కాంగ్రెస్ పార్టీకి చెందిన ములుగు ఎమ్మెల్యే దనసరి అనసూయ అలియాస్ సీతక్కను ములుగు జిల్లా అధికారులు అవమానించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఈ ఘటన జరిగింది. ఏకంగా జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి నాయకత్వంలొనే ఈ చర్య జరగడం రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు చదవండి…
తెలంగాణ ఆవిర్భావ వేడుకలు రాష్ట్రమంతా ఘనంగా జరిగాయి. భారీగా డబ్బు ఖర్చు పెట్టి సర్కార్ వేడుకలు ఏర్పాటు చేసింది. ములుగు జిల్లాలోను ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ నారాయణరెడ్డి నేతృత్వంలో వేడుకలు జరిపారు. స్థానిక ఎమ్మెల్యే సీతక్కను కూడా వేడుకలకు ఆహ్వానించారు. ప్రోటోకాల్ ప్రకారమే ఆమెకు ఆహ్వానం పంపారు అధికారులు. అయితే తీరా ములుగు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కల్చరల్ కార్యక్రమాలకు సీతక్కకు ఆహ్వానం పంపారు. కానీ సీతక్క అక్కడికి వచ్చినా ఆమెను వేదిక మీదకు పిలవలేదు.
ప్రొటోకాల్ ప్రకారం ఆమె స్థానిక శాసనసభ్యురాలు కాబట్టి వేదిక మీదకు ఆహ్వానించాలి. కానీ ఆమెను పిలవకుండా చూడనట్లు వ్యవహరించారు. అంతేకాదు తెరాస ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లును వేదిక మీద కూర్చోబెట్టారు. కానీ సీతక్క ను పిలవకపోవడంతో ఆమె అసహనం వ్యక్తం చేశారు. వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. అపుడు అధికారులు గుర్తించి వేదిక మీదకు పిలిచారు. అప్పుడు సీతక్క అధికారుల మీద ఫైర్ అయ్యారు.
తాను ఆదివాసీ ఎమ్మెల్యే కాబట్టి తనను అవమానించారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. లేకపోతే దొడ్డిదారిలో ప్రజాప్రతినిధి అయిన వారికి వేదిక మీద కూర్చోబెట్టి (ఎమ్మెల్సీ బోడకుంటి ని ఉద్దేశించి) ప్రజల్లో గెలిచిన తనలాంటి వారిని అవమానిస్తారా అని ఫైర్ అయ్యారు. ఒక పార్టీలో గెలిచి అధికార పార్టీలోకి వెళ్లిన వారిని వేదికల మీద కూర్చోబెట్టి గౌరవిస్తూ ఎంతగా ఒత్తిడి చేసినా పార్టీ మారని తనలాంటి వారిని చిన్నచూపు చూస్తారా అని మండిపడ్డారు. సభా వేదిక వద్ద సీతక్క అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగే ప్రయత్నం చేశారు. వారిని సీతక్క వారించారు. అనంతరం సీతక్క అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అధికార పార్టీ వారు ఎంత అవమానించే ప్రయత్నం చేసినా తాము బెదిరే ప్రసక్తే లేదన్నారు. మరింత ఆత్మవిశ్వాసంతో పని చేస్తామన్నారు. ఇది తనకు జరిగిన అవమానమే కాదన్న సీతక్క యావత్ ములుగు ప్రజలకు జరిగిన అవమానంగా భావిస్తున్నట్లు హెచ్చరించారు.
భయపడుతున్నారు : సీతక్క
జరిగిన ఘటన పై సీతక్క ట్రెండింగ్ తెలుగు న్యూస్ తో మాట్లాడారు. తెరాస పార్టీకి అధికారులు, ఉద్యోగులు భయపడుతున్నారని అన్నారు. అధికార పార్టీకి భయపడి అధికారులు ఇలా చేసారని ఆరోపించారు.