(యనమల నాగిరెడ్డి)
ప్రస్తుత రాజకీయాలలో ఉన్న నాయకుల గురించి చెప్పవలసి వస్తే రాజకీయ కురువృద్ధుడుగా చంద్రబాబునే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆయనకు 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. అవిభక్త, విభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు టీడీపీ అధినేత చంద్రబాబే.
ఇకపోతే ప్రతిపక్ష నాయకుడుగా కూడా ఆయనకు గణనీయమైన అనుభవం ఉంది. జాతీయ రాజకీయాలలో అనేక సార్లు చక్రం తిప్పిన నేత కూడాచంద్రబాబు నాయుడే. రాజకీయ రణ రంగంలో అవసరానుగుణంగా జిత్తులమారి ఎత్తులు వేయడం, పొత్తులు కలుపు కోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య (బాబుగారు తన అవసరం కోసం ఉపయోగించుకునే వారిని “ఏరుదాటినంతవరకు మల్లన్న- ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అంటారని” ఆయనకు సన్నిహితంగా ఉన్న సీనియర్లంటుంటారు.). 2014 ఎన్నికల నాటికి కూడా ఆయన మేధస్సు చురుకుగానే ఉందని ఆయన అంతేవాసుల నమ్మకం.
అయితే ఇటీవల జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అంతటి ఘన చరిత్ర ఉన్న చంద్రబాబు “రాజకీయంగా ఇంకా పూర్తిగా అడుగులు వేయడం కూడా రాని వైసీపీ అధినేత పన్నుతున్న రాజకీయ ఎత్తుగడలకు తలక్రిందులౌతూ జగన్ ఉచ్ఛులో పడిపోతున్నారని చెప్పక తప్పదు”.
నేను గేట్లు తెరిస్తే……. నీకు ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా దక్కదు
గురువారం శాసనసభ లో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ “ పార్టీ మారాలనుకుంటున్న టీడీపీ ఎంఎల్ఏ లకు నేను మాట చెప్పిన, గేట్లు తెరిచినా నీకు ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా ఉండదు. వారిని గురించి నేను చెప్పడం లేదు. విలువలున్న రాజకీయాలు చేయాలనుకుంటున్నాను” అన్నారు. చంద్రబాబు ఇందుకు ప్రతిగా తన పార్టీ ఎంఎల్ఏలుఅలాంటి వారు కాదని, పార్టీ ఫిరాయించడానికి ఎవరు సిద్ధంగా లేరని ధీమాగా ప్రకటించలేకపోయారు.
పైపెచ్చు “పార్టీ మారాలనుకుంటున్న వారెవరు?” అన్న అంశంపై తన వేగులతో చంద్రబాబు ఆరా తీస్తున్నారని సోషియల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
అంతకు ముందు కోటంరెడ్డి శ్రీధర రెడ్డి టివి చర్చలలో టీడీపీ వారు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారని చేసిన వ్యాఖ్య, నిన్న శాసనసభలో జగన్ ప్రకటన చంద్రబాబు మనసులో అనుమాన బీజాలను బలంగా నాట గలిగాయి. టీడీపీ సభ్యులు పార్టీ మారతారా? లేదా? అన్న అంశం పక్కన పెడితే రాజకీయాలలో ఎవరినీ నమ్మకుండా నిత్య శంకితుడిగా ఉన్న చంద్రబాబు మనసులో శంఖలు రగల్చడం, కల్లోలం సృష్టించడంలో జగన్ విజయం సాధించారు. పార్టీ మారాలనుకుంటున్న వారు తమ పదవులకు రాజీనామా చేసి రావాలన్నా జగన్ ప్రకటన చంద్రబాబుకు కొంత ఊరట.
ప్రత్యేక హోదా….
ఇక రాష్ట్ర విభజనకు ముందు తనకు తెలంగాణ, ఆంద్ర రెండు కళ్ళు అని ప్రకటించి, ఆ తర్వాత రాష్ట్ర విభజనకు సై అని కేంద్రానికి లేఖ ఇచ్చారు. విభజన సమయంలో అప్పటి కాంగ్రేస్ ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా, వెనుక పడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజి లాంటి వరాలు ప్రకటించినా బాబు గారు పట్టించుకోకుండా “హోదా ఏమైనా సంజీవనా?” అని ప్రశ్నించి “ప్యాకేజీయే ముద్దు” అని అందరినీ నమ్మించడానికి యత్నించారు.
2014 నుండి ఇప్పటి వరకు ప్రత్యేక హోదాను తన భుజాలపైన మోస్తున్న జగన్ తన ఎంపీలతో అవిస్వాసం పెడితే ఇస్తామని పక్కకు తప్పుకున్నారు. వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తే ‘డ్రామా’ అన్నారు. ఆ తర్వాత ఆయన బీజేపీతో చెడి పోయే ముందు “టీడీపీ హోదా డ్రామా”కు తెరలేపారు. “ప్యాకేజీ కాదు- హోదానే ముద్దు” అంటూ కొత్త పల్లవి ఎత్తుకొని జగన్ ఉచ్చులో చిక్కుకున్నారు. ఎన్నికల సమయంలో రాబోయే కేంద్ర ప్రభుత్వం హోదా ఇస్తుందని ఢంకా బజాయించారు.
కాంగ్రెసుతో పొత్తు …..
బీజేపీతో తెగతెంపులు చేసుకోవడంలోనూ వైసీపీ ఎత్తుగడలో చంద్రబాబు చిక్కుకున్నారు. బీజేపీతో వైసీపీ ఎంపీలు సన్నిహితంగా మెలగడం, వారికి బీజేపీ ప్రాధాన్యం ఇవ్వడం, అనేక ఇతర (తనకు లబ్ది కలిగించే) అంశాలపై బీజేపీ తీరు మింగుడు పడని బాబు బీజేపీతో తెగ తెంపులు చేసుకొని కాంగ్రెస్ తో జత కట్టారు. “రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించే వారికి మద్దతు ఇస్తామని” జగన్ ప్రకటించి (ఎవరు అధికారంలోకి వచ్చినా) తన అవకాశాలను సజీవంగా ఉంచుకున్నారు. జగన్ ఎత్తుగడను అంచనా వేయడంలో విఫలమైన బాబు గారు రాష్ట్ర అవసరాలను కాంగ్రెస్ మాత్రమే తీరుస్తుందని తన జన్మ విరోధిని బుజానికెత్తుకున్నారు.
పథకాల ప్రకటన…
వైసీపీ అధినేత జగన్ ‘నవరత్నాల పేరిట’ తన ఫథకాలను ఏంటో ముందుగా ప్రకటించారు. అలాగే బిసి డిక్లరేషన్, రైతులకు,మహిళలకు, విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు, వృద్దులకు తానందించే తాయిలాలను ఎన్నికలకు ఏంటో ముందు ప్రకటించారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు జగన్ ప్రకటించిన ఫథకాలను ప్రకటించి, అమలు చేయడానికి యత్నించారు. “జగన్ చెప్పాడు- బాబు చేస్తున్నాడు” అని జగన్ ప్రచారం చేసుకునే వీలు, ప్రజలు నమ్మే అవకాశం కల్పించాడు.
కేసీఆర్ టీమ్ తో జత కట్టనునట్లు జగన్ సూచించారు. దీంతో చంద్రబాబు “ కెసిఆర్, మోడీ, జగన్ కూటమిపై” దుమ్మెత్తి పోశారు. వీరిని భూతాలుగా చూపి ముస్లిం మైనారిటీలను, క్రిస్టియన్ లను, అలాగే కోస్తా ఆంధ్ర ఓటర్లను వైసీపీకి దూరం చేయడానికి బాబు చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది.
ఏతా వాతా తేలేదేమంటే తన ఎత్తుగడలతో “జగన్ ఆదేశిస్తాడు – చంద్రబాబు అమలు చేస్తాడు” అన్న వైసీపీ ప్రచారాన్ని బాబు నిజం చేస్తున్నాడు. ప్రజాభిమానం దండిగా ఉన్న రాజకీయ పసికూన జగన్ వేస్తున్న ఎత్తుల ఉచ్చులో అపారమైన రాజకీయ అనుభవం ఉండి, అపర చాణుక్యుడుగా అంతేవాసుల పొగడ్తలు అందుకుంటున్న చంద్రబాబు తలక్రిందులుగా పడిపోవడం కాల వైచిత్రమే.
శత్రువు మనసులో “శంఖ తో కూడిన భయాన్ని(ఎంఎల్ ఏ లలో ఎవరు ఉంటారో? ఎవరు దూకుతారో?) రేకెత్తించి” నిర్వీర్యుణ్ణి చేయడమన్న “ చైనీస్ యుద్ధవీరుడు సన్ త్జు చెప్పిన యుద్ద నీతిని ముఖ్యమంత్రి జగన్ అమోఘంగా చంద్రబాబు పై ప్రయోగించి విజయం సాధించాడని చెప్పక తప్పదు. ఇంకెన్ని విచిత్రాలు జరుగుతాయో చూద్దాం.