బీహార్ లో అధికారంలో ఉన్న జనతా దళ్ (యునైటెడ్)కు భారతీయ జనతా పార్టీకి వివాదం ముదురుతూ ఉంది. కేంద్ర మంత్రి వర్గం కూర్పులో కేవలం ఒకే ఒక మంత్రి పదవి ఇస్తామని ప్రధాని మోదీ చేసిన ఆఫర్ తో ముఖ్యమంత్రి నితిష్ కుమార్ అవమానంగా ఫీలయ్యారు.
అయితే, దాన్ని ఆయన దిగమింగుతూ కూర్చోలేక పోయారు. ఆయన ఈ రోజు బీహార్ మంత్రివర్గాన్ని భారీగా విస్తరించారు. ఎనిమిది మంది మంత్రులను క్యాబినెట్ లోకి తీసుకున్నారు. ఇందులో ఒక్కరు కూడా బిజెపి సభ్యుడు లేరు. ఆయన కూడా బిజెపికి ఒక్క సీటు మాత్రం ఇస్తానని చెప్పాడని దానికి బిజెపికి సమ్మతించలేదని, అందుకే క్యాబినెట్ లో చేరలేదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
జెడి(యు) కేంద్ర క్యాబినెట్ లో గౌరవ ప్రదమయిన సంఖ్యలో మంత్రి పదవులివ్వనందునే, నితిష్ టిట్ ఫర్ టాట్ ఇచ్చాడని వస్తున్న ప్రచారాన్ని నితిష్ ఖండించాడు.
బిజెపి మీద తనకు ఎలాంటి కోపం లేదని, క్యాబినెట్ విస్తరణ బిజెపితోసంప్రదించాక చేపట్టానని ఆయన చెబుతున్నారు. అయితే, ఆయన బిజెపి మీద ఎంత ఆగ్రహంతో ఉన్నారంటే, కేంద్ర క్యాబినెట్ ప్రమాణ కార్యక్రమానికి హాజరయి పట్నాతిరిగివచ్చాక వెంటనే నరేంద్ర మోదీ ప్రభుత్వంలో చేరే ప్రసక్తి లేదని, ఇపుడే కాదు, భవిష్యత్తులో కూడా చేరేది లేదని ఆయనచెప్పేశారు.
జెడియుకు కేవలం ఒక మంత్రి పదవి మాత్రమే ఇస్తామని చెప్పారని, అయితే, ఇది సీట్ల దామాషాకు సమానం కాదని ఆయన అన్నారు. బీహార్ లో 17 ఎంపి లకుపోటీ చేసి 16 సీట్లను గెల్చుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఇది జెడి(యు)ను అవమానించడమేనని ఆయన అభిప్రాయపడ్డారు.