(మాకిరెడ్డి పురుషోత్తమ్ రెడ్డి)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్య సలహదారుగా విశ్రాంత ఐఏయస్ అధికారి అజేయకల్లంను నియమించారు. ఈ నియామకం కల్లంకు లభించిన హోదా అనడం కన్నా క్లిష్ట పరిస్థితిలో ఉన్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి వారు ఒక అవసరం అనడం సముచితంగా ఉంటుంది.
అజేయకల్లం గుంటూరు జిల్లాలో అభ్యుదయ భావాలు కలిగిన కుటుంబంలో జన్మించారు. నాటి వామపక్ష జాతీయ నేత అజయ్ గోష్ పేరునే వారి తల్లిదండ్రులు అజయ్ కల్లంకు పెట్టారు. తల్లిదండ్రులు ఏఆలోచనలతో నామకరణం చేశారో అదే స్పూర్తితో వారి ప్రస్థానం కొనసాగింది. నిత్యం సమాజంలో మార్పు కోసం తనకున్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. వ్యవసాయశాస్రంలో విద్యనభ్యసించిన అజయ్ నిత్యం వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం తపించారు. తాను నేర్చుకున్న విద్యకు తన పనికి ఏ మాత్రం వ్యత్యాసం లేకుండా జీవించడమే వారిలో ప్రత్యేకమైన అంశం.
టిటిడిలో అధికారులు , పాలకమండలి సభ్యుల నియామకం చర్చకు వచ్చిన ప్రతి సమయంలో తిరుపతి వాసుల నుంచి వచ్చే మాట అజయ్ లాంటి వారు రావాలని. అజయ్ గారి పనితీరు గురించి అంతకు మించిన ఉదాహరణ అవసరం లేదు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్స వాలు ఎప్పుడు జరిగినా ఆలయం చుట్టూ తొక్కిసలాట జరిగేది. నాడు అజయ్ గారు తీసుకున్న సాహసోపేత నిర్ణయం గుడి ముందున్న మండపాన్ని తొలగించడం. భిన్నాభిప్రాయాలు ఎన్ని ఉన్నా నేడు భక్తులు భారీగా తరలివచ్చినా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉత్సవాలను తనివితీరా చూడ గలుగుతున్నారు.
మార్పు రావాలి అంటే అది ప్రజలలో చైతన్యం వస్తేనే సాద్యం కనుక ప్రజలలో చైతన్యం కోసం “మేలుకొలుపు” పుస్తకం తీసుకొచ్చారు. అదే అంశంతో రాష్ట్రంలో పర్యటించారు. వారి పుస్తకంలో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులుపై నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను వెల్లడించారు. అజయ్ కల్లం వాస్తవాలకు చాలా దగ్గరగా వుండే వారు. తన మొత్తం సర్వీసులో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం తన పరిపాలన పద్ధతులతో రాష్ట్రాన్ని పూర్తిగా తిరోగమనం వైపు నేడుతున్న పరిస్థితి ఏర్పడింది. అన్నీ తెలిసిన తాను మౌనంగా ఉండటం మంచిది కాదని రాజకీయంగా విమర్శలు వచ్చినా వేరవకుండా తనకు తెలిసిన నిజాలను “సేవ్ ఆంద్రప్రదేశ్ ” పేరుతో రాష్ట్రం మొత్తం తిరిగి ప్రజల ముందు ఉంచారు. నేడు జరిగిన రాజకీయ మార్పులో ఈపరిణామం ఒక కీలక అంశం.
అజయ్ కల్లం గారిని ముఖ్య సలహాదారుగా నియమించడం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నారు. అజయ్ కల్లం తెలుగు ప్రజలకు నిజాలు చెప్పిన “సేవ్ ఆంద్రప్రదేశ్ ” కాన్సెప్ట్ ఆలోచనకు బీజం వేసే అవకాశం నాకు లభించడంతో వారితో కలిసి పనిచేసే అవకాశం లభించింది. చాలా తక్కువ సమయం అయినా వారితో నా ప్రయాణం చిరస్మరణీయంగా గుర్తుటుంది.
(ఫోటో: అజయ్ కల్లమ్ (ఎడమ)తో రచయిత -మధ్య)