పొలిటికల్ నాలెడ్జ్ : ఇండిపెండెంటు వివి గిరి రాష్ట్రపతి ఎలా అయ్యారంటే…

1969లో భారత నాల్గవ రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ ఆకస్మిక మరణంతో కొత్త రాష్ట్రపతి ఎన్నిక అనివార్యం అయింది. ఈ ఎన్నికకు చాలా ప్రాధాన్యం ఉంది. రాబోయే అనేక రాజకీయపరిణమాలకు ఇది బీజాలు వేసింది. రాజకీయాలలో ఒక యుగానికి స్వస్తి పలికి కొత్త యుగాన్ని ఆవిష్కరించింది. అయిదో రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు జరిగిన ఈ ఎన్నికలను కేవలం ఒక రాష్ట్రపతి ఎన్నికగా చూడలేం. అపుడు దేశ రాజకీయాల్లో ప్రధాన శక్తిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ లో కొనసాగుతున్న పవర్ స్ట్రగుల్  పర్యవసానంగా చూసినపుడే ఈ ఎన్నిలకు ప్రాముఖ్యం అర్థమవుతుంది. కాంగ్రెస్ లో పాత తరం పోయి కొత్తతరం పట్లు సంపాదించింది.

1

జాకీర్ హుసేన్ చనిపోయాక, ఉపరాష్ట్రపతిగా ఉన్న వివి గిరి తాత్కాలిక రాష్ట్రపతి అయ్యారు. అపుడొక సమస్య వచ్చింది.ఉప రాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతి అయినపుడు ఆయన కూడా చనపోతే రాష్ట్రపతిగా ఎవరిని నియమించాలనే ప్రశ్న ఎదురయింది. రాజ్యంగ రచయితలు ఈ విషయం ఆలోచించలేదు. రాష్ట్రపతి చనిపోతే, ఉప రాష్ట్రపతి రాష్ట్రపతి అవుతారు. ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతి అయినపుడు ఉపరాష్గ్రపతి పదవి ఖాళీ అయినట్లు లెక్క కాదు. అందువల్ల మరొక ఉప రాష్ట్రపతి ఉండరు. అలాంటపు యాక్టింగ్ రాష్ట్రపతి చనిపోతే, పరిస్థితి ఏమిటి?   దీనికి పార్లమెంటు పరిష్కారం కనుగొనాల్సి వచ్చింది. The President(Discharge of Functions)Act ను మూడువారాలలో అర్జంటుగా తీసుకు వచ్చారు.దీని ప్రకారం,తాత్కాలిక రాష్ట్రపతి పదవి ఖాళీ అయితే, సుప్రీంకోర్టులోని సీనియర్ మోస్ట్ న్యాయమూర్తి రాష్టపతి బాధ్యతలు నిర్వహిస్తారు. 1969 కంటే ముందు ఉప రాష్ట్రపతిని రాష్ట్రపతి గా ప్రమోట్ చేసే సంప్రదాయం ఉండింది. అయితే,కాంగ్రెస్ లో ఇందిరా గాంధీకి వ్యరేకంగా ఉన్న సీనియర్ నాయకుల ముఠా (సిండికేట్ అని పిలిచేవారు. సిండికేట్ సభ్యులు: కె కామరాజ్, ఎస్ నిజలింగప్ప, ఎస్ కె పాటిల్, అతుల్యఘోష్, నీలం సంజీవరెడ్డి)కు గిరిని ప్రమోట్ చేయడం ఇష్టం లేదు. వాళ్లకి నీలం సంజీవరెడ్డిని రాష్ట్రపతి చేయాలన్న లక్ష్యం ఉంది.

జాకీర్ హుసేన్ మరణం తర్వాత పరిణామాలు చాలా ఆసక్తి కరంగా ఉంటాయి. రాజ్యాంగంలో తాత్కాలిక రాష్ట్రపతి (యాక్టింగ్ ప్రెశిడెంట్) అనే మాట లేదు. రాష్ట్రపతి చనిపోయినపుడు ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి అవుతారు. అయితే ఆయన తన పాత ఉప రాష్ట్రపతి కార్యాలయానికి రావడానికి వీల్లేదు. అలాగనీ ఆయన ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేయరాదు. ఉ.రా గా ఉన్నవివి గిరి రాష్ట్రపతి అయ్యాక రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నారు. అందుకని ఆయన రాష్ట్రపతి పదవికి 1969జూలై 20 రాజీనామా చేశారు. మరి రాజీనామా ఎవరికి ఇచ్చారు? సాధారణంగా రాష్ట్రపతి రాజీనామా చేయాల్సి వస్తే రాజీనామా పత్రాన్ని ఉప రాష్గ్రపతి కి ఇస్తారు. గిరి రాజీనామా చేసినపుడు ఉపరాష్రపతి ఎవరూ లేరు. మరెలా? రాజీనామా పత్రాన్ని ఎవరికిచ్చారో మీరూ వెదకండి!

2

1966 జనవరిలో శాస్త్రి మరణం తర్వాత మొరార్జీ దేశాయ్ తో తెగపోరాడి ఇందిరా గాంధీ ప్రధాని అయ్యారు. పార్టీలో ముఠా తగాదాలు బాగా ముదిరిపోయాయి. ఇందిరను ఒక వర్గం బాగా వ్యతిరేకిస్తుంటే, కొంతమంది  కుర్రకుంక అని ఆమె అదుపులో పెట్టుకోవడమెలా అని ఆలోచిస్తూ ఉంది. వచ్చే  సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పనితీరు బాగా లేక పోతే, తనని పదవిలో కొనసాగిస్తారన్న నమ్మకం ఇందిరా గాంధీకి లేదు.

అందుకే సిండికేట్ తో సంబంధం లేకుండా స్వతంత్రం పార్టీని తనవైపు తిప్పుకునే పని ప్రారంభించారామే.ఇందులో భాగాంగా రూపాయ మారకం విలువ తగ్గించారు. ఇది అమెరికాను సంతృప్తి పరిచేందుకు చేసినా, వియత్నాం మీద అమెరికా బాంబులు వేస్తూనే ఆమె రష్యాకు అనుకూలంగా  లైన్ మార్చకున్నారు.

ఇది చాలా దూరదృష్టితో తీసుకున్న నిర్ణయం. ‘చిన్నపిల్ల‘ మన మాట వింటుందని ముసలాళ్లంతా కలసి ఇందిరను ప్రధాని చేశారు. అయితే, వీళ్ల పెత్తనం భరించడం ఇష్టంలేక ఆమె దేశం ప్రజలు నేరుగా తనకే  మద్దతు ప్రకటించేలా పథకం వేశారు. దీని పర్యవసానమే సోవియట్ యూనియన్ వైపు మొగ్గు చూపడం. ఇక్కడే కాంగ్రెస్ పార్టీ మీద పట్టు, గవర్నమెంట్ పవర్ రెండు ఒకేవ్యక్తిలో కేంద్రీకృత మయ్యే ప్రాసెస్ కూడా మొదలయింది.

1967 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ కు బాగా ఎదురు దెబ్బ తగిలింది. దీనితో సిండికేట్ కు ఆమెకు పార్టీలో వివాదం తీవ్రమయింది. ఇదొక రెండేళ్ల పాటు సాగింది. ఒకరినొకరు దెబ్బతీసేందుకు అదను కోసం చూస్తున్నారు.  అది జాకీర్ హుసేన్ మరణం రూపంలో 1969 రాష్ట్రపతి ఎన్నికల రూపంలో వచ్చింది. వచ్చే రాష్ట్రపతి ఎన్నికలో ఒకరి అంతు మరొకరు తేల్చుకోవాలనుకున్నారు.

3

రాష్ట్రపతిగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నీలం సంజీవరెడ్డిని నియమించాలని సిండికేట్ భావించింది. అయితే, రెడ్డి రాష్ట్రపతి అయితే, తనని బర్త్ రఫ్ చేసే అవకాశం ఉందని ఇందిరా గాంధీ అనుమానించారు.

రాష్ట్రపతి అభ్యర్థి విషయం  1969 జూలై 10న బెంగుళూరులో జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో చర్చకు వచ్చింది. వచ్చే రాష్ట్రపతిగా దళితుడయిన జగజ్జీవన్ రామ్ ని చేస్తే మహాత్మగాంధీకి నిజమయిన నివాళి అవుతుందని ఆమె వాదించారు. అయితే, ఆమెకు మద్దతు దొరకలేదు. అక్కడ జరిగిన ఓటింగ్ లో నీలం సంజీవరెడ్డిని అభ్యర్థిని చేసే ప్రతిపాదనకే ఎక్కువ వోట్లు వచ్చాయి.

4

ఇదే సమయంలో తాను రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్నట్లు వివి గిరి ప్రకటించారు. ఈ నిర్ణయం వెనక ఇందిగా గాంధీ ఉన్నారని చాలా మందికి అనుమానం. దీనికి సాక్ష్యం  లేదు గాని పరిస్థితులన్నీ దాన్నిఅటువైపే వేలు చూపిస్తాయి. అయితే, Presidential and Vie Presidential Act 1952 ప్రకారం సంజీవరెడ్డిని గెలిపించాలని ఆమె పార్లమెంటరీ పార్టీ నాయకురాలిగా విప్ ఇచ్చేందుకు తిరస్కరించారు. దీనిని బట్టి వివి గిరి నిర్ణయం వెనక ఆమె ఆమోదం ఉందనిపిస్తుంది.

5

సంజీవరెడ్డి అభ్యర్థిత్వాన్ని తన మీద రుద్దినందుకు ఇందిరాగాంధీ సిండికేట్ మీద బాగా దెబ్బతీయాలనుకున్నారు. వెంటనే అంటే వారం తిరక్క ముందే అంటే  జూలై 16 వ తేదీన ఆమె మొరార్జీ దేశాయ్ ను అర్థిక మంత్రి పదవి నుంచి తప్పించారు. ఆ పదవి తనదగ్గిరే ఉంచుకున్నారు. మొరార్జీని కేవలం ఉప ప్రధానిగా మాత్రమే కొనసాగమన్నారు.

జూలై 20తేదీన బ్యాంకు జాతీయీకరణ ఆర్డినెన్స్ తెచ్చారు. యాక్టింగ్ ప్రెశిడెంట్ వివి గిరి సంతకం చేసిన ఫైలు ఇదే.అదే రోజే ఆయన రాజీనామా చేసి రాష్ట్రపతి ఎన్నికల్లోకి దూకారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన ఉప రాష్ట్రపతి అయ్యారు. అయితే, తనని అదే కాంగ్రెస్ రాష్ట్రపతి పదవికి నామినేట్ చేయనందుకు ఆయన కోపంతో రాష్ట్రపతి పదవికి పోటీ చేయాలనుకున్నారని చెబుతారు. ఇది ఇందిగా గాంధీకి అనుకూలంగా పనిచేసిందని, ఆమె వాడుకున్నారని చెబుతారు.

6

సిండికేట్ మరొక తప్పు చేసింది. రాష్ట్రపతి ఎన్నికల్లో సెకండ్ ప్రిఫెరెన్స్ ఓటుని వివి గిరికి కాకుండా జనసంఘ్,స్వతంత్ర పార్టీలు బలపర్చిన అభ్యర్థి సిడి దేశ్ ముఖ్ కు వేయాలని పిలుపునచ్చింది. దీనితో ఈ ఎన్నికల లెఫ్ట్ , రైట్ (జనసంఘ్)పార్టీల మధ్య పోలరైజ్ అయింది. అప్పటికే ఇందిరా గాంధీ సోవిటయ్ అనుకూల విధానం తీసుకోవడంతో వామపక్షాలు ఆమె లో ప్రగతిశీల గుణం చూశాయి. దీనికితోడు బ్యాంకులజాతీయీకరణ వాళ్లని బాగా ఆనందంతో ఉక్కిరిబిక్కిర చేసింది.  దీనితో ఆమె మద్దతునిస్తున్న వివిగిరికి వామ పక్షాలు పెద్ద ఎత్తున వోటేశాయి. వీటికి తోడు ఆమె పార్టీ విప్ జారీ చేయలేదు. ఆత్మ ప్రబోధాను సారం వోటేసేందుకు (conscience vote)పిలుపు నిచ్చారు. తన ప్రధాని పదవి హోదా ను ఉపయోగించి కాంగ్రెస్ సభ్యులందరిని ప్రభావితం చేశారు. ఫలితంగా వివి గిరి గెలుపొందారు. సంజీవరెడ్డి ఓడిపోయారు. తొలిసారి ఇద్దరు తెలుగు వాళ్లు రాష్ట్రపతి పదవికి పోటీ చేసిన ఎన్నిక ఇది. గిరి ఒడిషా బరంపురం బ్రాహ్మణుడు, సంజీవరెడ్డి రాయలసీ అనంతపురం జిల్లాకు చెందిన వారు.

7

ఈ ఎన్నికలో 8,36,337 వోట్లు పోలయ్యాయి. గెలిచేందుకు హాప్ మార్క్ 4,18,169 గా నిర్ణయించారు. గిరికి 4,01,515 వోట్లు పడ్డాయి. సంజీవరెడ్డికి 3,13,548 ఓట్లు పోలయ్యాయి. దీనితో సెకండ్ ప్రిఫరెన్స్ వోట్ల ను లెక్కించాల్సి వచ్చింది. దీనితో వివిగిరికి 4,20,515 వోట్లు రాగా, సంజీవరెడ్డికి 4,05,427 వోట్లు మాత్రమే వచ్చాయి. గిరి గెల్చారు. తనకు కావలసిన వ్యక్తిని రాష్ట్ర పతిగా గెలిపించుకుని ఇందిరా గాంధీ కూడా గెల్చారు.

దీనితో సిండికేట్, ఇందిరా గాంధీ ఒక పార్టీలో కొనసాగలేని పరిస్థితి వచ్చింది. వారు వేరు కుంపట్లు పెట్టుకోవలసి వచ్చింది.  ఏర్పడిన 84 సంవత్సరాల తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ రెండు గా, Congress (Requisitionists),Congress(Organization)గా చీలిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *