రాజశేఖర్‌రెడ్డి చనిపోయిన తొలినాళ్ళలో ముఖ్యమంత్రి పదవి చేపట్టటానికి జగన్ తీవ్రంగా ప్రయత్నాలు చేయటం, దానిని అధిష్టానం తిరస్కరించటంఅందరికీ తెలిసిందే. ఆ సమయంలో, అధిష్టానంతో ఘర్షణపై తొలిసారి మీడియా ముందు స్పందించినపుడు జగన్ ఒక వ్యాఖ్య చేశారు. తన తండ్రి గెలిపించిన ప్రభుత్వంలో తన తండ్రి నిర్వహించిన పదవిని ఆయన తర్వాత తాను వారసుడిగా నిర్వహించాలనుకోవటం తప్పా అని జగన్ అడిగారు.
2019
ఎన్నికలలో తన పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టిన తర్వాత మొట్టమొదటిగా సాక్షి టీవీ ఛానల్‌లో విజయంపై జగన్, ఆయన కుటుంబసభ్యుల స్పందనను ప్రసారం చేశారు. ఈ సందర్భంగా సాక్షి ప్రతినిధి స్వప్న మాట్లాడుతూ, ఎవరూ ఊహించిన ఇంతటి అఖండ విజయంపై మీకు ఎలా అనిపిస్తోంది అని విజయమ్మను అడిగారు. ఇది తాను ముందే ఊహించానని, ప్రత్యర్థులకు ప్రతిపక్షహోదాకూడా దక్కగూడదని తాను దేముడిని ప్రార్థించానని విజయమ్మ అన్నారు. ఆమె మాటలకు జగన్ పక్కున నవ్వుతూ తన తల్లి భుజం తట్టి అలా చెప్పకూడదంటూ వారించారు.
అవును. జగన్‌లో పదేళ్ళలో ఎంతో మార్పు వచ్చింది. ముఖ్యంగా ఫలితాలు వెలువడిన తర్వాత మీడియాతో మాట్లాడేటప్పుడు ఏమాత్రం ఉద్వేగం, ఉద్రేకం ప్రదర్శించకుండా అణుకువతో , ఒద్దికతో మాట్లాడటం అతని విమర్శకులను సైతం ఆశ్చర్యపరిచింది. దీనికంటే మించి అతను చెప్పిన ఒక మాట అతనిలో ఏర్పడిన అద్భుతమైన పరిణతిని తెలియజెప్పింది. రాష్ట్రంలో 5 కోట్లమంది ప్రజలు ఉంటే ఒక్కరికే ఈ అరుదైన అవకాశం వస్తుందని, దానిని దేముడు తనకు ఇచ్చాడని జగన్ చేసిన వ్యాఖ్య, ఇంతటి అపూర్వ విజయంలోకూడా అతను ఒదిగి ఉండటాన్ని తెలుపుతోంది. సిసలైన సనాతన god-fearing క్రైస్తవుడిలా అంతా దేముడి దయ అనికూడా జగన్ చెప్పారు.
పదేళ్ళక్రితం జగన్ ఇలా ఉండేవారు కాదు. రాయలసీమలో ఇప్పటికీ పలు చోట్ల కనిపించే సిసలైన ఫ్యూడల్ వ్యవస్థకు ప్రతీకగా నాడు కనిపించేవారు. అసలు సమరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి వంటి పాత్రలు పోషించిన ఊర మాస్ హీరో బాలయ్యకు అభిమాని అంటేనే జగన్ అభిరుచి ఎలాఉండేదో తెలుసుకోవచ్చు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అఖండ విజయం సాధించిన తదనంతర కాలంలో, బాబాయి వివేకానందరెడ్డిని ఎంపీ పదవికి రాజీనామా చేయించి తాను కడప లోక్‌సభనుంచి పార్లమెంటుకు వెళ్ళాలని ఉవ్విళ్ళూరారని, బాబాయిపై ఒత్తిడి తెచ్చారని కూడా జగన్ దూకుడుపై పలు కథనాలు వెలువడ్డాయి. జగన్ ఒత్తిడి తట్టుకోలేక వివేకా నాడు సోనియాకు నేరుగా రాజీనామాలేఖ ఇవ్వటం, ఆమె వైఎస్‌ను పిలిచి మందలించటంకూడా అన్ని ప్రసారసాధనాలలో వార్తలు వచ్చాయి. ఇక వ్యాపారంలోకూడా తన తండ్రి గద్దెనెక్కిననాటినుంచి జగన్ చెలరేగిపోయారు. ఆడిటర్ విజయసాయిరెడ్డి మార్గదర్శకత్వంలో ఆయన సంపాదన బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా దూసుకుపోవటం గురించి ప్రస్తావిస్తే అది వేరే సబ్జెక్ట్‌లోకి వెళ్ళినట్లవుతుంది కాబట్టి దానిని వదిలేద్దాం.
తండ్రి మరణం తర్వాత ముఖ్యమంత్రి పదవికోసం ప్రయత్నించి భంగపడ్డ జగన్ కాంగ్రెస్ హైకమాండ్‌పై రగిలిపోయేవారు. పార్టీ వరసగా 2004లో, 2009లో రెండుసార్లు విజయం సాధించటం తన తండ్రి వల్లేనని, కాబట్టి వారసుడిగా తనకే ముఖ్యమంత్రి పదవి దక్కాలనే భావనలో ఉండేవారు. వైఎస్ పాత్రను ఎవరూ కాదనలేరుగానీ, కాంగ్రెస్ అనే ఒక బలమైన వేదిక ఉంటేనే అది సాధ్యమయిందని, ఫ్యూడల్ వ్యవస్థలోలాగా తండ్రి పదవి కొడుకుకు వారసత్వంలాగా సంక్రమించదన్న కనీస పరిజ్ఞానం కూడా జగన్‌కు నాడు లేదు. తన తండ్రి పదవి తనకే దక్కాలన్న ఆ వ్యాఖ్యలపై నాడు పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
కట్ చేస్తే, పదేళ్ళ తర్వాత అదే జగన్ వ్యక్తిత్వం టర్న్ ఎరౌండ్ అయినట్లు స్పష్టంగా కనబడుతోంది. ఈ పరివర్తనకు కారణం దాదాపు సంవత్సరమున్నరపాటు చేసిన పాదయాత్ర అనటంలో ఎలాంటి సందేహం లేదు. నిత్యం ప్రజలలో ఉంటూ, క్షేత్రస్థాయిలో వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటుండటంతో జగన్‌కు వాస్తవం ఏమిటో అర్థమయింది. పరిస్థితులను బాగా ఆకళింపు చేసుకున్నారు. మరోవైపు జగన్ ప్రత్యర్థులు ఇద్దరిలో – ఒకరేమో అధికార మైకం పూర్తిగా తలకెక్కి అంతా తానే అంటూ మెగలోమేనియాక్ లాగా ప్రవర్తిస్తూ, మరొకరేమో తనకున్న కరిష్మా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడుతుందంటూ తప్పుడు లెక్కలు వేసుకుంటూ… ఇద్దరూ వాస్తవానికి దూరమై ఊహల్లో తేలుతుంటే, జగన్ మాత్రం వాస్తవానికి దగ్గరలో ఉంటూ ప్రజలకు చేరువగా నడిచారు. పాదయాత్రలో దగ్గరకు వచ్చినవారందరినీ విసుక్కోకుండా చక్కగా పలకరించటం, సెల్ఫీలంటూ దగ్గరకు వచ్చిన ఆడపిల్లలు, మగపిల్లలతో చక్కగా నవ్వుతూ ఫోటోలు దిగటం జగన్‌ను బాగా దగ్గరకు చేసింది. ఇలా జనంలో మమేకం కావటమే అతనిలో మార్పుకు దారితీసినట్లుగా కనబడుతోంది.
ఒక మంచి పాలన ఇవ్వటానికి ప్రయత్నిస్తానని జగన్ హృదయపూర్వకంగా చెప్పటం శుభ పరిణామం. కానీ ఈ సంకల్పం, చిత్తశుద్ధి తుదిదాకా కొనసాగించటం ఆషామాషీయేం కాదు. జగన్ సంకల్పం నిలబెట్టుకోవాలని ఆశిద్దాం. ముఖ్యంగా ఆయన తన మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటే రెండు మూడు బడ్జెట్ల నిధులు కావాలని అప్పుడే విమర్శలు వచ్చాయి. మరి ఆ నవరత్నాలను ఎలా ఇస్తారో వేచి చూడాలి.
జగన్ గతంలో చేసిన ఒక మంచి పనిని కూడా ఇక్కడ ప్రస్తావించుకోవాలి. టీడీపీనుంచి తనపార్టీలోకి వస్తానన్నవారిని రాజీనామా చేసి రమ్మని అడిగారు. ఇప్పుడు కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ప్రతిపక్షాన్ని అలాగే బతకనిస్తారని ఆశిద్దాం. తమిళనాడులోలాగా అధికార, ప్రతిపక్షాలు అంటే బద్ధవైరులు అన్నట్లు పరస్పరం ద్వేషించటం కాకుండా హుందాగా ప్రవర్తిస్తే బాగుంటుంది. సోషల్ మీడియాలో టీడీపీ, జనసేనలతోబాటు వైసీపీ వారు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అలాంటి చౌకబారు విమర్శలకు, ఆరోపణలకు ఇకనైనా స్వస్తి చెప్పేటట్లుగా జగన్ చర్యలు తీసుకోవాలి. తెలుగుదేశంవారు గతంలో తనపై చేసిన వ్యాఖ్యలను, వేధింపులను మనసులో పెట్టుకోకుండా పెద్దమనసుతో క్షమించి ప్రతిపక్షం సహకారాన్నికూడా తీసుకుని రాష్ట్రాన్ని ప్రగతిపథాన నడిపిస్తే అందరికీ బాగుంటుంది!
(*శ్రవణ్ బాబు, సీనియర్ జర్నలిస్టు, హైదరాబాద్, ఫోన్ నెం.9948293346)
Wonderful article.