విశాఖపట్నం: గోదావరి నదిపై గత తెలుగుదేశం ప్రభుత్వం ప్రభుత్వం చేపట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు తాత్కాలికంగా నిలిపి వేయమని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్ జిటి) ఆదేశాలు జారీ చేసింది.
ఎత్తిపోతల పథకాలపై మాజీమంత్రి వట్టి వసంత్ కుమార్ దాఖలు చేసిన పిటీషన్ పై విచారణ జరిగిన ఎన్ జిటి ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ.
ఈ ప్రాజక్టుల మీద వచ్చిన ఆరోపణల విచారణ కోసం ఒక కమిటీ ని కూడా నియమించింది. నెలరోజుల వ్యవధిలో ఈ కమిటీ నివేదిక ఇవ్వాలని ట్రిబ్యునల్ ఆదేశించింది.
గత ఏపీ ప్రభుత్వం చేపట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ల్లో పారదర్శకత లేదని, నదుల అనుసంధానం పేరుతో ప్రభుత్వం అనుమతులు కూడా పొందలేదని, నిబంధనలు పాటించలేదని వసంత కుమార్ పేర్కొన్నారు.
రుచి మరిగిన పులిలా కమిషన్లకు కక్కుర్తి పడి ప్రాజెక్ట్ లు చేపట్టారని, అందుకే తాను డెల్టా ప్రాంత రైతుగా కోర్టును ఆశ్రయించానని ఆయన చెప్పారు.
చింతలపూడి,పట్టిసీమ ప్రాజెక్ట్ లు బచావత్ ట్రిబ్యునల్ నిర్ధేశానికి పూర్తి విరుద్ధమని చెబుతూ టీడీపీ ప్రభుత్వం డెల్టా రైతుల జీవితాలతో ఆడుకుందని ఆయన విమర్శించారు. రైతులకు హానిచేస్తున్న ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా 2015నుంచి కోర్టులో పోరాడుతున్నానని మాజీమంత్రి వట్టి వసంత్ కుమార్ చెప్పారు.