ఆంధ్రప్రదేశ్ ముఖ్యంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పదవీ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో గవర్నర్ ఇఎస్ ఎల్ నరసింహన్ ఆయన చేత పదవీ స్వీకార ప్రమాణం చేయించారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, డిఎంకె అధ్యక్షుడు స్టాలిన్ కూడా హాజరయ్యారు.
ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేసిన అనంతరం మాట్లాడుతూ…
3648 కి.మీ ఈ నెల మీద నడిచినందుకు… ఆకాశమంతటి విజయాన్ని అందించినందుకు ప్రజలకు చేతులు జోడించి కృతజ్ఞత తెలుపుకుంటున్నానని ఆయన ప్రసంగం ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు ధన్యవాదాలు తెలిపారు, చెన్నై నుంచి వచ్చిన డిఎంకె అధినేత స్టాలిన్ తొందర్లో తమిళనాడు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్ష వెలిబుచ్చారు.
ఎన్నికల మానిఫెస్టో ఎపుడూ గుర్తుండేలా ప్రజల కష్టాలను తీర్చేందుకు రెండే రెండు పేజీలు తీసుకుకొచ్చాను. కారణం, కులానికొక పేజీ పెట్టి పేజీలతో మోసం చేయడానికి కాదు, నిజంగా అమలుచేయడానికి మ్యానిఫెస్టో. మ్యానిఫెస్టో అందరికి తెలిసి ఉండాలనే చిన్నగా చేశాను. అయిదు సంవత్సరాలలో ఏంచేస్తారో చూద్దాం అన్ని అన్ని విషయాలు గుర్తుండేలా చిన్న పుస్తకం తీసుకువచ్చి మీ కళ్ళముందుంచాను. ఇందులో చెప్పిన ప్రతి అంశాన్ని అమలు చేస్తాను, దాన్ని ఖురాన్ , బైబిల్, భగవద్గీత గా మారుస్తాను.
మ్యానిఫెస్టోను ముందుకు తీసుకువెళ్తాను.నవరత్నాలను అందరికి అందిస్తాను. ఇందులో ఒక రత్నం పెన్షన్…వేయిరుపాయలిచ్చి, నాలుగు సంత్సరాల పది నెలల దాకా తర్వాత దానిని రెండు వేలకు పెంచింది గత ప్రభుత్వం. మ్యానిఫెస్టో లో అవ్వతాతలకు ఇచ్చిన మాట ప్రకారం, పెన్షన్ పెంచుతూ మొట్టమొదటి సంతకం చేస్తున్నాను.
నవరత్నాలలో భాగంగా పెన్షన్ దశల వారీగా 3000 రూపాయలుగా ఇవ్వబోతున్నాము.
జూన్ నెల నుంచి రు. 2250 తో మొదలు పెడుతున్నాను. వచ్చే ఏడాది రు. 2500 కు ఆ పైనా రు. 2750 మూడో సంవత్సరం రు. 3000 వేలకు పెంచుతాం. ప్రతితాతకు, అవ్వకు మాట ఇచ్చాను, వితంతువులకు మాట ఇచ్చాను. ఆమేరకు మూడు వేలయ్యే దాకా పెంచుతూ పోతాను. వైఎస్ ఆర్ పెన్షన్ గా, వైఎస్ ఆర్ కానుకగా ఇది అందిస్తున్నాను.
ఇలాగే 4 లక్షల గ్రామ వాలంటీర్ ఉద్యోగాలు ప్రకటిస్తున్నాను.సంక్షేమ పథకాలను డోర్ డెలివరీ కోసం ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాలలో చదువుకుని సేవచేయాలని ఆరాటం ఉన్నవాళ్లని నెలకు రు. 5 వేలతో గ్రామ వాలంటీర్లుగా తీసుకుంటున్నాం.
ప్రజలకు అందించే పథకాలకు లంచాలకు వీలులేకుండా వాలంటీర్లకు రు.5 వేల జీతం ఇస్తున్నాం. వేరే ఉద్యోగం వచ్చే దాకావాళ్లు వలంటీర్ గా పని చేస్తారు. ఆగస్టు 15 కల్లా ఈ ఏర్పాటు పూర్తవుతుంది.
పథకాల మీద ఫిర్యాదు చేసేందుుకు ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫోన్ చేసి చెప్పేందుకు ఒక కాల్ సెంటర్ ఏర్పాటుచేస్తున్నాం. ఇదే విధంగా ఒక గ్రామ సచివాలయం తీసుకువస్తాం. ఇందులో ఉద్యోగాలు గ్రామస్థులకే, ఇది గాంధీ జయంతినాటికి అందుబాటులోకి వస్తాయి.
పథకాలలో సభ్యలుగా చేరానుకుంటే గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేస్తే సరి 72 గంటల్లో పరిష్కరిస్తాం.ఇందులో లంచాలకు, రికమెండేషన్లుకు తావులేకుండా చేస్తాం.
స్వచ్ఛమయిన పాలన, అవినీతి రహిత పాలన కోసం పై నుంచి కిందిదాకా ప్రక్షాళన చేస్తాను. అవినీతి ఎక్కడ జరిగిందో, ఏ కాంట్రాక్టులలో అవినీతి జరిగిందో , ఆ పనులను రద్దు చేస్తాం. ప్రి క్వాలిఫికేషన్ నియమాలను మార్పు చేస్తాం.
రివర్స్ టెండరింగ్ ప్రవేశపెడతాం. ఎక్కువ మంది టెండరింగ్ లో పాలు పంచుకునేలా చేస్తాం. ఈ విధానంలో ఎంత డబ్బు మిగులుతుందో ప్రజలందరి ముందు ఉంచుతాం.
పవర్ పర్చేస్ లో జరిగిన అక్రమాలను వెలికితెస్తాం. కరెంటు కొనుగోలు ధర తగ్గిస్తాం.
హైకోర్టు చీఫ్ జస్టిస్ ను కలసి సిటింగ్ జడ్జి తో ఒక కమిషన్ వేయించి, కాంట్రాక్టులను లొసుగులు లేకుండా చేసేందుకు నియమాలు రూపొందించిన తర్వాతే కాంట్రాక్టులను ప్రకటిస్తాం.
అరునెలల నుంచి ఒక సంవత్సరం టైం ఇవ్వండి. అవినీతిలో రాష్ట్రాన్ని ప్రక్షాళన చేస్తాను.
కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, రాజకీయాలు, పార్టీలను కూడా చూడం, అందరూ నావాళ్లే, అందరికి న్యాయం అందిస్తాను.