ఆంధ్ర అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసిపి అఖండ విజయం తీసుకురావడంతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది.
ఈ విజయంతో దేశంలో జగన్ స్టేటస్ విపరీతంగా మెరుగుపడింది. అంతా ఇపుడుఆయన వైపు చూస్తున్నారు. అదే విధంగా చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ నాయకుడిని, అనుభవజ్ఞుడిని మట్టికరిపించడానికి అసవరమయిన వ్యూహం తయారుచేసినందుకు చాలా మంది ప్రశాంత్ కిశోర్ ను సంప్రదించి తమకూ పనిచేయాలని కోరుతున్నారు.
ఫలితాలొచ్చిన వెంటనే ప్రశాంత్ కిశోర్ ను సంప్రదించినది బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. అమె నాయకత్వంలో ని తృణమూల్ కాంగ్రెస్ మొన్న ఎన్నికల్లో బాగా ఎదురు దెబ్బతినింది. ఆమె వ్యక్తిగా బిజెపి నాయకత్వానికి బేజారెత్తించినా పార్టీ పరంగా బిజెపి ని ఆమె అడ్డుకోలేకపోయారు. బెంగాల్ కమ్యూనిస్టు పార్టీ మాయమయింది. ఆ స్థానాన్ని బిజెపి ఆక్రమిస్తూ ఉంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే, 2014 ఎన్నికల్లో ఆమెకు కష్టాలుతప్పవని పిస్తుంది. ఈ భయంతోనే ఆమె వెంటనే రానున్న సంక్షోభం నుంచి బయటపడే మార్గమేమిటో చెప్పాలని ప్రశాంత్ కిశోర్ ను సంప్రదించారు. ఒక రౌండ్ చర్చలు జరిగాయి.
మమతా లాగే మొన్న లోక్ సభ ఎన్నికల్లో చావు దెబ్బతిన్న మరొక పార్టీ ఎఐడిఎంకె. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ లోక్ సభ ఎన్నికల్లో ఒక్కసీటు మాత్రమే గెల్చుకుంది. దీనితో ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళని స్వామి గుండెల్లో రైళ్లు పెరిగెత్తడం మొదలయింది. వెంటనే ఆయన ప్రశాంత్ కిశోర్ నాయకత్వంలోని ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (IPAC) సహాయం తీసుకోవాలనుకుంటున్నారు. ఆ కంపెనీకి చెందిన సీనియర్ ప్రతినిధులతో ఆయన చర్చలు సాగించాలనుకుంటున్నారు.
ఎఐడిఎంకె భయమేమింటే, లోక్ సభ ఎన్నికలతో పాటే జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో గెలవకపోయివుంటే, ఈ పాటికి పళని స్వామి ప్రభుత్వం కూలిపోయిఉండేది. 22 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే ఈ పార్టీ 9 సీట్లు రావడంతో బతికి బయటపడింది. లేకుంటే అంతే సంగతులు. ఇపుడు గండంగడిచినా,ముందు ముందుండే ముప్పేనని ముఖ్యమంత్రి భయంపట్టుకుంది.