(యనమల నాగిరెడ్డి)
రాయలసీమ ప్రజల చిరకాల కోరిక సిద్ధేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం. 1950 లో ప్రతిపాదనలకు నోచుకోని, పాలనాపరమైన అనుమతులు సాధించి, “సిడబ్లుసి” ఆమోదం పొంది ఆచరణకు నోచుకోని ప్రాజెక్ట్ సిద్దేశ్వరం. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని ప్రజలు ఎన్నో కలలు కన్నారు. అయితే సీమ ప్రజా ప్రతినిధుల అధికార దాహం, దాయాది ప్రాంతాల చాకచక్యము కలసి సీమ వాసుల కొంప ముంచింది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు తర్వాత శ్రీశైలం ప్రాజెక్టును నిర్మించడంతో సిద్దేశ్వరం ఈ ప్రాంత వాసులకు ఎన్నటికీ కూడా తీరని కలగా మిగిలింది.
ఈ నేపథ్యంలో సీనియర్ ఇంజనీర్ , నీటి పారుదల రంగ నిపుణుడు కర్నూలుకు చెందిన సుబ్బరాయుడు సిద్దేశ్వరం అలుగు నిర్మాణం చేపడితే ఈ ప్రాంత ప్రజల త్రాగునీటి అవసరాలు, కొంత మేరకు వ్యవసాయ అవసరాలు తీర్చవచ్చు నని ‘సిద్ధేశ్వరం అలుగు’ నిర్మాణం ప్రతిపాదనను తెచ్చారు. ఈ ప్రతిపాదనను దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర రెడ్డికి అందచేయడం, ఆయన ఈ ప్రతిపాదన పట్ల సానుకూలంగా స్పందించడం జరిగింది. ఐతే వై.ఎస్. అకాల మరణంతో ఈ ప్రతిపాదన మరోసారి మూలన పడింది. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు నిర్మాణంలో ఉన్న రాయలసీమ నీటిపారుదల ప్రాజెక్ట్ లను కట్ట కట్టి మూలన పడవేయడం, రాష్ట్ర విభజన జరగడం, అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సీమ ప్రాజెక్ట్ లపై కపట ప్రేమ చూపి మాటలు, లెక్కల గారడీలతో జనాన్ని మోసం చేయడానికే ప్రాధాన్యం ఇవ్వడం, ప్రతిపక్షనేతగా జగన్ విఫలం కావడం లాంటి కారణాల వల్ల సీమ నీటి ప్రాజెక్ట్ ల తో పాటు సిద్దేశ్వరం ప్రతిపాదన కూడా చెత్తబుట్ట పాలైంది.
ఐతే గత నాలుగు సంవత్సరాలుగా రాయలసీమ నీటి అవసరాలకోసం పోరాడుతున్న రాయలసీమ సాగునీటి సమితి అధ్యక్షుడు బొజ్జా దశరధ రామిరెడ్డి 2016 మే 31న సిద్ధేశ్వరం అలుగు ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ప్రజావాహిని అండగా శంఖుస్థాపన చేశారు. అంతకు ముందు సుమారు 9 నెలల నుండి ఆయన కర్నూలు జిల్లా తో పాటు, మిగిలిన మూడు జిల్లాలలో పర్యటించి మే 31న సిద్దేశ్వరం అలుగు ప్రాజెక్ట్ కు శంఖుస్థాపన చేస్తామని ప్రకటిస్తూ విస్తృతంగా గ్రామాలలో పర్యటించారు. చివరివరకు పట్టించుకోని ప్రభుత్వం, అధికారులు చివరి 3 రోజులు ఉద్యమకారులపై తీవ్ర నిర్బంధం విధించారు. సిద్ధేశ్వరం వెళ్లే త్రోవలన్నీ దిగ్బంధించారు. రోడ్లలో పెద్ద ఎత్తున గుంతలు త్రవ్వారు. ప్రజలను ఎక్కడికక్కడ నిర్బంధించారు. 30 వ తేదీ రాత్రి రాయలసీమ ఉద్యమంలో ఎన్నో ఏళ్లుగా ఉన్న ఒక సీనియర్ నాయకుడిని అదుపులోకి తీసుకొని ఆయనను అరెస్ట్ చేశారని ఆయన చేతనే టీవీలలో ప్రకటనలు ఇప్పించారు. ప్రభుత్వం పోలీసుల సహకారంతో ఇన్ని అడ్డంకులు కల్పించినా ఈ శంఖుస్థాపన కార్యక్రమానికి రాయలసీమ నాలుగు చెరుగులతో పాటు, హెదరాబాద్, బెంగళూరు ప్రాంతాలనుండి కూడా సీమ మద్దతుదారులు తరలి వచ్చారు. సుమారు 40 వేల మంది పాల్గొన్న ఈ కార్యక్రమంలో శంఖుస్థాపన విజయవంతంగా పూర్తయింది.
అప్పటి నుండి ఈ ప్రతిపాదనపై ప్రభుత్వానికి ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో రాయలసీమ వ్యాప్తంగా సీమ కోసం పని చేస్తున్న ప్రజాసంఘాలను సమన్వయము చేయడానికి కడప వేదికగా రాయలసీమ కార్మిక కర్షక సంఘం చేసిన కృషి ఫలించి సుమారు 50 సంఘాలతో దశరధరామిరెడ్డి కన్వీనరుగా రాయలసీమ ప్రజాసంఘాల సమన్వయ వేదిక ఏర్పాటైంది. ఈ వేదిక ఆధ్వర్యంలో 2018 మే 31న శంఖుస్థాపన ద్వితీయ వార్షికోత్సవం నిర్వహించిన “రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక” మరోసారి ఈ నెల 31న సిద్ధేశ్వరం శంఖుస్థాపన 3 వ వార్షికోత్సవం నిర్వహించనుంది.
ఈ సారి గతం కంటే భిన్నంగా నంద్యాల నుండి సిద్దేశ్వరం వరకు 100 కిలోమీటర్ల మేర నాలుగు రోజుల పాటు పాదయాత్ర నిర్వహించి తృతీయ శంఖుస్థాపన వార్షికోత్సవం నిర్వహించడానికి ఈ వేదిక ఏర్పాట్లు చేసింది. మంగళవారం ఉదయం 8 గంటలకు నంద్యాలలో ప్రారంభమయ్యే ఈ యాత్ర అనేక గ్రామాల మీదుగా 31 వ తేదీ 11 గంటలకు సిద్దేశ్వరం చేరుకుంటుంది. ఈ యాత్రలో రాయలసీమ నాలుగు జిల్లాల నుండి పలువురు పాల్గొంటున్నారని, ప్రజలు విరివిగా పాల్గొని సీమ ప్రజల ఆకాంక్షను ప్రపంచానికి ఎలుగెత్తి చాటాలని దశరధ రామిరెడ్డి సీమ ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు.
సిద్దేశ్వరం అలుగు నిర్మాణం వల్ల సుమారు 69 టిఎంసిల నీళ్లు నిలువ ఉంటాయని, కరువు కాలంలో ప్రజలను ఆ నీరు ఆదుకోగలవని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు దీనిపై దృష్టి పెట్టాలని ఆయన కోరారు.
70 సంవత్సరాల కాలంలో పాలకులు, నాయకులు సీమ కోసం అనేక మాయ వాగ్దానాలు చేసి అనేక కంటి తుడుపు చర్యలు చేపట్టినా అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. గతంలో టీడీపీ అధినేత స్వర్గీయ రామారావు ప్రారంభించిన గాలేరు-నగిరి, హంద్రీ-నీవా, వెలుగొండ,తెలుగు గంగ లాంటి ప్రాజెక్ట్ లు, ఆతర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం (1989-94) చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం (1996-2004)అసలు పట్టించుకోలేదు. 2004-2009 మధ్య అధికారం చేపట్టిన వై.ఎస్ రాజశేఖర రెడ్డి ఈ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి కృషి చేసి సుమారు 70-90 శాతం వరకు పూర్తి చేశారు. రాజశేఖర్ రెడ్డి ఆకస్మిక మరణంతో ఆ తర్వాత 2009-14 లో పదవులు చేప్పట్టిన రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాలు, 2014-2019 లో అధికారంలో ఉన్న చంద్రబాబు కాలంలో సీమ నీటి ప్రాజెక్ట్ లకు పూర్తిగా గ్రహణం పట్టింది. చంద్రబాబు కోస్తాపై చూపిన ప్రేమలో వెయ్యో వంతు కూడా సీమ ప్రాజెక్టులపై శ్రద్ద చూపక పోగా సీమ నీటి పారుదల రంగం పై పూర్తిగా శీతకన్ను వేశారు. సీమ వాసుల కొంప ముంచారు.
ఈ నేపథ్యంలో వై.ఎస్ వారసుడిగా 2019 ఎన్నికలలో అఖండ విజయం సాధించిన జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని, నిర్మాణంలో ఉన్న అన్ని నీటి ప్రాజెక్ట్ లను పూర్తి చేసి, వాటికి చట్టబద్దమైన నీటి కేటాయింపులు చేయాలని దశరధ విజ్ఞప్తి చేస్తున్నారు.
నాయకుల చేతకాని తనానికి బలై గత 70 సంవత్సరాలుగా అన్ని రంగాలలో వెనుక పడిన ఈ కరువు సీమ పై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని, గతంలో రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రం కరువు ప్రాంతాలకు ప్రకటించిన హామీలను అమలు చేయించి సీమను ఆదుకోవాలని ఉద్యమకారులు కోరుతున్నారు.