ఇక నుంచి ఢిల్లీ మెట్రో రైలులో, సిటీ బస్సులలో మహిళలుకు టికెట్ అవసరం లేదు. వారు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ రోజు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ విషయం ప్రకటించారు. మహిళల భద్రత కోసం ఈ చర్యలు తీసుకున్నామని ఆయన ప్రకటించారు. లోక్ సభ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయి,అయిదు ఢిల్లీ నియోకవర్గాలలో మూడో స్థానంలోకి పడిపోయిన పదిరోజుల్లోనే ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారు. సీటీ బస్సులకు, ఢిల్లీ మెట్రో రైల్ ఉచితంగా ప్రయాణించే మహిళల చార్జీలను ఢిల్లీ ప్రభుత్వం చెల్లిస్తుందనిఆయన ప్రకటించారు. ఈ ఏడాది ఈ ఖర్చు దాదాపు రు. 700 కోట్ల దాకా ఉంటుంది.
ఈ లోక్ సభ ఎన్నికల్లో ఎదురు దెబ్బతగిలినా, వచ్చేఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ తిరిగి రావాలనే కొండంత ఆశతో కేజ్రీవాల్ ఈ రోజు ఉప ముఖ్యమంత్రి మనీష్ శిశోడియా కలసి ఈప్రకటన చేశారు.
‘మేం ఢిల్లీలో పాఠశాలలను, ఆసుపత్రులను, మంచినీళ్లను ఉచితొ చేశామని మమ్మల్ని విమర్శిస్తున్నారు.
అయితే,దోచుకోవడం లేదని వాళ్లంతా సంతోషించాలి. మా ప్రభుత్వం, మంత్రులు నిజాయితీగా పనిచేస్తున్నారు. రవాణా శాఖ మంత్రి కైలాష్ గెహ్లాట్ బస్సులు కొనుగోలుచేసేందుకు లంచంతీసుకోలేదు. అవినీతి నివారించి మిగిలించిన లాభాలను మేం ప్రజలకు పంచుతున్నాం,’ కేజ్రీవాల్ విలేకరుల సమావేశంలో చెప్పారు.
రవాణాశాఖ, ఢిల్లీ మెట్రలో మహిళా ప్రయాణికులకు సంబంధించిన గణాంక వివరాలమీద నివేదిక సమర్పించగానే ఈఉచిత ప్రయాణం పథకం అమలులోకి వస్తుందని ఆయన చెప్పారు. మహిళకు ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల మహిళాఉద్యోగుల సంఖ్యపెరుగుతుందని ఆయన అన్నారు. ఇపుడు ఉద్యోగుల్లో మహిళల సంఖ్య కేవలం 11 శాతమే ఉందని, జాతీయ స్థాయిలో ఇది 27 శాతం దాకా ఉందని ఆయన చెప్పారు.
ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం విద్యచ్చక్తి బిల్లులో 50 శాతం సబ్సిడి ఇస్తున్నది. కుటుంబానికి 20 వేల లీటర్ల మంచినీళ్లను సరఫరాచేస్తున్నది.