ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో 25 మంది మంత్రులతో ఏపీ కేబినెట్‌ను శనివారం ఏర్పాటు చేశారు. సామాజిక ప్రాంతీయ సమతుల్యం ఇంతగా పాటిస్తూ ఏర్పాటయిన క్యాబినెట్ తెలుగు రాష్టాల చరిత్రలో ఇదే ప్రథమం.
క్యాబినెట్ కూర్పులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలా ముందుచూపుతో వ్యవహరించారు. చెప్పకుండానే సామాజిక న్యాయానికి ప్రాముఖ్యం కల్పించి చాలా మంది కంగు తినిపించారు.
క్యాబినెట్ లో 60 శాతం మంత్రి పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కేటాయించడం ఆంధ్రప్రదేశ్ లో ఎపుడూ జరగలేదు.
ఇపుడు ఆయన ఈ పని చేసి కొత్త రాజకీయాలకు తెరతీశారు. నిర్మొహమాటంగా చెబితే, క్యాబినెట్ రెడ్లతో నిండిపోతుందనుకున్నారు.
కొందరి అనుమానాన్ని, కొందరి ధీమాను వమ్ముచేస్తూ జగన్ క్యాబినెట్ తనకు అశేషంగా,విశేషంగా ఓటేసిన అన్ని వర్గాల ప్రతినిధిని చేశారు.
క్యాబినెటలో కులాలున్నాయి,మతాలున్నాయి, జెండర్ జస్టిస్ఉంది… జగన్ సరైన దారిలోనే వెళ్తున్నారని అని నమ్మకం కల్పించారు.
మంత్రిమండలి సభ్యుల వివరాలు
1. శ్రీకాకుళం : ధర్మాన కృష్ణదాస్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీ స్వీకార ప్రమాణం చేసిన ధర్మాన కృష్ణదాస్.. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బగ్గు రమణమూర్తిపై 19,025 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇప్పటి వరకు నాలుగుసార్లు ఆయన శాసనసభకు ఎన్నికయ్యారు. 2004లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. అంతకుముందు స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగిగా పనిచేశారు. 2004లో కాంగ్రెస్ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో కాంగ్రెస్ తరఫున పోటీచేసి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2010లో వైఎస్సార్ సీపీలో చేరారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు 2012లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అదే సంవత్సరం జరిగిన ఉప ఎన్నికల్లో 17 వేల పైచిలుకు మెజారిటీతో గెలిచారు. దీంతో జిల్లాలో వైఎస్సార్సీపీ నుంచి గెలిచిన తొలి ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బగ్గు రమణమూర్తి చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి నియోజకవర్గ సమన్వయకర్తగా ఉంటూ ప్రజా ఉద్యమాలలో పాల్పంచుకున్నారు.
2. విజయనగరం : బొత్స సత్యనారాయణ
వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలిమంత్రివర్గంలో పదవీ స్వీకార ప్రమాణం చేసిన బొత్స సత్యనారాయణ.. విజయనగరం జిల్లా చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కిమిడి నాగార్జునపై 26,498 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సీనియర్ నేత కావడం, ఇదివరకు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండడంతో.. తొలి మంత్రివర్గంలోనే స్థానం దక్కించుకున్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన బొత్స.. అనంతరం వైఎస్సార్సీపీలో చేరారు. రాజకీయ నేపథ్యం 1992-99 విజయనగరం డీసీసీబీ చైర్మన్ 1996-98 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓటమి 1999 ఎన్నికల్లో తొలిసారి ఎంపీగా గెలుపొందారు 2004,2009 ఎన్నికల్లో చీపురుపల్లి అసెంబ్లీకి పోటీ విజయం సాధించారు. 2004లో వైఎస్సార్ కేబినెట్లో భారీ పరిశ్రమల శాఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా సేవలు అందించారు. అనంతరం రోశర్య కేబినెట్లో పంచాయతీరాజ్, కిరణ్ కుమార్‌రెడ్డి కేబినెట్లో రవాణాశాఖ మంత్రిగా పనిచేశారు 2012-2015 వరకు పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఈయన భార్య బొత్స ఝాన్సీ ఓసారి ఎంపీగా గెలిచారు.
3. విజయనగరం : పాముల పుష్పశ్రీవాణి
వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీ స్వీకార ప్రమాణం చేసిన పాముల పుష్పశ్రీవాణి.. విజయనగరం జిల్లా కురుపాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నరసింహ ప్రియా థాట్రాజ్‌పై 26,602 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో కూడా థాట్రాజ్‌పైనే విజయం సాధించారు. గిరిజన ప్రాంతాల ప్రజల సమస్యలకోసం నిరంతరం పోరాడారు. తాజా ఎన్నికల్లో ఆమెను ఓడించేందుకు టీడీపీ చేసిన వశ్వప్రయత్నాలు ఫలించలేదు. చివరికి ఆమెపైనా, ఆమె భర్తపైనా హత్యాయత్నానికి పాల్పడినా బెదరలేదు. అనేక కుట్రలను ఎదుర్కొని ఈ రోజు మంత్రి వర్గంలో స్థానం సంపాదించుకున్నారు.
4. విశాఖపట్నం : ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాసరావు)
వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలిమంత్రివర్గంలో పదవీ స్వీకార ప్రమాణం చేసిన అవంతి శ్రీనివాసరావు.. విశాఖపట్నం జిల్లా భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ప్రతిష్టాత్మకంగా జరిగిన భీమిలి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సబ్బం హరిపై 9,712 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2009లో రాజకీయ ఆరంగేట్రం చేసిన అవంతి శ్రీనివాసరావు, అప్పటి ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపున భీమిలి నుంచి భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల్లో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయగా..ఆ తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేగా 2014 వరకు కొనసాగారు. 2014 ఎన్నికల ముందు టీడీపీలో చేరిన ఆయన అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి 47,932 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. లోక్‌సభ సభ్యునిగా పార్లమెంటులోని వివిధ కమిటీలకు ప్రాతినిధ్యం వహించారు. పార్లమెంటు రూల్స్ కమిటీ, స్టాండింగ్ కమిటీ, కన్సల్టేటివ్ కమిటీల్లో సభ్యునిగా ప్రాతినిధ్యం వహించారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ సాధన కోసం పార్లమెంటు వేదికగా ఎన్నో పోరాటాలు చేశారు. జర్నలిస్ట్ నుంచి.. మినిస్టర్‌గా..
5. తూర్పు గోదావరి : కురసాల కన్నబాబు
వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీ స్వీకార ప్రమాణం చేసిన కురసాల కన్నబాబు.. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పిల్లి అనంతలక్ష్మిపై 8,789 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. పాత్రికేయుని హోదాలో ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చిన ఆయన రాజకీయాల్లో కూడా అదే ఒరవడితో ముందుకు సాగారు. ప్రజల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రి వర్గంలో చోటు సంపాదించారు. ఆయనే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు. ప్రజారాజ్యంతో రాజకీయ ప్రవేశం జర్నలిస్ట్‌గా పనిచేసిన సమయంలో కన్నబాబుకు మెగాస్టార్ చిరంజీవితో ఏర్పడిన సాన్నిహిత్యం ఆయన పెట్టిన పీఆర్పీ వైపు అడుగులు వేసేలా చేసింది. 2009 ఎన్నికల్లో కాకినాడ రూరల్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో పీఆర్పీ కాంగ్రెస్‌లో విలీనమయ్యాక ఆయన కాంగ్రెస్‌లో కొనసాగారు. ప్రజలతో మమేకమై చేసిన అభివృద్ధి ఫలితంగా 2014లో స్వతంత్య్రంగా పోటీచేసి కూడా 45 వేల ఓట్లు సాధించగలిగారు. వైఎస్సార్ సీపీలో చేరిక 2015లో కన్నబాబు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. కొంతకాలానికే ఆయన పార్టీ జిల్లా అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. టీడీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ ఎన్నో ఉద్యమాలకు నేతృత్వం వహించారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను కన్నబాబును లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలకు దిగినా అవేవీ పనిచేయలేదు. పార్లమెంట్ నియోజకవర్గాలుగా పార్టీని విభజించినప్పుడు కూడా కాకినాడ పార్లమెంటరీ అధ్యక్ష పగ్గాలు కన్నబాబుకే దక్కాయి. ఇటీవల ఎన్నికల్లో కన్నబాబు నేతృత్వంలో కాకినాడ ఎంపీతోపాటు పార్లమెంట్ పరిధిలో ఆరు అసెంబ్లీ స్థానాలను వైఎస్సార్ సీపీ విజయం సాధించింది. వయస్సు : 46 విద్యార్హత: బీకాం, ఎంఏ
6. తూర్పు గోదావరి : పిల్లి సుభాష్‌చంద్రబోస్..
వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీ స్వీకార ప్రమాణం చేసిన పిల్లి సుభాష్‌చంద్రబోస్.. తూర్పు గోదావరి జిల్లా మండపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసిన ఓటమిచెందారు. అయినప్పటికీ ఎమ్మెల్సీ కోటాలో ఆయనకు మంత్రిపదవి దక్కింది. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా, ఆయన కుటుంబానికి విధేయుడిగా ఉన్న ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ మూడో సారి మంత్రి పదవి వరించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి జగన్మోహన్రెడ్డికి అండగా ఉంటూ బీసీ సామాజికవర్గంలో పెద్ద నేతగా ఈయన వ్యవహరించారు. కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రి పదవిని వదులుకుని అధిష్టానం అంటే తనకు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మాత్రమేనని తెగేసి చెప్పి తన విశ్వసనీయతను ఆనాడే వైఎస్ కుటుంబానికి చాటుకున్నారు. అనంతరం 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై రాజకీయాలు చేసిన నేపథ్యంలో ఓటమి పాలయ్యారు. తిరిగి 2014లో రామచంద్రపురం నుంచి, 2019లో మండపేట నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయించారు. 2015లో మొట్టమొదటి ఎమ్మెల్సీ స్థానాన్ని జగన్మోహన్రెడ్డి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌కు ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. గతంలో 2004లో ఇండిపెండెంట్‌గా గెలుపొందిన బోస్‌కు అప్పటి ముఖ్యమంత్రి దివంగత మహానేత డాక్టర్ రాజశేఖర్‌రెడ్డి మంత్రి పదవి ఇచ్చి సాంఘిక సంక్షేమ శాఖను ఆయనకు అప్పగించారు. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన బోస్‌కు తిరిగి రాజశేఖర్‌రెడ్డి సాంఘిక సంక్షేమ శాఖలో రెండో సారి మంత్రి పదవి అందించారు.రాజశేఖర్‌రెడ్డి మరణానంతరం రోశయ్య ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగినా అనంతరం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో ఆయన మంత్రి పదవిని వదులుకోవాల్సి వచ్చింది. 2006 నుంచి 2010వరకు నాలుగేళ్లపాటు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఆయన ఆశాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారు. తిరిగి జగన్మోహన్రెడ్డి మంత్రివర్గంలో బోస్ స్థానం కల్పించారు. వయస్సు : 69 సంవత్సరాలు
7. వినయ విధేయ విశ్వరూప్.. తూర్పు గోదావరి : పినిపె విశ్వరూప్..
వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీ స్వీకార ప్రమాణం చేసిన పినిపె విశ్వరూప్.. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసిన గెలుపొందారు. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావుపై 25,654 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి.. నేడు ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగుజాడల్లో నడిచిన విధేయుడు. అదే ఆయనకు మరోసారి అమాత్య పదవి వరించేలా చేసింది. 2009లో రెండోసారి ఏర్పాటైన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో తొలిసారి మంత్రి పదవి చేపట్టారు. ఇప్పుడు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో రెండోసారి మంత్రి పదవి చేపట్టబోతున్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై.. ఓ సారి మంత్రి పదవి చేపట్టిన ఎస్సీ నాయకుడు ఈయనే. ఈ సీనియారిటీ కూడా ఆయనకు మంత్రి పదవి వరించడంలో మరో అర్హత అయింది.
రాజకీయ ప్రస్థానం ఇలా.. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రోద్బలంతో విశ్వరూప్ 1989లో రాజకీయ అరంగ్రేటం చేశారు. 1998లో ముమ్మిడివరం నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి, లోక్ సభ మాజీ సభాపతి దివంగత జీఎంసీ బాలయోగిపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ అదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాన్ని దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కల్పించారు. అప్పుడు టీడీపీ అభ్యర్థి చెల్లి వివేకానందపై మరోసారి పరాజితులయ్యారు. 2004లో జరిగిన ఎన్నికల్లోనూ అదే నియోజకవర్గం నుంచి విశ్వరూప్ అదే పార్టీ టికెట్‌తో పోటీ చేసి ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో దాదాపు నాలుగున్నరేళ్ల పాటు ముగ్గురు ముఖ్యమంత్రులు దివంగత వైఎస్సార్, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి త్రివర్గాల్లో వివిధ శాఖల మంత్రిగా పనిచేశారు. వైఎస్సార్ మరణంతరం.. జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో ఆవిర్భవించిన వైఎస్సార్ సీపీ వైపు పయనించారు. జగన్ నాయకత్వంలో పనిచేసేందుకు.. ఆరు నెలల ముందే తన మంత్రి పదవికి రాజీనామా చేసి వైఎస్సార్ సీపీలో చేరారు.
8. పశ్చిమ గోదావరి : ఆళ్ళ కాళీకృష్ణశ్రీనివాస్ (నాని)..
వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీ స్వీకార ప్రమాణం చేసిన ఆళ్ల నాని .. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసిన గెలుపొందారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలి మంత్రివర్గంలోనే కేబినేట్మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. 2014 ఎన్నికల్లో తొలిసారి వైఎస్సార్సీపీ నుంచి పోటీచేసి ఓటమిచెందారు. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బడేటి కోట రామారావుపై 4,072 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆళ్ల నానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అనుంగ శిష్యుడిగా పేరుంది. 1994లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఏలూరు నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. 1999లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి రెండోసారి కుడా ఓడిపోయారు. 2004, 2009లో వరుసగా రెండుసార్లు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2014లో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయినప్పటికీ 2019 మాత్రం విజయం సాధించి మంత్రిగా స్థానం పొందారు.
9. పశ్చిమ గోదావరి : చెరుకువాడ శ్రీరంగనాథరాజు..
వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీ స్వీకార ప్రమాణం చేసిన చెరుకువాడ శ్రీరంగనాథరాజు.. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణపై 12,886 తేడాతో ఓడించి రికార్డు సృష్టించి తెలుగుదేశం కంచుకోటలో పాగా వేశారు. సుదీర్ఘ కసరత్తు అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చివరి నిమిషంలో శ్రీరంగనాథరాజుకు కేబినెట్లో బెర్తు ఖరారు చేశారు. 2004లో అత్తిలి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తొలిసారి పోటీ చేసిన శ్రీరంగనాథరాజు అప్పటి మంత్రి, రాజకీయ ఉద్దండుడు దండు శివరామరాజును ఓడించి సంచలనం సృష్టించారు. నేడు మళ్లీ ఆచంట నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి రాష్ట్ర మంత్రిగా సుదర్ఘీకాలం పాటు పనిచేసిన ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణను ఓడించి మరోసారి రికార్డు సృష్టించారు. ఇలా జిల్లాలో ఉద్దండులైన ఇద్దరు మంత్రులను మట్టి కరిపించిన ఘనత శ్రీరంగనాథరాజుకే దక్కించుకుని మంత్రివర్గంలో స్థానం సాధించారు.
10. పశ్చిమ గోదావరి : తానేటి వనిత..
వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీ స్వీకార ప్రమాణం చేసిన తానేటి వనిత.. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి వంగలపూడి అనితపై 25,248 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఎస్సీ రిజర్వు స్థానమైన కొవ్వూరులో 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం ఐదేళ్లపాటు ప్రజాసమస్యలపై పోరాడి.. ఈసారి విజయం సాధించారు. నియోజకవర్గం ఏర్పడిన తర్వాత తొలి మహిళా ఎమ్మెల్యేగా, తొలి మహిళా మంత్రిగా వనిత అరుదైన ఘనత దక్కించుకున్నారు. వనిత తొలిసారి 2009లో గోపాలపురం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2012 నవంబర్ 4న వైఎస్సార్ సీపీలో చేరారు. వనిత తండ్రి జొన్నకూటి బాబాజీరావు గోపాలపురం నుంచి రెండు సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. తల్లి రిటైర్డ్ ఉపాధ్యాయిని. భర్త శ్రీనివాసరావు వైద్యుడు (ఎండీ జనరల్).
11. కృష్ణా : కొడాలి నాని (వెంకటేశ్వర్లు)..
వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీ స్వీకార ప్రమాణం చేసిన కొడాలి నాని.. కృష్ణా జిల్లా గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. గుడివాడ స్థానం నుంచి 2004, 09 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలుపొందారు. ఏపీ విభజన అనంతరం వైఎస్సార్సీపీలో చేరి 2014, 2019 ఎన్నికల్లో గెలుపొందారు. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో టీడీప అభ్యర్థి దేవినేని అవినాష్‌పై 19,479 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అసెంబ్లీలో వైఎస్సార్సీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా పనిచేసిన అనుభవం ఆయనకుంది. సీఎం వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉంటారు.
12. కృష్ణా : పేర్ని నాని..
వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీ స్వీకార ప్రమాణం చేసిన పేర్ని నాని.. కృష్ణా జిల్లా మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆయన మూడోసారి విజయం సాధించారు. రాజకీయాల్లో విశేష అనుభవం ఉండడంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలి మంత్రివర్గంలోనే స్థానం దక్కించుకున్నారు. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి, మాజీమంత్రి కొల్లు రవీంద్రపై 5,851 ఓట్ల తేడాతో గెలుపొందారు. తండ్రి నుంచి వారసత్వంగా రాజకీయాలను పుణికిపుచ్చుకున్న నాని.. 1999లో తోలిసారి అసెంబ్లీకి పోటీచేసి ఓటమి చెందారు. ఆ తరువాత 2004, 09లో వరుసగా రెండుసార్లు ఎన్నికయ్యారు. కిరణ్‌కుమార్ మంత్రివర్గంలో ప్రభుత్వ విఫ్‌గా పనిచేశారు. 2013లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరారు. 2014లో ఎన్నికల్లో పోటీచేసి ఓటమి చెందినప్పటికీ.. ప్రజల పక్షాన నిలబడ్డారు.
13. కృష్ణా : వెల్లంపల్లి శ్రీనివాసరావు..
వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీ స్వీకార ప్రమాణం చేసిన వెల్లంపల్లి శ్రీనివాసరావు.. కృష్ణా జిల్లా విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి షబనా ముసరాత్ ఖాతూన్‌పై 7,671 ఓట్ల మెజర్టీతో విజయం సాధించారు. 2009లో రాజకీయాల్లోకి ప్రవేశించిన వెల్లంపల్లి.. ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం నుంచి గెలిచి.. తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 2014 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందారు. అనంతరం వైఎస్సార్సీపీలో చేరి.. విజయం సాధించారు.
14. గుంటూరు : మేకతొటి సుచరిత
వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీ స్వీకార ప్రమాణం చేసిన మేకతొటి సుచరిత.. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి డొక్కా మాణిక్యవరప్రసాద్‌పై 7,398 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో మాజీమంత్రి రావెల కిశోర్‌బాబు చేతిలో ఆమె ఓటమిపాలయ్యారు. ఫిరంగిపురం మండల జెడ్పీటీసీగా తొలిసారి రాజకీయ రంగప్రవేశం చేశారు. తదనంతరం దివంగత వైఎస్సార్ ఆశీస్సులతో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి 2009లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్ మరణాంతరం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పోటీచేసి 16,781 ఓట్ల మెజార్టీతో సంచలన విజయాన్ని నమోదు చేశారు. అప్పటి నుంచి వైఎస్ జగన్ వెంటనడుస్తూ.. ప్రజల సమస్యలపై పోరాడుతున్నారు. ఆమె శ్రమకు తగిన ఫలితంగా వైఎస్ జగన్ ఆమెకు మంత్రిగా అవకాశం కల్పించారు.
15. గుంటూరు : మోపిదేవి వెంటకరమణావు
వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీ స్వీకార ప్రమాణం చేసిన మోపిదేవి వెంటకరమణావు.. రేపల్లె జిల్లా ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఓటమిచెందారు. అయినప్పటికీ మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్‌పై 11,555 ఓట్ల తేడాతో ఓటమిని చవిచూశారు. 1984లో రాజకీయంలో రంగ ప్రవేశం చేసిన మోపిదేవి తొలుత కాంగ్రెస్ తరఫున ఎంపీటీసీగా ఎన్నికయ్యారు. ఆ తరువాత 1989లో కూచిపూడి అసెబ్లీకి పోటీ చేసి 54 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. అనంతరం 1999, 2004లో కూచిపూడి ఎమ్మెల్యేగా, 2009లో రేపల్లె ఎమ్మెల్యేగా వరుసగా మూడుసార్లు గెలుపొందారు. దివంగత వైఎస్సార్ హాయంలో మంత్రిగా సేవచేశారు.
16. ప్రకాశం: బాలినేని శ్రీనివాసరెడ్డి..
వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీ స్వీకార ప్రమాణం చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి.. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసిన బాలినేని.. టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్‌పై 21,507 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇప్పటివరు ఆయన ఐదుసార్లు విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షునిగా రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన 1999లో తొలిసారిగా ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసి విజయం సాధించారు. 2004, 2009లలో వరుస విజయాలు సాధించి హ్యాట్రిక్ రికార్డు సొంతం చేసుకున్నారు. రెండోసారి వైఎస్సార్ ప్రభుత్వంలో గనులశాఖ, చేనేత జౌళి మరియు స్పిన్నింగ్ , చిన్నతరహా పరిశ్రమల శాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరుపున పోటీచేసి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో తొలిసారి ఓటమిపాలయ్యారు. పుట్టిన తేదీ: 12.12.1964 విద్యార్హత: అండర్ గ్రాడ్యుయేషన్
17. ప్రకాశం: ఆది మూలపు సురేష్
వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీ స్వీకార ప్రమాణం చేసిన ఆది మూలపు సురేష్ .. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆయన వరుసగా 2009, 14, 19 ఎన్నికల్లో గెలుపొంది హ్యాట్రిక్ విజయాన్ని నమోదుచేశారు. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బూదాల అజితారావుపై 31,096 భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. 2009లో వైఎస్సార్ ప్రోత్సాహంతో యర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తొలిసారి గెలుపొందారు. 2014,19 ఎన్నికల్లో అదే స్థానం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2009లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా, అసెంబ్లీ ఎస్సీ, ఎస్టీ కమిటీ సభ్యుడుగా, 2014లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా, రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేశారు. పుట్టిన తేదీ: 27.04.1964 విద్యార్హత: ఐఆర్ఎస్
18. పీఎస్సార్ నెల్లూరు : పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్
వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీ స్వీకార ప్రమాణం చేసిన పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్.. నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి, మంత్రి నారాయణపై 1,988 ఓట్ల తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసిన విజయం తెలిసిందే. 2014 ఎన్నికల్లో తొలిసారి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆయన చిన్నాన్న సుధాకర్ మృతిచెందడంతో 2008లో నెల్లూరు నగరంలోని 20 డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా గెలుపొందారు. 2009 ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశ దక్కింది. 91 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. అనంతరం వైఎస్సార్సీపీలో చేరి క్రియాశీలకంగా వ్యవహరించి 2014,19 ఎన్నికల్లో నెల్లూరు నగరం నుంచి ఘన విజయం సాధించారు. చిన్న వయస్సులో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన అనిల్.. తాజాగా మంత్రిగా నియమితులై చరిత్ర సృష్టించారు. : పుట్టిన తేదీ : 23.03.1980
19. నెల్లూరు: మేకపాటి గౌతమ్‌రెడ్డి
వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీ స్వీకార ప్రమాణం చేసిన మేకపాటి గౌతమ్‌రెడ్డి.. నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. వైఎస్సార్సీపీ ఆవిర్భానికి ముందు నుంచి మేకపాటి కుటుంబం జిల్లాలోని వైఎస్సార్సీపీకి అండగా నిలబడింది. ప్రధానంగా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి వైఎస్ జగన్ నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసంతో కాంగ్రెస ఎంపీగా ఉండి వెంటనే పదవికి రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరి ఎంపీగా గెలుపొందారు. ఆయన సోదరుడు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైఎస్ జగన్‌వెంట నడిచారు. ఆ కుటుంబ వారసుడిగా, వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉండే గౌతమ్‌రెడ్డి 2014 ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గం నుంచి పోటీచేసి జిల్లాలో అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. వరసగా రెండో పర్యాయం కూడా అదే నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి బొల్లినేని కృష్ణయ్యపై ఘన విజయం సాధించారు. దీంతో వైఎస్ జగన్ తొలి మంత్రిమండలిలో చోటు దక్కించుకున్నారు.
20. పెద్దాయనను వరించిన మంత్రి పదవి చిత్తూరు : పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీ స్వీకార ప్రమాణం చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి .. చిత్తూరు జిల్లా పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్తి ఎన్.అనూషారెడ్డిపై 43,555 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. 2009లో దివంగత ముఖ్య మంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి క్యాబినెట్లో తొలిసారి ఆయన మంత్రి పదవి చేపట్టారు. రాష్ట్ర అటవీ శాఖా మంత్రిగా బాధ్యతలునిర్వహించారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో విశేష సేవలందించారు. అటవీశాఖతో పాటు జిల్లాలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. ఇప్పటివరకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి దివంగతులయ్యాక తన మంత్రి పదవికి రాజీనామా చేసి విధేయత చాటుకున్నారు. వైఎస్ కుటుంబంతో ఉన్న అనుబంధంతో ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంట నడిచారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత జిల్లాలో సర్వం తానై పార్టీ పటిష్టతకు ఎనలేని కృషి చేశారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ పట్టు సడలనీయకుండా చాకచక్యంగా రాజకీయాలు నడిపారు. 2019 ఎన్నికల్లో జిల్లాలో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేయడంలో కీలకపాత్ర పోషించారు. వైఎస్.జగన్మోహన్రెడ్డి మంత్రివర్గంలో ఎట్టకేలకు చోటు దక్కించుకున్నారు. తండ్రి, తనయుడి మంత్రివర్గంలో పనిచేసిన అరుదైన రికార్డును పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంతం చేసుకున్నారు.
21. చిత్తూరు : కళత్తూరు నారాయణస్వామి..
వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీ స్వీకార ప్రమాణం చేసిన కళత్తూరు నారాయణస్వామి.. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. సుధీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు వైఎస్ కుటుంబానికి విధేయుడిగా ఉన్న నారాయణస్వామికి మంత్రివర్గంలో చోటు దక్కడంపై హర్షాతిరేఖాలు వ్యక్తమవుతున్నాయి. కార్యకర్త స్థాయి నుంచి సమితి అధ్యక్షుడిగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా ఆయనకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ప్రత్యేకించి దళిత సామాజిక వర్గానికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి తన మంత్రివర్గంలో చోటుకల్పించారు. తొలిసారి దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ఆశీర్వాదంతో 2004 ఎన్నికల్లో సత్యవేడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నారాయణస్వామి ఆ తరువాత 2014, 2019 ఎన్నికల్లో గంగాధనెల్లూరు నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైఎస్.రాజశేఖరరెడ్డి దివంగతులయ్యాక కాంగ్రెస్ పార్టీకి రాజీనామాచేసి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంట నడిచారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావం తర్వాత జిల్లా అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేశారు. తొలిసారి మంత్రిగా శనివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు.
22. కర్నూలు : బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీ స్వీకార ప్రమాణం చేసిన బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి.. కర్నూలు జిల్లా డోన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా డోన్ నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి కేఈ ప్రతాప్‌పై విజయం సాధించారు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానం నుంచి మరోసారి పోటీ చేసిన బుగ్గన.. టీడీపీ అభ్యర్థి కేఈ ప్రతాప్‌పై 35,516 ఓట్ల భారీ మెజార్టీతో వరుసగా రెండోసారి గెలుపొందారు. చంద్రబాబు నాయుడి గత ప్రభుత్వంలో బుగ్గన పీఏసీ చైర్మన్‌గా వ్యవహరించారు. పుట్టిన తేదీ : 27–09–1970 చదువు : బీటెక్
23. కర్నూలు : గుమ్మునూరు జయరాం వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీ స్వీకార ప్రమాణం చేసిన గుమ్మునూరు జయరాం.. కర్నూలు జిల్లా ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కోట్ల సుజాతమ్మపై 40 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో కూడా ఇదే స్థానం నుంచి గెలుపొందారు. అంతకుముందు 2001లో ఏదూరు గ్రామ టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిచవిచూశారు. 2005లో చిప్పగిరి మండల జెడ్పీటీసీగా గెలుపొందారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ప్రజారాజ్యాం నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు. 2012లో వైఎస్సార్సీపీలో చేరి అనేక ప్రజా ఉద్యమాలలో పాలుపంచుకున్నారు.
24. వైఎస్సార్ జిల్లా : షేక్ అంజాద్ బాషా..
వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీ స్వీకార ప్రమాణం చేసిన షేక్ అంజాద్ బాషా.. కడప అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. వైఎస్సార్సీపీలో పలు కీలక పదవులను సమర్థవంతంగా నిర్వర్తించిన బాషా.. 2004లో తొలిసారి కడప కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. ఆ తరువాత 2014, 2019 ఎన్నికల్లో కడప అసెంబ్లీ నుంచి వరుసగా రెండు సార్లు గెలుపొందారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడితే ముస్లిం మైనార్టీలకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇచ్చిన మాటప్రకారం ఆయన తొలి మంత్రివర్గంలోనే షేక్ అంజాద్ బాషాకు స్థానం కల్పించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అమీర్ బాబుపై 54,794 ఓట్ల అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. పుట్టిన తేది: 12-08-1971 విద్యార్హత: బీ.ఏ
25. అనంతపురం : మాలగుండ్ల శంకరనారాయణ
వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీ స్వీకార ప్రమాణం చేసిన మాలగుండ్ల శంకరనారాయణ.. అనంపురం జిల్లా పెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. గెలిచిన మొదటిసారే వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. టీడీపీ అభ్యర్థి బీకే పార్థసారథిపై 15,058 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2011లో వైఎస్సార్సీపీలో చేరిన ఆయన. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. 1994లో టీడీపీ జిల్లా కమిటీ మెంబర్‌గా, ధర్మవరం నియోజకవర్గ ప్రచార కార్యదర్శిగా పనిచేశారు. పుట్టిన తేదీ : 01.01.1965 జన్మస్థలం : ధర్మవరం చదువు : బీకాం, ఎల్ఎల్బి వృత్తి : న్యాయవాది
(మా వార్తలు నచ్చితే, షేర్ చేయండి. మేం ఏపార్టీకి దగ్గిర కాదు, ఏ ఐడియాలజీని అనుసరించడం. వార్తను వార్తగాచూపాలనే జర్నలిజం మాది. నచ్చితే trendingtelugunews.com ను follow కండి)