(యనమల నాగిరెడ్డి)
అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అవసరాలు తీర్చడానికి తగినన్ని నీళ్లు ఉన్నాయని, కోస్తా ప్రాంతానికి కేటాయించిన నీటిని ఉపయోగించిన తర్వాత కూడా రాయలసీమ కనీస అవసరాలు తీర్చడానికి నీళ్లు అందుబాటులో ఉన్నాయని కె.సి.కెనాల్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ మాజీ చైర్మన్, రాయలసీమ ఉద్యమ నాయకుడు చంద్రమౌళీశ్వర రెడ్డి అభిప్రాయపడుతున్నారు. కృష్ణా డెల్టా స్థిరీకరణ కోసం గోదావరి జలాలను మళ్లించడం,పంట మార్పిడి విధానం అనుసరించడం, నీటి వినియోగంలో సాంకేతికతను ఉపయోగించడం లాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
ఇందుకోసం కోస్తా ప్రాంత నాయకులు “గతంలో పెద్దలు చేసుకున్న శ్రీభాగ్ ఒడంబడికను గుర్తు పెట్టుకోవడం, రాష్ట్రంలో రాయలసీమ కూడా భాగమేనని గుర్తించడం, కరువుసీమలో ఉన్న జనం బ్రతకడానికి తాగునీరు, కనీసం ఒక ఆరుతడి పంటకైనా సాగునీరు ఇవ్వాలని” విశాలహృదయంతో ఆలోచించాల్సి ఉంటుందని అన్నారు. అలాగే ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో ప్రణాళికలు రచించి, తనకు బచావత్ ట్రిబ్యునల్ కట్టపెట్టిన అధికారాన్ని ఉపయోగించి వాటిని అమలు చేయాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
గతంలో బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 811 టిఎంసిల నీటిని కేటాయించిందని ఆయన వివరించారు. ప్రస్తుత రాష్ట్ర విభజన తర్వాత కృష్ణ్ణ యాజమాన్య బోర్డు ఈ నీటిని తాత్కాలికంగా ఆంధ్ర రాష్ట్రానికి 512 టీఎంసీలు, తెలంగాణాకు 298 టీఎంసీలు కేటాయిస్తూ నిర్ణయించిందని ఆయన అన్నారు. మన రాష్ట్రానికి కేటాయించిన 511 టిఎంసిలలో గతంలో ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాల మేరకు రాయలసీమకు 133 టీఎంసీలు, 378 టిఎంసిల నీరు కోస్తా వాటాగా కేటాయించారని అన్నారు. గతంలో ట్రిబ్యునల్ లెక్కల ప్రకారం ఒక టిఎంసికి 6500 ఎకరాలు సాగవుతుంది. ఈ లెక్క ప్రకారం సాగర్ కుడి ఎడమ కాల్వలు, కృష్ణ బేసిన్ లలో 26 లక్షల ఎకరాలకు ఇప్పటి వరకు సాగు నీరు అందుతుంది. అప్పట్లో ఆరు నెలలకు ఒక పంట లెక్కన నీటి కేటాయింపులు జరిపారని ఆయన గుర్తు చేశారు.
అయితే ప్రస్తుతం 4 నెలలకు మారిన పంట కాలం, నీటి నిర్వహణలో వచ్చిన వినూత్న మార్పుల వల్ల ఆదా అవుతున్న నీటిని సీమ అవసరాలకు కేటాయించవచ్చునని చంద్రమౌళి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఒక టిఎంసితో 10 వేల ఎకరాలు సాగవుతున్నదని, అందువల్ల కోస్తాలో ఉన్న 26 లక్షల ఆయకట్టుకు 260 టిఎంసిల నీరు సరిపోతుందన్నారు.
రాష్ట్రానికి కేటాయించిన నీటిని రాష్ట్రం తన అవసరాలకు అనువుగా కేటాయించి వాడుకోవచ్చునని బచావత్ ట్రిబ్యునల్ తన తుది తీర్పులో రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం కట్టపెట్టిందని ఆయన గుర్తు చేశారు. అందువల్ల ప్రస్తుతం మిగిలించగలిగిన 118 టిఎంసిల నీటిని సీమలో నిర్మాణంలో ఉన్న వెలిగొండ, గాలేరు-నగిరి, హంద్రీ-నీవాలకు, తెలుగుగంగ అవసరాలకు, సీమ ప్రజల తాగునీటి అవసరాలకు నికర జలాలు కేటాయించడానికి ప్రభుత్వానికి అవకాశం ఉందన్నారు. కోస్తా ప్రాంతంలో ఆయకట్టు స్థిరీకరణకు పోలవరం,పట్టిసీమల ద్వారా వచ్చే గోదావరి జలాలను ఉపయోగించాలని ఆయన సూచించారు. ఈ చర్యలు చేపడితే సీమ కరువును శాశ్వత ప్రాతిపదికన తీర్చడానికి నికర జలాలు కేటాయించడానికి అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
దుమ్ముగూడెం-సాగర్ టైల్ పాండ్ ప్రాజెక్ట్ చేపట్టాలి.
రాజశేఖర్ రెడ్డి కాలంలో రాయలసీమ నీటి అవసరాలు తీర్చడానికి “గోదావరి నుండి కృష్టాబేసిన్ కు నీటిని తరలించడానికి దుమ్ముగూడెం- నాగార్జున సాగర్ టైల్ పాండ్” ప్రాజెక్టును ప్రారంభించారు. వై.ఎస్ హయాంలో ఈ ప్రాజెక్ట్ కు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని సాధారణ అనుమతులు మంజూరు చేయడం, 550 కోట్ల వరకు ఖర్చు చేశారు. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్ ముఖ్యమంత్రులు రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ఈ ప్రాజెక్టును పూర్తిగా పక్కన పెట్టారు.
రాష్ట్ర విభజన సమయంలో “రెండు రాష్ట్రాలలో నిర్మాణంలో ఉన్న అన్ని నీటి పారుదల ప్రాజెక్ట్ లను పూర్తి చేస్తామని, ఈ ప్రాజెక్ట్ ల నిర్మాణాన్ని ఏ ప్రభుత్వం అడ్డుకోరాదని” అప్పటి కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించింది. అయితే రాష్ట్ర విభజన తర్వాత దుమ్ముగూడెం -నాగార్జున సాగర్ టైల్ పాండ్ ప్రాజెక్టును చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టింది. సీమ ప్రాజెక్ట్ లను గురించి, సీమ నీటి అవసరాల గురించి కనీసం బాబుగారు పట్టించుకోక పోగా కల్లబొల్లి ప్రకటనలతోను, పులివెందులకు, కుప్పంకు నీళ్లిస్తే (అనధికార మిగులు జలాన్ని) రాయలసీమ మొత్తాన్ని సస్యశ్యామలం చేసినట్లని అభిప్రాయపడ్డారు. ఆమేరకు పని చేసి మిగిలిన ప్రాంతాలను విస్మరించారు.
నూతన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ ప్రాజెక్ట్ ప్రతిపాదనను తెలంగాణా ప్రభుత్వ సహకారంతో తెరపైకి తెచ్చి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పూర్తి చేస్తే, శ్రీశైలం నీళ్లు పూర్తిగా రాయలసీమకు మళ్లించి సీమలో కరువును శాశ్వతంగా నివారించ వచ్చునని చంద్రమౌళి సూచించారు.
కోస్తా ఆయకట్టును స్థిరీకరించడానికి గోదావరి నీళ్లను, కృష్ణకు మళ్లించడం, ఆధునికి సాగు పద్ధతులు చేపట్టి నీటిని మరింతగా పొదుపు చేసుకోవడం, పంట కాలం తగ్గడం వల్ల మిగులుతున్న నీటిని సీమ ప్రాజెక్టలకు కేటాయించడం, చేయాలని ఆయన కోరారు. ప్రభుత్వం సీమ దాహార్తిని తీర్చడానికి చేపట్టే ఇలాంటి ప్రయత్నాలకు కోస్తా నాయకులు “శ్రీబాగ్ ఒడంబడికను” గుర్తు చేసుకొని, మానవత్వంతో సహకరిస్తే సీమ నుండి కరువును పూర్తిగా పారదోలవచ్చునని, ప్రజలు బ్రతకడానికి అవకాశం కలుగుతుందని చంద్రమౌళీశ్వర రెడ్డి ఆశిస్తున్నారు.