అప్రకటిత ప్రపంచాధినేత అయినా అమెరికాను రెండు ఘోర వైఫ్యల్యాలు కుదిపేశాయి. అమెరికా సమాజాన్ని రచ్చరచ్చ చేసిన ఈ రెండు వైఫల్యాలలో మొదటిది మద్యపాన నిషేధమయితే (1920-1933), రెండోది వియత్నాం యుద్ధం (1955-1975). ఈ రెండింటిలో అమెరికా ఎందుకు విఫలమయిందనే దాని మీద ఆదేశ మేధావులంతా జట్టుపీక్కుని తెగ రీసెర్చ్ చేస్తున్నారు. టన్నుల కొద్ది పుస్తకాలు రాస్తున్నారు.
నిజానికి ఎపుడో ఎనిమిది దశాబ్దాల కిందటి అమెరికా మద్య పాన నిషేధం గురించి ఈ తరానికి పెద్దగా తెలియదు. ఇపుడున్నది ఇలాంటి ఆసక్తికరమయిన విషయాల గురించి ఆలోచించే తీరికలేని తరం. అయినా సరే పరిశోధనలు, పుస్తకాలు అగడం లేదు. మద్యపాన నిషేధం, వైఫల్యం అమెరికాని ఎంత కకావికలం చేసిందో తాజాగా వచ్చిన పరిశోధనాత్మక పుసక్తం War On Alcohol (Lisa McGirr 2016) కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. లిసా వాడిన అకడెమిక్ లాంగ్వేజ్ కొంత భారం అనిపించినా ,మద్యపానం నిషేధాన్ని అర్థం చేసుకోవాలనే అనుకునే వాళ్లు తప్పక చదవాల్సిన పుసక్తం ఇది.
1933లో రూజ్ వెల్ట్ అధికారంలోకి వచ్చిందే మద్యపానం నిషేధం సమస్య మీద. 1920లో మధ్య పాన నిషేధం మొదలవుతూనే వచ్చిన మొదటి పుస్తకం The Origins of Prohibition (Allan Krout 1925). అప్పటి నుంచి మధ్య పాన నిషేధ వైఫల్యంలో కొత్త కోణాన్ని చూపిస్తూ పుస్తకాలు రాని సంవత్సరమంటూ లేదు.ఇందులో బ్లాక్ బస్టర్ పుస్తకాల గురించే నేను చెబుతాను. 1962లో యాండ్రూ సింక్లేర్ Prohibition: The Era of Excess రాశారు. Deliver us from Evil: An Interpretation of American Prohibition (Normal Clark 1976), Prohibition: Thirteen Years that Changed America (Norman Behr-1997), Last Call (Daniel Okrent 2010) అనేవి బెస్ట్ సెల్లర్స్. ఈ పరిశోధనలన్నీ చెప్పిన విషయం ఒక్కటే, అమెరికా నిషేధం ఒక విఫల ప్రయోగం అని. నిషేధం అమెరికా సమాజంలో ఎనలేని ఉద్రికత్త తీసుకువచ్చింది. కొత్త చట్టాలు పోలీసు యంత్రాంగానికి విపరీతమయిన అధికారాలను బలాన్ని ఇచ్చాయి. అక్కడ మద్యపాన బాధితులను ఎంపవర్ చేయలేకపోయాయి.
పారిశ్రామిక ప్రగతి వల్ల పట్టణాల్లోకి వలస వస్తున్న అలగాజనాన్ని,శ్వేతజాతీయేతరులను, అపుడే వుప్పొంగుతున్న జాజ్ సంస్కృతిని నిషేధం ఒక వైపు నిలబెట్టింది, వీళ్లకి వ్యతిరేకంగా నిషేధం కావాలంటున్నశ్వేతజాతి రైటిస్టులను మరొక వైపు నిలబెట్టింది. ఈ రెండు వర్గాల మధ్య సాగిన 13 సంవత్సరాల యుద్ధమే అమెరికా నిషధమని ఈ పరిశోధనలన్నీ చెబుతాయి. పేదల మీద, నల్ల వాళ్ల మీద, వాళ్ల అల్పసంతోషాలమీద, వాళ్లు సరదాగా గుమికూడే సెల్లూన్ల మీద పోలీసులు యుద్ధం ప్రకటించారు. వీళ్లకి కూ క్లక్స్ క్లాన్ వంటి ప్రయివేటు సైన్యం తోడయింది. ఒక ఉన్నత లక్ష్యంతో మొదలయిన సాంఘిక సంక్షేమ పథకం చిన్నాభిన్నమయింది. నిషేధానికి మద్దతు నిస్తున్న వర్గాల ఆలోచనల, విశ్వాసాల, దృక్పధాల ప్రకారం చట్టం బలవంతంగా అమలయింది తప్ప, అమెరికా రాజ్యంగ సవరన ఆశించినట్లు పేదలకు భద్రత, జీవితాలకు భద్రతు, గృహిణులకు భద్రత, వూర్లో భద్రత, సాంఘికంగా భద్రత అనేవి దొరకలేదు. నిషేధ చట్టం వచ్చింది కాబట్టి మనుషుల్ని చంపైనా చట్టం అమలుచేస్తామనే ‘భద్రతా ఉగ్రవాదం’ తలెత్తింది. ఇది చట్టం ముందు అందరిని సమానుల్ని చేయలేకపోయింది.ఈ చట్టం పేదలకు, శ్వేతజాతీయేతరులకు శాపంగా మారింది.
చట్టం అమలులో పలుకుబడి, అవినీతిచొరబడింది. మద్యం దొంగవ్యాపారం ద్వార ఏరులై పారింది. పేరుకు నిషేధమే కాని, రాజకీయ నాయకులు, పోలీసులు, డబ్బున్నవాళ్లు దర్జాగా ‘ప్రయివేటు’ గా మందు సేవిస్తూనే ఉన్నారు. ‘ప్రయివేటు’ వసతి లేని అలగా జనం చట్టం బారిన, కూ క్లక్స్ క్లాన్ బారిన పడ్డారు. ఈ బాధితులంతా నిషేధంతో విసిగి వేసారి చివరకు రాజకీయ నిర్ణయం తీసుకుని నిజమయిన భద్రత కోసం డెమోక్రట్ల పంచన చేరాల్సి వచ్చింది. గాలివాటం చూసి ఈ పార్టీ 1928 లో నిషేధం ఎత్తివేసి పేదలను కాపాడతామని హామీ ఇచ్చింది. ఈ దెబ్బకి ఫ్రాంక్లిన్ రూజ్ వెల్ట్ అఖండ విజయం సాధించారు. నిషేధాన్ని ఎత్తివేసేందుకు చర్యలు తీసుకున్నారు. ఒక పవిత్రాశయంతో వచ్చిన చట్టం అమెరికా రాజ్యాంగ చరిత్రలో ఒక కామిక్ ట్రాజెడీ అయింది. నిషేధం ఎంతగా అభాసు పాలయిందంటే, నిషేధం కోసం చేసిన అమెరికా రాజ్యంగ సరణను(18వ సవరణ) ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. అమెరికా చరిత్రలో ఒక రాజ్యాంగ సవరణని ఉపసంహరించుకునేందుకు మరొక సవరణ (21వ సవరణ)తీసుకురావడం అదే మొదటిసారి.
సమస్య ఒక్కటే అయినపుడు పర్యవాసానాలు ఒకలాగే ఉంటాయి. అందుకే ప్రపంచంలో మద్యపాన నిషేధం ఎక్కడ విధించినా అక్కడ అమెరికా అనుభవం వెక్కిరిస్తూ ఉంటుంది.
ఒక్క గొప్ప ఆశయంతో అంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మద్య పాన నిషేధం విధించబోతున్నారు. అందుకే అమెరికా అనుభవాన్ని అధ్యయనం చేయడం పనికొస్తుంది. ఇదే విధంగా చారిత్రకంగా భారతదేశంలో తొలినుంచి మొదలయిన మద్య పాన నిషేధ ఉద్యమం కూడా సమస్యను అర్థం చేసుకునేందుకు పనికొస్తుంది.
భారత దేశంలో నిషేధం
ఒక చట్టం అమలుకావాలంటే మహోన్నత ఆశయమెక్కటి చాలదని అమెరికా అనుభవం, దాదాపు అదేసమయంలో భ్రిటిష్ ఇండియా రాష్ట్రాలలో వచ్చిన మద్య పాననిషేధం చెబుతుంది. దీని వల్ల పోలీసుయంత్రాంగ బలిసిపోతుంది. రాజకీయ వత్తాసు లేని పేదల మీద ఇది ప్రతాపం చూపుతుంది. పట్టణాల్లో సమృద్ధిగా డబ్బు పలుకుబడి ఉన్నోళ్లకు మందు నేరుగా డోర్ డెలివరీగా ఇంటికొస్తుంది.
ఇలాంటి వైభోగం సాధ్యం కాని పేదలు ఇతర అక్రమమార్గాల్లో తాగుడు అలవాటు చేసుకుని పోలీసులకు దొరికి పోతూ కేసులపాలవుతుంటారు. అంతవరకు చట్టాన్ని గౌరవించిన వాళ్లు, నిషేధ కాలంలో రెండు గుక్కెల కోసం చట్టాన్ని ఉల్లంఘించాల్సి వస్తుంది. అమెరికాలో జరిగిందిదే. ఇండియాలో ఇపుడు నిషేధం అమలులో ఉన్న రాష్ట్రాలన్నింటా జరుగుతున్నదిదే.
ఆంధ్రప్రదేశ్ లో 1995-1997 మధ్య నిషేధం అమలుజరుగుతున్నపుడు జరిగింది కూడా ఇదే. నిషేధం ఎపుడూ పూర్తిగా అమలు కాలేదు. నిషేధ సమయంలో బీర్ తప్ప అన్ని రకాల మందు సమృద్ధిగా దొరికింది. బీరు అలవాటున్నవాళ్లు బీర్ నుంచి ఇతర హార్డ్ లిక్కర్స్ కు మారారు.
స్మగ్లింగ్ జోరుగా సాగింది. వాళ్లు వేల కోట్లు వెనకేసుకున్నారు. అవినీతి అధికారులూ సంపాదించారు. పేదల, గ్రామీణులు, పట్టణాల బస్తీలలో ఉండేవాళ్ల ఇతర నాసిరకాల మందుకు అలవాటుపడ్డారు. అవి తాగి మృత్యవాత పడ్డారు.
జాతీయోద్యమకాలంలో నిషేధం
నిజానికి భారతదేశంలో మద్యపానం నిషేధించాలన్నది ఒక రాజకీయ నినాదంగా స్వాతంత్ర్య పోరాట కాలంలో మొదలయింది. . బ్రిటిష్ వాళ్లు అబ్కారీ చట్టం (Madras Abkari Act 1886) తీసుకువచ్చి అన్ని రకాలమద్యం వ్యాపారాలను తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. 1888-1920 మధ్య కాలంలో బ్రిటిష్ ప్రభుత్వం కల్లు ,సారా వ్యాపారంతో పాటు విదేశీ మద్యం అమ్మకాలను అదుపులోకి తీసుకుని బాగా ప్రోత్సహించింది. దుకాణాల లెసెన్స్ లమీద రాబడి బాగా ఉండటంతో ఆల్కహాల్ ప్రధాన ఆదాయవనరు అయింది. ఇదే కాలంలోనూ మద్యపాన నిగ్రహ ఉద్యమం కూడా మొదలయింది.
ఒక వైపు విదేశీ మద్యం వ్యాప్తి , మరొక వైపు జాతీయోద్యమం బలపడటం ఈ కాలం ప్రత్యేకత. జాతీయోద్యమ నాయకులు విదేశీ మద్య వ్యాప్తి భారత వ్యతిరేక మహమ్మారిగా ప్రచారం చేశారు. భారతీయత మీద దాడి అన్నారు. మద్యం విదేశీ పాలన, అనైతికత, భారత వ్యతిరేకత కు మారురూపంగా ప్రచారం చేశారు. మద్యాన్ని నిషేధించాలని మహత్మాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ క్యాంపెయిన్ మొదలుపెట్టింది. మద్యాన్నిమహాత్మగాంధీ ఎంత తీవ్రంగా వ్యతిరేకించారో ఈ ఫేమస్ కోట్స్ చెబుతాయి.
“I hold drink to be more damnable than thieving and perhaps prostitution.”
“If I was appointed dictator for one hour for all India, the first thing I would do would be to close without compensation all liquor shops.”
అంతవరకు బ్రిటిష్ స్ఫూర్తితో సాగుతున్నమద్యపాన నిగ్రహ ప్రచారం మహాత్మగాంధీ సూత్రీకరణతో భారతజాతీయోద్యమంలో భాగమయింది. స్వదేశీ ఉద్యమం, సహాయనిరాకరణోద్యమం,శాసనోల్లంఘణోద్యమంలో మద్యపాన నిషేధం పిలుపు విడదీయ దాని భాగమయింది. ఈ స్ఫూర్తితోనే బ్రిటిష్ ఇండియా రాష్ట్రాలలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు మద్యపాన నిషేధం చట్టం తీసుకువచ్చాయి.
అయితే, దేశ వ్యాపితంగా ఉధృతంగా జాతీయోద్యం సాగుతున్నపుడు కూడా దేశంలో మద్య పాన సేవనం తగ్గలేదు. దేశంలో అయిదో వంతు జనాభా తాగుడులోఉన్నారని అంబేద్కర్ స్వయంగా అంగీకరించారు. మద్రాసు రాష్ట్ర రెవిన్యూ లో ఎక్సయిజ్ వాటా 38 శాతం ఉంది.
1930-31 మధ్య శాసనోలంఘనోద్యమం కాలంలో నిషేధం కావాలనే వాళ్లకి, వద్దనే వాళ్ల కి మధ్య కొట్లాటలు మొదలయ్యాయి. హింస కూడా చెలరేగింది. జాతీయోద్యమాన్ని ఉన్నత కులాల విశ్వాసాలకు అనుగుణంగా నడుపుతున్నారనే విమర్శ వచ్చింది.
1935 భారత ప్రభుత్వం చట్టం తో రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి రావడంతో అబ్కారీ చట్టాన్నిరాష్ట్రాలకు బదలాయించారు. 1937లో మద్రాసు, బొంబాయి, యునైటెడ్ రాష్ట్రాలలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు పైలట్ గా నిషేధం విధించాయి. మద్రాసు రాష్ట్రంలో ముఖ్యమంత్రి రాజగోపాలాచారి అసెంబ్లీలో సెప్టెంబర్ 25న నిషేధపు బిల్లు తీసుకువచ్చారు. దానికి తీవ్రవ్యతిరేకత వచ్చింది. ఇ.వి రామస్వామి నాయకర్ కూడా వ్యతిరేకించారు.
మొత్తానికి బిల్లు (Prohibition Act of 1937) పాసయింది. సేలం జిల్లాలో మొదట అమలుచేశారు. తర్వాత నార్త్ ఆర్కాట్, కడప చిత్తూరులకు విస్తరించారు. 1939 నవంబర్ 1939న రెండో ప్రపంచయుద్ద వాతావరణంలో రాజగోపాలాచారి రాజీనామా చేసిన అనంతరం పట్టుదల ఉన్నవారు అధికారంలో లేకపోవడం, ప్రజలలో కూడా నిషేధానికి మద్దతు తగ్గిపోవడంతో 1943లో నిషేధం ఎత్తి వేశారు (Act XXII of 1943). ఈ మధ్య కాలంలో ఎక్సయిజ్ రెవిన్యూలేని లోటు పూరించుకునేందుకు రకరకాల పన్నులు విధించారు.చట్టం అప్రతిష్టపాలయిందనక తప్పదు.
స్వాతంత్య్రానంతరం నిషేధం
జాతీయోద్యమ స్ఫూర్తి తో కూడా దేశంలో మద్య నిషేధాన్ని అమలుచేయడం కష్టమయిందని ఈ చరిత్ర చెబుతుంది. జాతీయ స్థాయిలో మద్యపాన నిషేధం అమలుచేసేందు 1977లో ప్రధాని మొరార్జీ దేశాయ్ నాయకత్వంలోని జనతా ప్రభుత్వం ఒక ప్రయత్నం చేసింది. జాతీయ మద్యపాన నిషేధ విధానం ప్రకటించింది. అయితే, నిషేధం అపుడు జనతా ప్రభుత్వాలున్న రాష్ట్రాలలో మాత్రమే అమలయింది.
నిషేధం వల్ల రాష్ట్రాలు కోల్పోయే రాబడిని కేంద్రం భరిస్తుందని కూడా మొరార్జీ హామీ ఇచ్చారు. అవినీతి, దొంగవ్యాపారుల, రాజకీయ నేతల అపవిత్ర కూటమి వల్ల అది వీగిపోయింది. ఎందుకంటే, చివరకు దొంగ మద్యం ఆయుర్వేదిక్క మందుల రూపంలో కూడా మార్కెట్లోకి వచ్చింది.
తర్వాత అనేక రాష్ట్రాలు(గుజరాత్, బీహార్, నాగాలాండ్,మిజోరం లక్ష ద్వీప్)పూర్తి మద్యపాన నిషేధం అమలుచేశాయి.కేరళ, తమిళనాడులు పాక్షిక నిషేధంలో స్థిరపడ్డాయి. చట్టాలను తీసుకువచ్చాయి. కొన్ని సందర్భాలలో చట్టాలను సడిలించాయి.హర్యానా, అంధ్రప్రదేశ్ చట్టాన్ని తీసుకువచ్చి, అమలుచేయలేక ఉపసంహరించుకున్నాయి.
గుజరాత్ లో నిషేధం ఎందుకుందంటే అది గాంధీ పుట్టిన నేల కాబట్టి తప్పని సరిగా అమలుచేయాల్సివస్తున్నది. ఈ మొక్కుబడితోనే అక్కడ నిషేధ చట్టం అమలవుతూ ఉందని మీడియా వార్తలు చూస్తే అర్థమవుతుంది. చట్టం చాలా కఠినంగా అమలవుతున్నది కేవలం పేపర్ మీదే అనే విమర్శ కూడా ఉంది.
మద్యపాన ప్రియులకు నిషేధం ఒక వరమయింది. తాహతు ఉన్నవాళ్లకి డోర్ డెలివరీ జరగుతూ ఉంది. మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, రాజస్థాన్ లనుంచి లిక్కర్ విపరీతంగా దొంగ రవాణా అవుతూ ఉందని వార్తలు చదువుతున్నాం. ఇది అందుబాటులో లేని వాళ్లు నాసిరకం మందు తాగున్నారు. దీని పర్యవసానంగా 2009లో 149 చనిపోయారు. అది కూడా అహ్మదాబాద్ వంటి మహానగరంలో.
1999-2009 మధ్య బుక్ అయిన 70,899 ప్రొహిబిషన్ కేసులలో శిక్ష పడింది కేవలం 9 శాతానికే. 2017 ఫిబ్రవరిలో నిషేధచట్టం ఉల్లంఘించారని దాఖలయిన ఎఫ్ ఐ ఆర్ ను కొట్టి వేయాలని వేసిన కొన్ని పిటిషన్ల మీద విచారణ చేస్తూ రాష్ట్ర హైకోర్టు చేసిన వ్యాఖ్య గుజరాత్ నిషేధం చట్టం ఎలా ఉందో చెబుతుంది. నిషేధం సత్ఫలితాలు ఇవ్వడంలేదని న్యాయమూర్తి పర్డివాలా చాలా స్పష్టంగా వాఖ్యానించారు.
“I take judicial notice of the fact that the prohibition policy in the State of Gujarat has not been able to yield positive results. One may not find an open bar on a public street, but the number of cases, as on date, pending in the different Courts in the State of Gujarat, bears eloquent testimony to the fact that either the policy is not effective or something is wrong in the implementation of the law.”
ఇక బీహార్ లో నిషేధం చూస్తే… గుజరాత్ అనుభవం తర్వాత 2016 ఏప్రిల్ 5 నుంచి ముఖ్యమంత్రి నితిష్ కుమార్ ప్రభుత్వం నిషేధం అమలుచేస్తున్నది. ఇక్కడ అమలు తీరు ఇంకా శైశవ దశలోనే ఉందనాలి. అయితే, ‘నిషేధం ఫలాలను అందిస్తూ ఉందని పట్నా కేంద్రంగా పనిచేసే ఏషియన్ డెవెలప్ మెంట్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (ADRI), Development Management Institute(DMI) అనే రెండు సంస్థలు చెప్పాయి.
ఈ సంస్థల అధ్యయనం ప్రకారం బీహార్ కు ఇపుడ నెలనెలా రు. 440 కోట్లు అదా అవుతున్నాయి. ఎట్లంటే… రాష్ట్రంలో 44లక్షల మంది మందు ప్రియులున్నారు. వారు తలసరి సగటున నెలకు రు.1000 లు ఖర్చుచేస్తున్నారు. ప్రభుత్వం నిషేధం విధించిన తర్వాత వాళ్లు తాగడం మానేశారు. అందువల్ల ఈ లెక్కన రు.440 కోట్లు మిగిలినట్లే. ఈ లెక్కన ఏడాదికి రు. 5280 కోట్లు ఆదా.’ అని ఈ సంస్థలు చెప్పిన విషయాన్ని బీహార్ ఎకనమిక్ సర్వే 2017-18లో ఉదహరించారు. ఇది ముఖ్యమంత్రి నితిష్ కుమార్ మరింత ఉత్సాహంగా ముందుకు పోయేందుకు కచ్చితంగా ఉపయోగపడుతుంది.
ఆంధ్రప్రదేశ్ లో నిషేధం
ఎన్టీరామారావు నాయకత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం 1995 జనవరి లో మద్యపాన నిషేధం తీసుకువచ్చింది. అయితే 1997లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుశం ప్రభుత్వమే నిషేధాన్ని ఎత్తివేస్తూ చట్టం తీసుకువచ్చింది. నిషేధం ఎత్తివేయడానికి ప్రభుత్వం చెప్పిన కారణం రు. 960 కోట్ల బడ్జెట్ లోటు. చట్టాన్ని కఠినంగా అమలుచేయలేకపోయామని ఉపసంహరణ బిల్లు మీద మాట్లాడుతూ మద్య నిషేధ మంత్రి నెట్టెం రఘురాం అంగీకరించారు.
1995 జనవరి నుంచి 1997 ఏప్రిల్ దాకా ఆంధ్రప్రదేశ్ లో నిషేధం ఘోరంగా విఫలమయింది. పేరుకు బహిరంగంగా మద్యం దుకాణాలు లేవుగాని కావాలనుకున్నవారికంతా మద్యందొరికింది. పక్కరాష్ట్రాలనుంచి విపరీతంగా దొంగరవాణా అయింది. రాజకీయనాయకులకు, ప్రభుత్వంలో పలుకుబడి ఉన్నవారికి నిషేధమే లేదు. పేద వాళ్ల మీద మాత్రం చట్టం ప్రతిభావంతంగా పనిచేసింది. మధ్యనిషేధం కోసం వచ్చిన ఉద్యమాలు నిషేధం ఎత్తివేస్తున్నపుడు రాకపోవడం గమనించాలి. నిషేధ సమయంలో మద్యం లభించే తీరును బట్టి ఏ రాష్ట్రం కూడా మధ్యం ప్రజలకు అందకుండా పూర్తిగా నిషేధించలేదని అర్థమవుతుంది. నిషేధం ఉంటుంది మద్యపానం జరుగుతూ ఉంటుంది. ఇదీ వైరుధ్యం.
జగన్ ప్రభుత్వం నిషేధం ప్రతిపాదన
ఇపుడు కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్యనిషేధం అమలుచేస్తారని వార్తలొస్తున్నాయి. ఈ విషయం మీద ఆయన దగ్గిర నుంచి ఇంకా స్పష్టమయిన ప్రకటన రాలేదు. కాకపోతే, అధికారులతో మాట్లాడుతూ దశల వారీగా మద్యనిషేధం అమలుచేయాలని కోరినట్లు వార్తలొచ్చాయి. నిషేధం అమలుచేసే ముందు ఆయన తీవ్రంగా ఆలోచించాల్సింది మద్యం మీద వస్తున్నరాబడికి ప్రత్యామ్నాయం ఏమిటి అనేది. ఎందుకంటే,2018-19లో ఎక్సైజ్ శాఖ నుంచి వచ్చిన రాబడి రు. 17,340 కోట్లు. అంతకు ముందు సంవత్సరంకంటే ఇది 12.96 వాతం ఎక్కువ. 2015-16 ఇది కేవలం రు.12,474 కోట్లు మాత్రమే(పై టేబుల్). జగన్ నిషేధం ప్రకటించగానే ఈ రాబడి పోతుంది. అయితే,సామాజిక సంక్షేమం ధ్యేయంగా పెట్టుకున్నపుడు ఈ మాత్రం త్యాగం తప్పేమీ కాదు. అయితే, 1995లో ఎన్టీరామారావు మద్య నిషేధం విధించేటప్పటికి ఆంధప్రదేశ్ ఇంకా కన్సర్వేటివ్ సొసైటీయే. మద్యాన్ని చాలా మటుకు తప్పుగా, అపవిత్ర అలవాటు చూసే వాళ్లు. ఈ రెండు దశబ్దాల కాలంలో రాష్ట్రం చాలా ముందుకుపోయింది. దుకాణాలు బార్లు, ఫ్యామిటీ రెస్టరాంట్లు బాగా పెరిగాయి. కుటుంబాల ఆదాయలు పెరిగాయి. యువకులు విదేశాలలో ఉద్యోగాలలో స్థిరపడి సంపాదను రాష్ట్రానికి పంపిస్తున్నారు. మద్యపానానికి సామాజిక ఆమోదం బాగా విస్తరించింది. మహిళా సమాజంలోకి కూడా మద్యపానం విస్తరించింది. తెలుగు సమాజంలో మద్యాన్ని ఇష్టపడే వాళ్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత ప్రభుత్వాలు తీసుకువచ్చిన మద్యవిధానాల వల్ల మద్యం దొరకని ప్రదేశమంటూ లేకుండా పోయింది. సామాజిక ఆమోదం విస్తరించడంతో పూర్వం లాగా కుటుంబాలలో మద్యం ఇపుడు ఘర్షణ పెంచే వాతావరణ తగ్గిందనాలి. ఈ నేపథ్యంలో ఒకే చట్టాన్ని అందరి మీద అంటే అల్పాదాయ వర్గాల మీద, పట్టణ మధ్యతరగతి మీద రుద్దడం ఎంతవరకు సబబనే విషయం కూడా చర్చనీయాంశమయింది. మద్యం దురాచారం అనే భావన పలుచబడుతూ ఉంది. సమాజంలో మిత మద్య ప్రియులున్నారు. నిషేధం ఈ వర్గంలో విపరీత పర్యవసానాలు తీసుకురాకుండా ప్రభుత్వం జాగ్రత్త పడాలి. ప్రపంచంలో ఏ సమాజమూ మద్యాన్ని పూర్తిగా నిషేధించలేకపోయింది.కారణం, అందువల్ల ఆంధ్రప్రదేశ్ లో నిషేధం మద్యాన్ని నివారించగలరా? దొంగ మద్య సరఫరా కాకుండా ఆపేయగలరా? నాసిరకం మద్యం అందుబాటులో లేకుండా చేయగలరా? ఇవన్నీ చేసినపుడే నిషేధానికి అర్థముంటుంది.జగన్ ఏంచేస్తారో చూద్దాం.
-జింకా నాగరాజు
( ఈ వ్యాసం సంక్షిప్త రూపం బిబిసి తెలుగులో అచ్చయింది.)
ఈ వ్యాసం మీకు నచ్చితే నలుగురికీ షేర్ చేయండి.trendingtelugunews.com ను ఫాలో కండి