ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయంపై వైసీపీ వర్గాలు హర్షిస్తుండగా… టీడీపీ శ్రేణుల్లో మాత్రం టెన్షన్ మొదలైనట్టు తెలుస్తోంది. ఇంతకీ జగన్ తీసుకున్న ఆ సంచలన నిర్ణయం ఏమిటి? టీడీపీ వర్గాల భయానికి కారణం ఏమిటో తెలియాలంటే కింద ఉన్న మ్యాటర్ చదవండి.
టీడీపీ హయాంలో సిబిఐకి ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సిబిఐ ని అడ్డం పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ సీఎం చంద్రబాబు ఆరోపణలు చేశారు. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా సదరు రాష్ట్రంలో సిబిఐ అడుగుపెట్టే అధికారం లేకుండా చట్ట సవరణ చేశారు. కాగా చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసే దిశగా జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
అయితే జగన్ తీసుకున్న నిర్ణయం టీడీపీ నాయకులకు గుబులు రేపుతోంది. సిబిఐ కి టీడీపీ ప్రభుత్వం రెడ్ సిగ్నల్ ఇస్తే… జగన్ సీబీఐకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని నిర్ణయించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జగన్ కూడా సిబిఐ కేసుల్లో నిందితుడే… అయినప్పటికీ ఆయన తీసుకున్న నిర్ణయం టీడీపీని ఇరకాటంలోకి నెట్టడానికి అని స్పష్టం అవుతోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
రాజధాని నిర్మాణం విషయంలో టీడీపీ ప్రభుత్వం అనేక అక్రమాలకు పాల్పడుతోందని ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ అనేకసార్లు ఆరోపణలు చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఢిల్లీలో ప్రధానిని కలిసిన అనంతరం మీడియా ఎదుట జగన్ మరోసారి అదే ఆరోపణలు చేసారు. రాజధాని భూ స్కామ్ పెద్ద ఎత్తున జరిగిందని, కాంట్రాక్టుల్లో అవినీతి జరిగిందని ఆరోపించారు. వీటిపైన విచారణ జరపాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో జగన్ సీబీఐకి లైన్ క్లియర్ చేయడం కొత్త చర్చకు దారి తీసింది. మోడీని కలిసిన తర్వాత జగన్ ఈ నిర్ణయానికి రావడం చర్చనీయాంశంగా మారింది. రాజధాని నిర్మాణంలో జరిగిన అవినీతి, అవకతవకలపైన సిబిఐ విచారణ జరిపిస్తారనే టాక్ వినిపిస్తోంది. అందుకే టీడీపీ నేతలు కలత చెందుతున్నారని విమర్శలు వెల్లువెత్తాయి. కాగా మంత్రివర్గ విస్తరణ తర్వాత దీనిపై క్లారిటీ వస్తుందని సమాచారం.