ప్రఖ్యాతనటుడు, నాటక రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత గిరీష్ కర్నాడ్ (మే 19,1938- జూన్ 10,2019) మరణించారు. ఈ ఉదయం బెంగుళూరు ఆయన తనువు చాలించినట్లు సమాచారం అందింది. ఆయన వయసు 81 సంవత్సరాలు.
ఆయన కొద్ది కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. సోమవారం నాడు శరీరావయవాలు పనిచేయకపోవడం మృతి చెందారు.
పురాణ ఇతి వృత్తాలతో సమకాలీన సమస్యలను వెలుగులోకి తీసుకురావడం ఆయన ప్రత్యేకత.
ఆయన కన్నడ సినిమా జీవితం 1971లో ‘సంస్కార’ తో మొదలయింది. తర్వాత మాల్గుడి డేస్ టీవి సీరియల్ లో కూడా నటించారు.1998లో ఆయన జ్ఞాన పీఠ అవార్డు లభించింది.
అంతకు ముందు ఆయన కు పద్మశ్రీ , పద్మభూషణ్ అవార్డులు కూడా లభించాయి. ఆయన కన్నడ నాటకాలు యయాతి(1961), తుగ్లక్ (1964) అంతర్జాతీయ ఖ్యాతి పొందాయి. తర్వాత హయవదన (1971), నాగమండల(1988)తలేదండ(1990) ఆయన అత్యున్నత ప్రతిభకు నిదర్శనాలు.
ఆయన ధర్మచక్రం, శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్, ప్రేమికుడు,ఆనంద భైరవి, రక్షకుడు తెలుగు చిత్రాలలో కూడా నటించారు.
‘కార్నాడ్ నటించిన సంస్కార కన్నడ చలనచిత్రం, కన్నడలో అంతవరకు నిర్మించిన చిత్రాలలో వ్యాపారాత్మకంగా కాకుండగా కళాత్మకంగా తీసిన మొదటి సినిమా. ఇందులో కార్నాడ్ ప్రాణేశాచార్య అనే ప్రధానభూమికను పోషించారు.
ఇందులో మరో ప్రముఖ నటుడు పి.లంకేశ్ విరుద్ధపాత్రలో నటించారు.ఈ చిత్రదర్శకుడు పట్టాభిరామిరెడ్డి.
ఈ చిత్రం మొదటి స్వర్ణకమలంపొందిన కన్నడచిత్రం. తరువాత బి.వి. కారంత్ అనే ప్రసిద్ధ దర్శకునితో కలసి సహదర్శకత్వంలో ఎస్.ఎల్.భైరప్ప వ్రాసిన వంశవృక్ష కావ్యం ఆధారంగా ఆదే పేరుతో చిత్రాన్ని తీసారు.ఈ చిత్రానికి పలురాష్ట్రీయ, అంతరరాష్ట్రీయ పురస్కారాలు, ప్రశంసలు లభించాయి.
తరువాతి కాలంలో తబ్బిలు నీనాదె మగనె , కాడు , ఒందానొందుకాలదల్లి చిత్రాలకు దర్శకత్వం వహించాడు.కాడు చిత్రానికికూడా చాలా పురస్కారాలు, ప్రశంసలు అందాయి.
పిమ్మట ఉత్సవ , గోధూళి అనే హింది చిత్రాలకు దర్శకబాధ్యతలు నిర్వహించాడు. ఇంకను కనక పురందర , ద.రా.బెంద్ర మరియు సూఫి పంథ అనే యధార్థ/సాక్ష్య (documentary) చిత్రాలకు దర్శకుడుగా పనిచేసాడు.
పరిసరవినాశనం గురించి తెలియచేసె జెలువి అనేచిత్రానికి కూడా దర్శకుడిగా పనిచేసాడు. అగ్నిశ్రీధర్ అనే రచయిత/కవితోకలసి ఆ దినగళు అనేచిత్రానికి చిత్రకథను అందించారు.
కార్నాడ్ కన్నడసాహిత్యానికి కన్నడ చలనచిత్రరంగానికి చేసిన సేవలను గుర్తించి కర్నాటక విశ్వవిద్యాలయం గౌరవడాక్టరేట్ ఇచ్చి సత్కరించింది.కార్నాడ్ కు కర్నాటక రాజ్యోత్సవ ప్రశస్తి , గుబ్బి వీరన్న ప్రశస్తి , కేంద్ర సంగీత నాటక అకాడెమి ప్రశస్తి మరియు అత్యంత ప్రతిష్ఠాకరమైన పద్మశ్రీ’, పద్మభూషణ , జ్ఞానపీఠ పురస్కారాలను అందుకున్నాడు.కేంద్ర సంగీత-నాటక అకాడెమి అధ్యక్షుడిగా పనిచేసాడు.ఇంగ్లాండులోని నెహ్రూ సెంటరుకు నిర్దేశకుడి (director) గా కూడా విధులు నిర్వహించాడు.(వికి పీడియా నుంచి)