకు దక్కిన వాటా
ఉదాహరణగా గత సంవత్సరం ( జూన్ 1, 2018 నుండి మే 31, 2019 వరకు) సుంకేసుల ప్రాజెక్ట్ నుండి దిగువన శ్రీశైలంకు చేరిన నీరు 176 టి.ఎం. సీలు. సుంకేసుల నుండి దిగువకు ప్రవహిస్తున్న తుంగభద్ర నీటి పై రాయలసీమకు హక్కులున్నా, ఈ నీటిని నిలువ ఉంచి, రాయలసీమ అవసరాలకు వినియేగించడానికి అవసరమైన జలాశయాలు లేవు.
గుండ్రేవుల జలాశయం, వేదవతి బ్యారేజి, తుంగభద్ర ఎగువ సమాంతర కాలువ నిర్మాణాలు చేపట్టాలని ప్రజలు గత కొన్ని దశాబ్దాలుగా గొంతు చించుకుంటున్నా గత 7దశాబ్దాలుగా పాలకులు వాగ్ధానాలతోనే ప్రజలను ఊరిస్తూ పబ్బం గడుపుకున్నారు.
అదే విధంగా గత వర్షాకాల సంవత్సరంలో శ్రీశైలం జలాశయానికి చేరిన నీరు 584 టి.ఎం.సి. అంటే సుమారు శ్రీశైలం జలాశయం సామర్థ్యానికి (215 టీఎంసీలు శ్రీశైలం నిల్వ సామర్థ్యం) రెండున్నర రెట్లు.
శ్రీశైలానికి ఇంత నీరు వచ్చినా రాయలసీమలోని ఏ ప్రాంతానికి న్యాయం జరగలేదు. శ్రీశైలం జలాశయం నుండి నాగార్జున సాగర్ కు సాధారణంగా ఇవ్వవలసిన నీరు 281 టి.ఎం.సీలు మాత్రమే. ఐతే 281 టిఎంసిలకు బదులు అధికారిక లెక్కల మేరకు 350 టి.ఎం.సీలు విడుదల చేసినట్లు రికార్డు చేసారు.
మరి రాయలసీమకు గతంలో ట్రిబ్యునల్ కేటాయించిన నీరైనా ఎందుకు ఇవ్వలేదో అప్పటి టీడీపీ నేతలకే తెలియాలి. ఈ నేతలు కోస్తా నాయకులను సంతృప్తి పరచడానికై ఎప్పటి కప్పుడు శ్రీశైలం జలాశయం గేట్ల బార్లా తెరిచి నీటిని సాగర్ కు తరలించారు.
రాయలసీమ జలాశయాలకు నీరందించే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కు కూడా నీరందకుండా చేసి, రాయలసీమ లోని అన్ని జలాశయాలను ఎండగట్టి, ఇక్కడి రిజర్వాయర్లలో తాగడానికి చుక్క నీరు కూడా లేకుండా చేశారు.
ఇదిఇలా ఉండగా గత టీడీపీ పాలకులు “కోట్లాది రూపాయలు వెచ్చించి రైన్ గన్ ల పందారం చేసి” కరువును జయించామని జబ్బలు చరుచుకున్నారు. కృష్ట జలాలను గండికోటకు, అక్కడినుండి పులివెందులకు తరలించడం, పటాటోపంగా ముచ్చుమర్రి ఎత్తిపోతలను ప్రారంభించడం, హంద్రీ-నీవా ద్వారా కుప్పంకు గుప్పెడు నీళ్లిచ్చి భారీ ప్రకటనలతోను, తమ మీడియా ద్వారా భారీగా తమ ప్రగల్భాలను ప్రచారం చేసుకున్నారు.
వాస్తవం ఇలా ఉంది….
తుంగభద్ర పరివాహక ప్రాంతం ప్రజలు వర్షాకాలంలో మురుగు నీరు తాగి బ్రతకగా, వేసవిలో చుక్క నీటి కోసం తలక్రిందులు తపస్సు చేశారు. తుంగభద్ర పరివాహక ప్రాంతంలో ఎండకాలంలో బిందెడు తాగునీటి కోసం జరిగిన యుద్ధంలో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ప్రజలకు ఎంతటి దురవస్తో! ప్రస్తుతం సుంకేసుల ప్రాజెక్ట్ లో చుక్కనీరు లేదు. రాయలసీమ లోని అన్ని జలాశయాలు డెడ్ స్టోరేజ్ కి చేరాయి
ఇకపోతే తమ ప్రాంత నీటి సమస్యలను తీర్చి, తమ బ్రతుకులను వైసీపీ అధినేత జగన్ మారుస్తారని కోటి ఆశలతో అత్యంత ఘనంగా 49 మంది ఎంఎల్ఎలనూ, 8 మంది ఎంపిలను గెలిపించారు.
కనీసం నూతన ప్రభుత్వమైనా నదుల నీటి సక్రమ నిర్వహణ చేసి మిగిలిన ప్రాంతాలతో పాటు సీమ ప్రాంతానికి న్యాయం చేస్తుందని రాయలసీమ ప్రజలు ఎదురు చూస్తున్నారు. శ్రీశైలం రిజర్వాయర్ కనీసం నీటి మట్టం 854 అడుగులకు పునరుద్ధరించి, బ్రిజేష్ ట్రిబ్యునల్ కేటాయించిన 60 టీ.ఎం.సిల క్యారీ ఓవర్ నీటిని కరువు ప్రాంతానికి కేటాయించే విధానాలను స్పష్టం గా అమలుచేస్తారని ప్రజలు భావిస్తున్నారు.
రాయలసీమలోని జలాశయాలు ఎండిపోకుండా కాపాడాలని, శ్రీశైలం రిజర్వాయర్ లోనికి పూడిక చేరడం నిరోదించి, రిజర్వాయర్ జీవితం కాలాన్ని పెంచేందుకు సిద్దేశ్వరం అలుగు నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
రాయలసీమలో నదులు, జలాశయాలు పకృతి శాపంతో ఎండిపోలేదు. గత పాలకులు అనుసరించిన పక్ష(వా)పాత విధానాలతో మాత్రమే ఎండి పోయి, సీమ ప్రజల బ్రతుకులను ఛిద్రం చేశాయి. యువ నాయకుడి నేతృత్వంలోని ప్రస్తుత నూతన ప్రభుత్వమైనా సరైన విధానాలతో అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేస్తారని సీమ ప్రజలు ఆశిస్తునారు.(పోటో సౌజన్యం ఫస్ట్ పోస్ట్)