(యనమల నాగిరెడ్డి)
సాధారణంగా లెక్కలలో 1+1=2 అనేది అందరికీ తెలిసిన లెక్కల సూత్రం. అయితే ఈ సాధారణ లెక్కల సూత్రం రాజకీయాలలో మాత్రం గతి తప్పి 1+1=0 గా మారింది.
దేశంలో ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికలలో ఈ సూత్రాన్ని ఇలా మార్చింది మాత్రం “ప్రజాస్వామ్యంలో అపర చాణక్యులనదగిన ఓటరు మహాశయులు !” అని చెప్పకతప్పదు. అవి జిల్లా స్థాయి ఎన్నికలు కావచ్చు. రాష్ట్ర స్థాయి రాజకీయాలు కావచ్చు. దేశ స్థాయి రాజకీయ కూటములు కావచ్చు. ఈ ఎన్నికలలో ఫలితం మాత్రం “రాజకీయాలలో ఒకటి+ఒకటి=సున్నే” అని నిరూపితమైంది.
వర్గ పోరుకు ప్రతీకగా ఉన్న కడప, కర్నూలు, అనంతపూర్ జిల్లాల ఎన్నికల ఫలితాలు ఈ కొత్త రాజకీయ సూత్రాన్ని నిరూపించాయి. ఇక దేశ రాజకీయాల విషయానికి వస్తే కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ లాంటి ప్రాంతాలలో కూడా ఈ సూత్రం రుజువైంది.
తమ నాయకుల కోసం నిరంతరం ఇరుగు పొరుగుతో యుద్ధం చేస్తూ ప్రాణాలు తీయడం నుండి ప్రాణాలు త్యాగం చేయడానికి సిద్దపడి పని చేసిన కార్యకర్తలు “ఆజన్మ విరోధులుగా ఉన్న తమ నాయకులు వారి తాత్కాలిక రాజకీయ అవసరాల కోసం, అధికారం కోసం ఒక్కటి కావడాన్ని” ఏ మాత్రం అంగీకరించలేక పోయారు.
ఎన్నో దశాబ్దాలుగా నాయకుల మధ్య (వారి పెత్తందారీ ఆధిపత్యం కోసం) పెట్టుకున్న విభేదాల కోసం తాము అనేక త్యాగాలు చేసి, కుటుంబాలను ఫణంగా పెట్టి “దొమ్మీలు, గొడవలు, హత్యలు చేసి, జైలు పాలై” అనేక ఇక్కట్లు ఎదుర్కొన్నామని, కానీ నాయకులు మాత్రం చెట్టా పట్టాలు వేసుకొని ఆనందంగా తిరుగుతూ ‘వారి లక్ష్యాలు’ చేరుకోవడానికి యత్నించడం జనం హర్షించలేదు.
అలాగే పెద్దలు పెట్టిన పార్టీల కోసం జెండాలు మోసి, తమ వారితోను, సహచరులతోను, గ్రామస్తులతోను విరోధం పెట్టుకొని తలలు పగల కొట్టుకుంటుంటే “అధినేతలు మాత్రం ఒక్కొక్క ఎన్నికలో ఒక్కొక్క కొత్త అవతారం ఎత్తుతుంటే” తామెందుకు ఎన్నికలలో కొత్త ఎత్తు ఎత్తకూడదని భావించిన కార్యకర్తలు, ప్రజలు మౌనంగా ఓ కొత్త సూత్రాన్ని కొత్తగా నిర్వచించి, అపవిత్ర కలయికలకు పాల్పడుతూ, కొత్త పొత్తులు చేసుకుంటున్న ఘనులకు తమదైన శైలిలో గుణపాఠం చెప్పారు. ఇందుకు తార్కాణాలెన్నో!
కడప జిల్లా జమ్ములమడుగు నియోజకవర్గం ముఠా తగాదాలకు, కక్షలకు, వర్గ హత్యలకు పేరు పోయింది. నియోజకవర్గంలో ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న “గుండ్లకుంట, దేవగుడి” కుటుంబాల తగాదాలకు, ఆధిపత్య పోరుకు ఇప్పటివరకు పెద్ద నాయకులతో సహా అనేకమంది తమ ప్రాణాలను కోల్పోయారు. కోర్టుల వెంబడి తిరగడం, జైలుకు వెళ్లడం ఇరువర్గాలకు చెందిన వారికి గత నాలుగు దశాబ్దాలుగా ఆనవాయితీగా మారింది. రెండు గుంపులు 1983కు ముందు ఒకే పార్టీలో ఉన్న రెండు గ్రూపుల చెంతన ఉంటూ తమ పోరు సాగించేవి.
1983 తర్వాత గుండ్లకుంట వారు టీడీపీ పంచన చేరగా దేవగుడి వారు కాంగ్రెస్ కొంగు పట్టుకున్నారు. అప్పటి వరకు హోరా హోరీ సాగే అన్ని రకాల ఎన్నికలలో రిగ్గింగులు, బాంబు దాడులు చేసుకుంటూ అటు అధికారులకు, ఇటు సాధారణ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేశారు. ఏ ఎన్నికలలో నైనా చేయి మించిన వారిదే గెలుపు. ఈవీఎంల రాకతో పోలింగ్ కేంద్రాల ఆక్రమణ, రిగ్గింగ్ తగ్గడంతో క్రమేణా ప్రజాభిప్రాయం ఎన్నికలలో ప్రతిఫలించడం జరిగింది. వీరి మధ్య గెలుపు ఓటముల తేడా అతి తక్కువగా ఉండేది.
2014 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా ఆదినారాయణ రెడ్డి, టీడీపీ అభ్యర్థి రామసుబ్బారెడ్డిని ఓడించి, ఆ తర్వాత వైసీపీ అధినేత జగన్ తో చంద్రబాబు పంచన చేరి మంత్రి పదవి పొంది ఇష్టారాజ్యంగా వ్యవహరించారని, టీడీపీ కార్యకర్తలు (రామసుబ్బారెడ్డి వర్గీయులను) ముప్ప తిప్పలు పెట్టారనేది జగమెరిగిన సత్యం. చంద్రబాబు చాణక్యం పని చేసి ఇరువురు కలసి రామసుబ్బారెడ్డి ఎంఎల్ ఏ గా, ఆదినారాయణ రెడ్డి ఎంపీ గా టీడీపీ నుండి పోటీ చేశారు.
అయితే ప్రజలు, వీరి వర్గాలకు చెందిన కార్యకర్తలు జరుగుతున్నపరిణామాలను మౌనంగా గమనిస్తూ ఓటు ఆయుధంతో బుద్ది చెప్పారు. నియోజకవర్గంలో ఎవరికీ తెలియని సుధీర్ రెడ్డికి 51 వేల మెజారిటీ ఇచ్చారు. అలాగే ఉత్తర కుమార ప్రగల్బాలు పలికిన ఆదినారాయణ రెడ్డికి మాడు పగిలేలా గుణపాఠం చెప్పారు.
ఇకపోతే కర్నూల్ జిల్లాలో కొన్ని దశాబ్దాల నుండి బద్ధ వైరం సాగించిన కోట్ల, కెఇ వర్గాలు ఒకటి కావడం ఆ జిల్లా ప్రజలు ఏ మాత్రం సహించలేక పోయారు. కోట్లకు కంచుకోటలా ఉన్న కర్నూల్ పార్లమెంటరీ స్తానం నుండి ఇటీవల పార్టీ మారి టీడీపీ నుండి పోటీ చేసిన సూర్య ప్రకాష్ రెడ్డి ఒక రకంగా రాజకీయాలలో అనామకుడైన ఓ డాక్టర్ చేతిలో ఓడిపోయారు.
ఇకపోతే ఆయన భార్య శ్రీమతి కోట్ల సుజాతమ్మ కూడా వైసీపీ అభ్యర్థి చేతిలో దారుణంగా పరాజితులయ్యారు. కాగా గత ఐదు సంవత్సరాలుగా అధికార పక్షంలో ఉప ముఖ్యమంత్రిగా, రెవిన్యూ మంత్రిగా ఉండి జిల్లాలో రాజకీయంగా తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన కెఇ క్రిష్ట్నమూర్తి కుమారుడు శ్యామ్ బాబు ధోన్ లో వైసీపీ అభ్యర్థి రాజేంద్రనాథ్ రెడ్డి చేతిలో ఘోర పరాజయం పాలు కాగా, ఆయన సోదరుడు పత్తికొండ నియోజకవర్గంలో మట్టి కరిచారు. వర్గ రాజకీయాలకు ప్రాధాన్యమిచ్చి అనేక దశాబ్దాల పాటు పోరాడి చివరగా అధికారం కోసం వైరి వర్గాలు చేతులు కలపడాన్ని వారి అనుచరులతో పాటు జనం ఛీకొట్టారు.
ఇక అనంతపూర్ జిల్లాలో కులాల కుమ్ములాటలకు ప్రాధాన్యమిచ్చి కొన్ని దశాబ్దాలుగా కుల, వర్గ సామ్రాజ్యాలను నిర్మించుకొని, నిరంకుశంగా పాలన సాగించిన జేసీ బ్రదర్స్, పరిటాల కుటుంబాల కలయికను 2014లో ఒకసారి భరించిన జనం రెండవ సారి ఛీత్కరించారు. వీరి కలయికను ఆమోదించని అనంతపూర్ ప్రజలు జేసీ బ్రదర్స్ ఇరువురి కుమారులను, పరిటాల సునీత కుమారుడిని , ఎన్నికలలో పోటీ చేసిన వారి ముఖ్య మద్దతుదారులను కూడా ప్రజలు శంకరగిరి మాన్యాలు పట్టించారు.
దేశ రాజకీయ తెర మీద ఎన్నో చిత్రాలు !!
ఇక దేశ రాజకీయాలలో ఇలాంటి చిత్రాలు అనేకం అధినేతలకు తలా బొప్పి కట్టించాయి. మన పక్కనే ఉన్న కర్ణాటకలో జేడీఎస్ కాంగ్రెస్ పొత్తు ఇందుకు ప్రధమ తార్కాణంగా నిలిచింది.
శాసన సభ ఎన్నికలలో త్రిముఖ పోటీ ఉన్నా అనేక నియోజక వర్గాలలో జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలే ప్రధానంగా బాహా బాహీ యుద్దానికి దిగాయి. అప్పటి వరకు కత్తులు నూరుకొని బీజేపీని అధికారంలోకి రానివ్వకూడదన్న ఏకైక లక్ష్యంతో అధికార పీఠం కోసం రాష్ట్ర స్థాయిలో ఒక్కటైన కాంగ్రెస్, జేడీఎస్ అధినేతలు మొక్కుబడిగా కలసి ఉన్నా అంతర్గత విభేదాలు పార్టీ కార్యకర్తలను కుదిపి వేసాయి.
ముఖ్యమంత్రి కుమారస్వామి, కాంగ్రెస్ నేత మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య లు నోటితో నవ్వుతూ, ఒకరిని ఒకరు నొసటితో వెక్కిరించుకోవడం వారి దిన చర్యగా మారింది. క్రింది స్థాయిలో నాయకులు, కార్యకర్తలు ఉప్పు-నిప్పుగా కాపురం సాగించే దశలో వచ్చిన పార్లమెంట్ ఎన్నికలలో వీరికి ప్రజలు మరచిపోలేని గుణపాఠం చెప్పారు.
కుటుంబ పాలనకు, దిశా దశ లేని రాజకీయ పొత్తులకు వ్యతిరేకంగా కర్ణాటక వాసులు ఈ కూటమిని చావు దెబ్బ తీశారు. గౌడల కులదైవంగా ఉహించుకుంటున్న దేవెగౌడ, ముఖ్యమంత్రి తనయుడు నిఖిల్, కాంగ్రెస్ ఘనాపాఠీలు ,వీరప్పమొయిలీ, మల్లికార్జునఖర్గే, మునియప్ప లాంటి రాజకీయ ధురంధరులు చతికిల పడ్డారు.
“భావి భారత ప్రధానులం మేమే” అని కలలు కని, వాటిని సాకారం చేసుకోడానికి చేతులు కలిపిన బీఎస్పీ, సమాజ్ వాదీ పార్టీలు ఉత్తర ప్రదేశ్ లో మట్టి కరిచాయి. బీజేపీని కలికం లోకి కూడా లేకుండా ఓడిస్తామని బీరాలు పలుకుతూ, కాంగ్రెసుతో పొత్తు కూడా నిరాకరించిన ఈ పార్టీలకు కార్యకర్తలు, ప్రజలు మరచిపోలేని పాఠం నేర్పారు.
ఎవరంతకు వారు మొనగాళ్లమని, “ప్రజలు కసాయిని నమ్మిన గొర్రెల్లా” తమ వెంట వస్తారని ఆశించిన ఈ ఘనులకు తీరని ఆశాభంగం కలిగింది. ఒక్కరిలో ఒకరు లేని వీరిని నమ్మి ఓట్లేస్తే తమతో పాటు దేశాన్ని కూడా ముంచుతారని తెలుసుకొన్న జనం తమదైన శైలిలో వీరికి చుక్కలు చూపారు.
ఏది ఏమైనా నాయకులు తమ అవసరాలకోసం, అధికారం కోసం చేస్తున్న అపవిత్ర కలయికను తాము ఇక ముందు ఆమోదించమని వర్గ పోరులో తమను, తమ కుటుంబాలను సమిధలుగా చేసిన అనుచరులు ఆయా నాయకులకు “ఓటు అనే ఆయుధంతో ‘నొక్కి’ చెప్పారు. ఇక తమ రాజ్యాధికారమే తమకు ముఖ్యమని, అందుకోసం తాము “ఇష్టారాజ్యంగా” సాగుతామని విర్రవీగుతున్న ఘనులకు “ఇలాంటి మీ చెత్త ఆటలు” ఇక సాగవని పార్టీల అధినేతలకు కూడా ప్రజలు, పార్టీల కార్యకర్తలు ఘంటా పథంగా గుణపాఠం చెప్పారు.
వర్గ రాజకీయ నాయకులు, పార్టీల అధినేతలు తమ ప్రయోజనాలే కాకుండా ప్రజల అవసరాలు, కార్యకర్తల మనోభావాలు పట్టించుకోవాలని ఈ ఎన్నికలు పార్టీలకు, నియోజకవర్గ నాయకులకు తేల్చి చెప్పాయి. వీరు గుణపాఠం నేర్చుకుంటారా? లేక తమదైన శైలిలోనే వెళతారా?ముందు ముందు వచ్చే ఎన్నికలు తెలుస్తాయి.
(ఈ వార్త నచ్చితే, షేర్ చేయండి,ఇండిపెండెంట్ జర్నలిజాన్ని ప్రోత్సహించండి)