ఏపీ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే దూకుడు నిర్ణయాలతో దూసుకుపోతున్న జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
పాలక మండళ్ల రద్దుకు ఆర్డినెన్స్ తెచ్చే యోచనలో సీఎం జగన్ ఉన్నట్టు తెలుస్తోంది.
టిటిడితో సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆలయాల పాలక మండళ్ల రద్దు చేసే దిశగా సన్నాహాలు చేస్తున్నారు. న్యాయపరమైన సమస్యలు రాకుండా చట్టప్రకారం చేసేందుకు కసరత్తు జరుపుతున్నారు. క్యాబినెట్ ఆమోదం ద్వారా రద్దు చెయ్యాలని సీఎం నిర్ణయించారు.
నోటీసులు ఇస్తే కోర్టును ఆశ్రయించే అవకాశం ఉండటంతో దేవాదాయశాఖ చట్టం 1987లోని సవరణ ద్వారా ఆర్డినెన్స్ తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆర్డినెన్స్ కోసం క్యాబినెట్ ఆమోదం తప్పనిసరి కావడంతో ఈ నెల 8 వ తేదీన మంత్రి వర్గం ఏర్పాటు రోజే క్యాబినెట్ లో పెట్టే అవకాశం ఉందని సమాచారం.
క్యాబినెట్ ఆమోదించిన వెంటనే గవర్నర్ కు పంపేందుకు నిర్ణయం తీసుకున్నారు. కుదరని పక్షంలో 12 న అసెంబ్లీ సమావేశాల్లో సవరణ బిల్లు పెట్టి పాలక మండళ్ల రద్దుకు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.