(ప్రశాంత్ రెడ్డి)
రాహుల్ గాంధీ రాజీనామా నిర్ణయం తో రాష్ట్ర,దేశ వ్యాప్తంగా పార్టీ ప్రక్షాళన అవుతుందని తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ రోజు గాంధీభవన్ లో విలేకరులతో ముచ్చటిస్తూ పార్టీ బలోపేతం కోసం రాహుల్ వ్యహాత్మకంగా ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారని, ఎవరిని నొప్పించకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా పార్టీ ప్రక్షాళన చేపట్టారని అన్నారు.
‘గాంధీ కుటుంబం లేకుండా కాంగ్రెస్ పార్టీ మనుగడ సాధ్యం కాదు. వారు ఉంటేనే పార్టీ సజీవంగా ఉంటుంది.గాంధీ కుటుంబం తోనే కాంగ్రెస్ పార్టీ నిలబ డుతుంది. గాంధీ కుటుంబాన్ని కుటుంబం గా కాదు ఒక వ్యవస్థ లాగా చూడాలి,’ అని ఆయన వ్యాఖ్యానించారు.
పీఎం కావాలనుకుంటే సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పదేళ్ల కిందటే అయ్యేవారు కానీ అలా చేయకుండా మన్మోహన్ సింగ్ ను ప్రధాని చేసిన విషయాన్ని అంతా గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు.
‘ పేద ప్రజల కోసం ఉపాధి హామీ పథకం ను తీసుకు వచ్చారు దాని వలన పేద ప్రజల అందరికి పని దొరికింది. జనాలు కష్ట పడి ఉపాధి సంపాదించే పథకం ను కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చింది. కుటుంబ పాలన అంటే నెహ్రు నుండి సోనియాగాంధీ వరకు కుటుంబం నుండి ఒక్కరే పాలన లో ఉన్నారు.. పదవి లో ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పనిచేసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే,’ అని జగ్గారెడ్డి అన్నారు.
‘కాంగ్రెస్ పార్టీ సీనియర్ ల సలహాలు సూచనలు తీసుకోవాలి. దానితో పాటు యువత కూడా పార్టీ కి అవసరమే. పార్టీ ప్రక్షాళన కు రాహుల్ గాంధీ ఆపరేషన్ స్టార్ట్ చేశారు ఎన్ ఎస్ యు ఐ, యూత్ కాంగ్రెస్ లో పనిచేస్తున్న యువకులను రాష్ట్ర కాంగ్రెస్ ప్రోత్సహిచంాలి, వారికి ఫ్రీడమ్ ఇవ్వాలి,’ అని జగ్గారెడ్డి అన్నారు.