ఎమ్మెల్యేలను, ఎంపిలను కొనుగోలు చేసి చంద్రబాబు ఎలా పతనమయ్యారో వైసిపి అధినేత, కాబోయే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వివరించారు. ఈ రోజు ఆయనను వైసిపి ఎల్ పి సమావేశంలో శాసనసభాపక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఆయన సభ్యులనుద్దేశించి ప్రసంగించారు. అపుడు మాట్లాడుతూ ఎమ్మెల్యేల, ఎంపిలను కొనుగోలు చేసిన విషయం మీద వ్యాఖ్యానించారు.
చంద్రబాబు నాయుడు గత ఏడాది మే నెలలో కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలు 23 మంది. ఆయను కొనుగోలు చేసిన ఎంపిలు ముగ్గురు. సరిగ్గా ఏడాదికిందట ఇది జరిగింది. ఇపుడు అదే 23న ప్రజలు ఆయనకు ఇచ్చింది 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపిలను. ప్రజలు, దేవుడు ఇలా చంద్రబాబు నాయుడిని శిక్షించారు,’ అన్నారు.
2014 ఎన్నికల్లో వైసిపి కేవలం ఒక్క శాతం ఓట్లతో అధికారానికి దూరమయింది. అయితే, చంద్రబాబు పాలనతో ప్రజలు విసిగెత్తిపోయారు. ఆయన అధికారాన్ని దుర్వినియోగం చేశారు. అందుకే ప్రజలుఅద్భుతమయిన తీర్పు ఇచ్చారు. 175 స్థానాలలో 151 స్థానాలు వైసిపి ఇచ్చారు. 25 ఎంపిలలో 22 ను గెలిపించారు. ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ విజయం. అధికార దుర్వినియోగానికి పాల్పడితే ప్రజలు ఎలా మొట్టికాయలు వేస్తారో చంద్రబాబు పరాజయమే సాక్ష్యం… అని జగన్ అన్నారు.
సమావేశంలో జగన్ చాలా హుందాగా మాట్లాడారు. గెలిచామన్న ఆవేశానికి లోనై చప్పట్ల కోసం మాట్లాడలేదు. చాలా గొప్పగా, బాధ్యతాయుతంగా మాట్లాడారని చాలా మంది ఎమ్మెల్యేలు చెప్పారు.