దేవుడు ఎంత గొప్పగా పని చేస్తాడని జరగబోయే దాని స్క్రిప్ట్ కూడా చక్కగా రాస్తాడు అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలున్నాయని, అందులో ఇటీవల జరగిన ఎన్నికలు ఒక మంచి ఉదాహరణ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.
సోమవారం నాడు గుంటూరులోని పెరేడ్ గ్రౌండ్లో ప్రభుత్వ ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్ంగా ఆయన ప్రసంగించారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు:
– గత ఎన్నికల్లో 67 మంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉంటే, వారిలో 23 మంది ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి, డబ్బులు ఇచ్చి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు కొనుగోలు చేశారు. వారిలో నలుగురిని మంత్రులుగా కూడా చేశారు. నిజానికి ఎవరైనా ఎమ్మెల్యే పార్టీ మారితే వారిని అనర్హులను చేయాలి. లేదా రాజీనామా చేయించి మళ్లీ గెలిపించుకోవాలి. కానీ చంద్రబాబు పాలనలో అది జరగలేదు. అదే విధంగా పార్టీకి చెందిన 9 మంది ఎంపీలు ఉంటే, వారిలో ముగ్గురిని కొనుగోలు చేశారు. ఏమయింది?
దేవుడు స్క్రిప్ట్ రాస్తే, ఎలా ఉంటుందో తెలుసా! పవిత్ర రంజాన్ మాసంలోనే ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అది కూడా 23వ తేదీనే. మా పార్టీ నుంచి టీడీపీ కొనుగోలు చేసిన ఎమ్మెల్యేల సంఖ్య కూడా సరిగ్గా 23. ఇక ఈ ఎన్నికల్లో టీడీపీ గెల్చింది కూడా కేవలం 23 స్థానాలు మాత్రమే.
అదే విధంగా మా పార్టీ నుంచి ముగ్గురు ఎంపీలను టీడీపీ కొనుగోలు చేసింది.
ఈ ఎన్నికల్లో ఆ పార్టీ గెల్చుకుంది కూడా కేవలం మూడు ఎంపీ సీట్లు మాత్రమే.
దేవుడు స్క్రిప్ట్ రాస్తే ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణ ఏముంటుంది?
మా నాన్నగారి తరహాలో మీ అందరికీ మేలు చేస్తాను. మంచి చేస్తాను. మహానేత వైయస్సార్ కంటే ఇంకా మంచి పాలన అందించడానికి ప్రయత్నిస్తాను.
ఈ ఎన్నికల్లో ముస్లింలలో 5 గురికి టికెట్ ఇస్తే, నలుగురు గెల్చారు. ఒక్క ఇక్బాల్ మాత్రమే ఓడిపోయారు.
కాబట్టి ఆయనను వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబెట్టి గెలిపించుకుంటాను. ఆ విధంగా ఆయనను కూడా చట్టసభలో కూర్చోబెడతాను.