తెలుగులో ఈమధ్యకాలంలో వరసగా కొన్ని బయోపిక్ లనబడే సినిమాలు వచ్చాయి. ఇవి మహానటి సావిత్రితో మొదలై ఆ తరువాత యాత్ర, కథానాయకుడు, మహానాయకుడు, లక్ష్మీస్ NTR లాంటివి వచ్చాయి.
ఐతే వీటిని నిజమైన బయోపిక్ స్పూర్తితో తీసినవి అనడంకంటే వేరువేరు ప్రయోజనాలు ఆశించి తీసినవి అనడం సబబు. వీటిమీద సోషల్ మీడియాలో చాలా చర్చలు జరిగాయి. మిగతావాటికంటే మహానటి కొంత నయం అనుకున్నా అది కొన్ని లక్షణాలవల్ల ఆదర్శవంతమైన బయోపిక్ అవదు. అవేంటో చూద్దాం.
సావిత్రి వ్యక్తిగా కాక ఒక మహానటిగా దక్షిణభారత ప్రజల మనస్సులో స్థిరంగా నిలిచిపోయింది. చిత్రమేమిటంటే ఆమె వ్యక్తిగత జీవితకథ అనేక మలుపులతో ఒక సినిమా కథను పోలి ఉంటుంది. అందుకే ‘మహానటి ‘ అని పేరు పెట్టి, జనంలో నటిగా ఆమె స్థానాన్ని ఉపయోగించుకుంటూ ఆమె జీవితకథ మీద సినిమా తీశారు.
ఒక మహానటి చరిత్రగాకాక ‘ప్రేమలో మోసానికి గురై విషాదంగా ముగిసిన ఒక సున్నితమైన స్త్రీ జీవిత కథగా’ చూపించారు. సినిమా ఒక సందేశాత్మక కళారూపాన్ని వదిలేసి ఒక వ్యాపారంగా మారి కొన్ని దశాబ్దాలైపోయిందికాబట్టి ఇప్పుడు ఇంతకన్నా ఎక్కువ ఆశించలేం.
సావిత్రి కథను సినిమాగా తీయాలనే బలమైన కోరిక డైరెక్టర్ కు ఉన్నా ఇలాంటివి తెలుగులో ఆడవేమోనన్న భయంవల్ల స్క్రిప్టు ఫోకస్ సావిత్రి నటన మీద కాకుండా జీవితంమీద పెట్టినట్టు కనపడుతోంది. రామాయణంలో పిడకలవేటలా సమంత పాత్రని అదనంగా చేర్చడానికి కూడా ఇదే కారణం కావచ్చు.
సావిత్రి నటిగా చాలా గొప్పది కానీ వ్యక్తిగా బలహీనురాలు. ఒక పెళ్లయిన వ్యక్తిని ప్రేమించి అతన్ని రెండోపెళ్లి చేసుకుని తిరిగి అతను మరోస్త్రీ దగ్గరకెళ్ళగా అతన్ని ద్వేషించి, తాగుడుకు బానిసై స్వంతపిల్లల్ని కూడా పట్టించుకోని బలహీనురాలు. అంతేకాదు, విపరీతంగా సంపాదించిన ఆమె విచక్షణారహితంగా దానాలు చేసి అప్పులపాలౌతుంది స్వంతవా ళ్లచేతుల్లోకూడా మోసపోయింది.
స్వాతంత్ర్యపోరాటంలో, ఉద్యమాలలో దేశంకోసం సంసారాలను త్యాగంచేసిన వాళ్లు, మొత్తం నగలు, ఆస్తి ఇచ్చి బికారులైనవాళ్లూ, జైలుపాలైన స్పూర్తిదాయకమైన ఆడవాళ్లూ వేలల్లో ఉన్నారు సినిమా ఫీల్డులోనే నాగయ్యలాంటి వాళ్లెందరో (దురలవాట్లకు లోనుకాని) దాతలున్నారు. తెలుగు ప్రేక్షకులు చూడరని వీళ్లమీద డాక్యుమెంటరీలు కూడారావు.
గమనించాల్సిందేమిటంటే రెండూవేరుకాకపోయినా వ్యక్తిగతంగా సావిత్రి జీవితం కంటె కళాకారిణిగా ఆమె జీవితం గొప్పది. ఈ తరం వాళ్లు ముఖ్యంగా తెలుసుకోవలసింది నటిగా ఆమెగురించి. నటిగా ఆమె ప్రస్థానం గురించి తెలుసుకోవడానికి వెళ్లిన ఈతరం ప్రేక్షకులకు ఈసినిమా ఏ ఇమేజ్ ని చూపిస్తుంది? ఈ సినిమా ప్రయోజనం అదేనా?
ఈ సినిమా తీయడానికి ప్రేరణ ఆమె గొప్ప నటి కావడం అయ్యుండాలి. ఆమె కష్టాలు కాదు. అలా అయితే మరోసారి ‘సతీసక్కూబాయి’ తీయడం మేలు. సావిత్రి భారత దేశంలోనే గొప్పనటి ఎందుకైంది, ఎలా అయింది, ఆమెలో తపన, పరిణితి ఎలావచ్చింది. ఆమెకు ఇతరులకూ నటనలో తేడాలేంటి…. ఇలాంటి నటనాప్రస్తానం ఆసక్తికరంగా కథారూపంలో చూపించినప్పుడే నటిగా ఆమె గొప్పతనం ప్రపంచానికి తెలుస్తుంది. అలాంటి సీన్లు చాలాతక్కువ గావున్నాయి. కంటిలో లెక్కప్రకారం నీటిచుక్కలు తెప్పించడం ఒక టెక్నిక్, గొప్పనటనకు ఉదాహరణకాదు. మిస్సమ్మ, కన్యాశుల్కం, మూగమనసులు, మంచిమనసులు, గుండమ్మకథ లాంటి సినిమాల్లోని ఆమె అనితరసాధ్యమైన నటన ప్రసక్తే సినిమాలో లేదు.
లెక్కప్రకారం సావిత్రి వ్యక్తిగత జీవితం నేపధ్యంలో మాత్రమే ఉండాల్సివుంది. ఆమె పతనం ఆమె తప్పుల ఫలితం, పరిస్తితుల ప్రభావం. హైలైట్ కాదు. ఈ సినిమాలో అలా లేదు. డైరెక్టర్ ఈ సహజమైన లైన్ ని పక్కకు పెట్టే సినట్టు కనిపిస్తుంది.
ఈవిషయంలో పూర్తిగా డైరెక్టర్ ని తప్పుబట్టడానికి వీలు లేదు. డైరెక్ట ర్లకి ప్రేక్షకులమీద సీరియస్ సినిమాలుకూడా చూస్తారన్న గట్టినమ్మకముంటే ఎలాంటి అంశాన్నైనా విజయవంతంగా తీయసాహసిస్తారు. తెలుగులో ఆ పరిస్తితి లేకపోవడం దురదృష్టం. ప్రపంచవ్యాప్తంగా గొప్పగా తీసి విజయవంతమైన బయోపిక్ లు చాలావున్నాయి.
మరి సినిమా ఎలా విజయవంతమైంది? నటిగా (వ్యక్తిగా కాదు) ఆమెను అభిమానించే లక్షలాది తెలుగు తమిళ ప్రేక్షకులు సినిమా చూస్తున్నప్పుడు సావిత్రి నటనతో ఉండే అటాచ్మెంట్ వల్ల సావిత్రిని గుర్తుకు తెచ్చుకుని సంతోషించి సినిమాను ఎంజాయ్ చేయగలిగారు. ఇది దర్శకుడు సరిగ్గానే ఊహించి ప్లాన్ చెయ్యగలిగారు.
కీర్తీ సురేష్ రూపం పాత్రకు సరిపోవడం, కష్టపడి చక్కగా నటించడం, దుల్కర్ జెమిని కంటె అందంగా ఉండడం, ఫోటోగ్రఫీ బాగుండడం (సావిత్రి పాత సినిమా వీడియో క్లిప్పింగులు వేయకుండా జాగ్రత్త పడడం) కలిసొచ్చిన విషయాలు.
ఏమైనా కలెక్షన్ల పరంగా విజయవంతమైనప్పటికీ ఇది తెలుగు సినిమా ప్రమాణాలను విమర్శకులు ఆశించినంతగా పెంచలేకపోయింది. ఈ సినిమాను సేఫ్ మోడ్ లో తీయడం వల్ల ఇది బాహుబలిలాంటి మరో పోగొట్టుకున్న ఆవకాశమైంది. అయినప్పటికీ ఇది పెద్ద సాహసమే. మహానటి సావిత్రిని మళ్లీ మనముందుక తెచ్చిన నిర్మాత దర్శకులే కాక అందరూ అభినందనీయులే.
దీని తరువాత వచ్చిన ముఖ్యమైన బయోపిక్ లు N.T.రామారావు మీద తీసిన కథానాయకుడు, మహానాయకుడు. వీటిల్లో రామారావును పూర్తిగా ఒక లోపాలేలేని ఉత్తమపురుషుడిగా చూపించే ప్రయత్నం జరిగి అవి సహజత్వానికి దూరమై విజయవంతం కాలేకపోయాయి. సామాన్య ప్రేక్షకులలో రామారావుమీద ఉన్న ఆరాధనా భావంకూడా ఈ సినిమాలను నిలబెట్టలేకపోయింది. మిగతా సినిమాలని పూర్తిగా బయోపిక్ లు అనలేం. సహజత్వంతో కూడి బాగాతీసిన బయోపిక్ లు తప్పక విజయాలను, మన్ననలనూ సాధించగలవు. అలాంటివి రావాలంటే దర్శకులు ధైర్యమైనా చేయాలి, ప్రేక్షకుల ఆదరణన్నా పెరగాలి. ఇది విత్తు ముందా?, చెట్టుముందా? లాంటి పరిస్తితి.
సినిమా ఒక రిస్క్ తో కూడుకున్న ఖరీదైన వ్యాపారం. సేవాకార్యక్రమం కాదు. ప్రేక్షకులు అర్థం చేసుకుని సీరియస్ సినిమాలను ఆదరిస్తే తప్పక మళ్లీ గొప్ప సినిమాలు వస్తాయి.