ప్రధాని నరేంద్ర మోదీ తన వారసుడిని తయారుచేసుకుంటున్నారని వార్తలొస్తున్నాయి. 2024 ఎన్నికల ప్రచారానికి నాయకత్వం వహించి, పార్టీని గెలిపించి, కొత్త ప్రభుత్వాన్ని కొత్త ప్రధాని నాయకత్వంలో ఏర్పాటుచేయించి ఆయన రాజకీయాలనుంచి తప్పుకుంటారని జాతీయ రాజకీయాల విశ్లేషకులు చెబుతున్నారు,రాస్తున్నారు. ఎందుకంటే, 2024 నాటి మోదీ వయసు 73 సంవత్సరాలవుతుంది. రాజకీయాల్లో ఉండేందుకు 75 సంవత్సరాల వయోపరిమితి చెప్పకుండా ఇపుడు మోదీ అమలుచేస్తున్నారు. ఈ కారణాన్నే ఆయన ఎల్ కె అద్వానీ, మురళీ మనోహర్ జోషి,సుమిత్రా మహజన్ లకు ఎంపి టికెట్లివ్వలేదని 2024 ఎన్నికల తర్వాత ఈ నియమాన్ని తనకూ వర్తింపచేసుకని ఆయన రాజకీయాలనుంచి తప్పుకుంటారని ఈ విశ్లేషకులు చెబుతున్నారు.ఇతర రాజకీయ నాయకులలాగా మోదీకి సంసారం, సంతానం లేదు. బంధువులను కూడా ఆయన దరికి రానీయలేదు. కాబట్టి కుటుంబం నుంచి వారసుడిని తెచ్చే ప్రసక్తే ఉండదు. అందువల్ల పార్టీ నుంచే వారసుడి రావాలి.
మరి వారసుడెవరు?
ఇపుడు బిజెపి అన్నా, ప్రభుత్వమన్నా ఇద్దరే. ఒకరు మోదీ అయితే, రెండవ వ్యక్తి పార్టీ అధ్యక్షుడు అమిత్ షా. అమిత్ షాను కాదని మరొక వ్యక్తిని మోదీ దగ్గరకు రానీయడుని వేరేచెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే 2014 నుంచి పార్టీని నడిపింది వారిద్దరే. పార్టీ ఎన్నికల క్యాంపెయిన్ ను నడిపింది వారిద్దరే. ఎన్నిలయిపోయాక పార్టీ కార్యాలయానికి వెళ్లింది వారిద్దరే. అక్కడ విలేకరులతో మాట్లాడింది వారిద్దరే. మరొక నాయకుడికి వారిపక్కన చోటే లేదు. ఉండటం లేదు. ఎన్నికల ముందు చాలా సార్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేరు ప్రధాని పదవికి వినవచ్చినా, ఆయనను మోదీ దగ్గరకు రానీయడం లేదు. పార్టీ నాయకులతో మోదీ ఎపుడైనా కలిసి ఉంటే అక్కడ ఆయన పక్కన కనిపించేది అమిత్ షాయే. ఇపుడు ఆయనకు కేంద్రంలో అత్యంత కీలమకయిన హోంశాఖ ను అప్పగించారు. ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది. 2024 ఎన్నికల నాటికి మోదీ తన వారసుడిగా అమిత్ షాను తయారుచేస్తున్నట్లనిపిస్తుందని ఈ విశ్లేషకులు చెబుతున్నారు. అమిత్ షా చేరికతో క్యాబినెట్ లో ఆయనే నెంబర్ టూ అయినట్లేనని అంతా అనుకుంటున్నారు.
గురువారం జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలోనూ సీనియర్ నాయకుడు, పార్టీ మాజీ అధ్యక్షుడయిన రాజ్ నాథ్ సింగ్ ప్రధాని తర్వాత ప్రమాణం చేశారు. ఆ తర్వాత మూడో వ్యక్తి షాయే. నితిన్ గడ్కరీ నాలుగోస్థానంలోకి వచ్చారు. ఇది కూడా అమిత్ షా ప్రాముఖ్యం చెబుతుందని చాలా మంది అంటున్నారు.
ప్రధాని మోదీ, అమిత్ షా లమధ్య ఉన్న అనుబంధాన్ని గమనిస్తే, మోదీ మరొకరిని తన వారసుడిగా అంగీకరిస్తారని అనుకోలేం. అమిత్ షా కు ఎన్నికల వ్యూహరహస్యాలు బాగా తెలుసని మోదీకి బాగా తెలుసు. గత ఏడాది యుపి ఎన్నికల్లోబిజెపి అఖండవిజయం సాధించాక, అమిత్ షాయే ‘మ్యాన్ అఫ్ ది మ్యాచ్’ అని ప్రశంసించారు. మొన్న లోక్ సభ ఎన్నికల్లో విజయానికి పునాదులు వేసింది అమిత్ షా యే నని మోదీ బహిరంగంగా ప్రశంసించారు. మరొకెవరికీ ఆయన ఈ ఖ్యాతి ఇవ్వలేదు. ఇలాంటి ప్రశంసలందుకున్న మరొక నాయకుడు పార్టీలో లేనపుడు, అమిత్ షాను కాకుండా మరొకరిని ఆయన తన వారుసుడిగా ఎలాప్రకటిస్తారు?
వచ్చే ఎన్నికల నాటికి అమిత్ షా కేవలం పార్టీ నడిపినఅనుభవానికి పరిమితం చేయకుండా పరిపాలనానుభవంకూడా, అదికూడా కేంద్రంలో,ఉండేలా చూసేందుకు మోదీ ఆయనను క్యాబినెట్ లోకి తీుకున్నారని అంతా అనుకుంటున్నారు.
రాష్ట్రస్థాయిపాలనలో అమిత్ షా కుబాగా అనుభవం ఉంది.ఎందుకంటే, 2002లో గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ తిరిగి గెలిచినపుడు ప్రధాన పాత్ర పోషించింది అమిత్ షాయే.దీనికి ప్రతిఫలంగా మోదీ రాష్ట్ర క్యాబినెట్ లో దాదాపు పది శాఖలు కేటాయించారు.
ఈసారి లోక్ సభ ఎన్నికల్లో విజయానికి కానుకగా కేంద్రమంత్రి పదవి లభించింది. అందువల్ల ఇక మిగిలింది 2024 ఎన్నికల్లో గెలిచాక అమిత్ షాను తన వారసుడిగా ప్రకటించడమేనని రాజకీయ పండితులు చెబుతున్నారు.