(శ్రవణ్ బాబు దాసరి*)
ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ, అధికారంకోసం ఎంతకైనా దిగజారే తెంపరితనంతో నియంతృత్వందిశగా వెళుతున్న మోదికి ఇంతటి ఘన విజయం లభించటం అగ్నికి ఆజ్యం తోడవటం లాంటిదే. ఇది దేశానికి ఏమాత్రమూ శుభ పరిణామం కాదు. మోది గ్యాంగ్ బుట్టలో పడిపోయిన అమాయక ప్రజలు… ముఖ్యంగా ఉత్తరభారత వాసులు కమలానికి తిరుగులేని మ్యాండేట్ ఇచ్చారు. కమలనాధులు రెచ్చగొట్టిన జాతీయవాదం, దేశభక్తి నినాదాల హోరులో ప్రజలు కొట్టుకుపోయారు. మరోవైపు, పప్పూగా సామాజిక మాధ్యమాల్లో పేరుగాంచిన రాగా కూడా తన వంతుగా మోదికి ఎంతో సాయం చేశారు. తాను మునగటమే కాకుండా దేశ ప్రజలను నిట్టనిలువునా ముంచేశారు. కాంగ్రెస్ చేసిన తప్పులు కలిసిరావటంతోనే ఇవాళ ఎన్డీయేకు ఈ ఘన విజయం లభించిదనటంలో ఎలాంటి సందేహమూ లేదు. ముఖ్యంగా ప్రతిపక్షాల పొత్తుల విషయంలో రాహుల్ వ్యవహరించిన తీరు కారణంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి అనేక రాష్ట్రాల్లో బీజేపీకి విజయాలు చేకూర్చిపెట్టింది.
1997లో ఇంటినుంచి కాలు బయటపెట్టి కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన సోనియా గాంధి, 2004 నాటికి పార్టీని విజయపథం పట్టించగలిగిందంటే దానికి కారణం ఆమె విపక్షాలనన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి యూపీఏ అనే కూటమిని ఏర్పాటు చేయటమే. ఆ కూటమి నిరాటంకంగా పదేళ్ళు దేశాన్ని పాలించిన విషయం తెలిసిందే. అంతెందుకు, మూడేళ్ళనాడు, 2016లో బీహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో కూడా బీజేపీని ఓడించటంకోసం జేడీయూ, ఆర్జేడీలతో కలిపి రాహుల్ గాంధి ఒక చక్కటి కూటమిని సెట్ చేసి మోదికి పెద్ద ఝలక్ ఇచ్చారు. అయితే ఈ లోక్ సభ ఎన్నికల విషయంలోమాత్రం పొత్తులపై ఆయన అవలంబించిన వైఖరి దేశానికి తీవ్రనష్టం కలగజేసింది.
ఢిల్లీలో ఆప్ పార్టీతో, యూపీ, మధ్యప్రదేశ్‌లలో బీఎస్పీ, ఎస్పీలతో, పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్‌తో, మహారాష్ట్రలో ఎన్సీపీతో పొత్తులకు అవకాశం ఉన్నప్పటికీ, రాహుల్ ప్రదర్శించిన మొండి వైఖరి కారణంగా పొత్తులు కుదరక ఆయా ప్రాంతాలలో బీజేపీ వ్యతిరేక ఓటు చీలిపోయింది. ప్రతిపక్షాలది ఎవరిదారి వారిదే అన్నట్లుగా అయిపోయింది. ప్రతిపక్షంలోని వివిధ పార్టీల నాయకులను సమన్వయపరచి పెద్దన్న పాత్ర పోషించాల్సిన కాంగ్రెస్ పార్టీయే ఇలా వ్యవహరించటం బీజేపీకి ప్లస్ అయింది. అలా కాకుండా, మోదిని గద్దె దించటం అనే ఏకైక లక్ష్యంతో ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపై నిలబడితే బీజేపీకి ఖచ్చితంగా అడ్డుకట్ట పడేది. అయితే అంతటి దూరదృష్టి, రాజనీతిజ్ఞత, పరిణతి రాహుల్‌కు లేకపోవటం ఈ అనర్థానికి దారితీసింది. కాంగ్రెస్ తో పొత్తుకోసం ఢిల్లీలో కేజ్రీవాల్, మహారాష్ట్రలో శరద్ పవార్ తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ రాహుల్ సానుకూలంగా స్పందించలేదు. ఇక ప్రతిపక్షంలోని ఇతర పార్టీల నేతల్లోకూడా పెద్దన్న పాత్ర పోషించగలిగే స్థాయి ఉన్న ములాయం, మాయావతి మమత, పవార్, ఫరూక్ వంటివారు ఉన్నప్పటికీ, ఎవరికి వారు తాము ప్రధానమంత్రులం అవ్వాలనే కోరికతో ఉండటంతో ఈ సయోధ్యకు నిస్వార్థంగా ముందుకు రాలేకపోయారు.
పొత్తుల విషయంలో రాహుల్ వైఖరికి కారణం ఆయన చుట్టూ ఉన్న వృద్ధ జంబూకాలు అనే వాదనకూడా వినిపిస్తోంది. ఉత్సాహం, ఆశ ఉడిగిపోయిన ఆ సీనియర్ నేతల సలహాలు పాటించటంవలనే ఈ పరిస్థితి దాపురించిందని అంటున్నారు. పార్టీ అధ్యక్షపదవి చేపట్టిన తర్వాతగానీ, ఆ మధ్య కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాలలో మంచి ఫలితాలు సాధించిన తర్వాతైనాగానీ అయినా రాహుల్ పార్టీపై పట్టు సాధిస్తారని, కొత్త రక్తాన్ని తీసుకొస్తారని ఆశించినవారికి నిరాశే ఎదురయింది. సచిన్ పైలట్, మిలింద్ దేవరా, జ్యోతిరాదిత్య వంటి యువకులకు సీడబ్ల్యూసీలో స్థానం కల్పించి ఉంటే పార్టీకి కొత్త జవసత్వాలు వచ్చేవి. అలా కాకుండా దిగ్విజయ్ సింగ్, గులాంనబీ అజాద్, అహ్మద్ పటేల్ వంటి సీనియర్లనే పట్టుకుని వేళ్ళాడారు.
న్యాయ్ అనే అత్యంత ఆకర్షణీయమైన పథకాన్ని ప్రవేశపెట్టినా ఉపయోగం లేకుండా పోయింది. పార్టీకి క్షేత్రస్థాయిలో బలమైన యంత్రాంగం లేకపోవటం కూడా మరొక కారణంగా చెప్పుకోవాలి. మరోవైపు, నాడు తన తండ్రి ఎన్నికల్లో ఓడిపోవటానికి కారణమైన బోఫోర్స్ కుంభకోణంలాగా నేడు రఫేల్ కుంభకోణం తనకు లాభిస్తుందని రాహుల్ కలలు కన్నారు. చౌకీదార్ చోర్ హై అనే నినాదం ఓట్లు గుమ్మరిస్తుందని ఆశపడ్డారు. అందుకే పొత్తులను నిర్లక్ష్యం చేశారు. అదే కొంప ముంచింది. అందుకే 55 సీట్లతో సరిపెట్టుకోవాల్సివచ్చింది. ముఖ్యంగా హిందీ మాట్లాడే రాష్ట్రాలలో పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. కొద్దో, గొప్పో దక్షిణాదే కాంగ్రెస్ గౌరవాన్ని కాపాడింది. మరోవైపు ఆరునెలల క్రితమే అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన రాజస్థాన్, ఛత్తీస్ గడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో, అంతకుముందు ఎన్నికలు జరిగిన కర్ణాటకలో కాంగ్రెస్ మట్టికరవటం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనికి కారణం ఆయా రాష్ట్రాలలో ఉన్న సానుకూలతలను కూడా కాంగ్రెస్ పార్టీ సద్వినియోగం చేసుకోలేకపోవటమే. ముఖ్యంగా ఈ రాష్ట్రాలలో, అధికారంలోకి వచ్చిన పదిరోజుల్లో రైతుల రుణాలను మాఫీచేస్తామంటూ ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వాలు నెరవేర్చకపోవటంతో అసంతృప్తి నెలకొంది. మోది ఇక్కడ జరిగిన సభలన్నింటిలో ఆ విషయాన్ని గుర్తుచేసి ప్రజలను రెచ్చగొట్టారు.
2014 ఎన్నికల్లో ఓటమి ఎదురైన ఆరేడు నెలల తర్వాత రాహుల్ గాంధి దాదాపు రెండు నెలలపాటు అజ్ఞాతంలోకి వెళ్ళారు. 56 రోజుల అజ్ఞాతవాసం తర్వాత 2015 ఏప్రిల్ 16న ఢిల్లీలో ప్రత్యక్షమైన రాహుల్ మారిన మనిషిగా 2.0గా తిరిగొచ్చారని జాతీయ మీడియాలో పలు వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. నిజంగానే ఆయన వ్యవహారశైలిలో దూకుడు పెరిగింది. ప్రో యాక్టివ్‌గా మారారు. మోదిపై విమర్శల జోరు పెంచారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు, ఉద్యమాలలో నేరుగా పాల్గొని ఆందోళనకారుల అభిమానం చూరగొన్నారు. మోదిని విమర్శిస్తూ, సూట్ బూట్ కా సర్కార్, గబ్బర్ సింగ్ ట్యాక్స్(జీఎస్టీ పన్ను), చౌకీదార్ చోర్ హై అనే పంచ్ డైలాగులను కాయిన్ చేసి తరచూ వాడారు. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలనుకూడా సాధించారు. కానీ చివరకు వచ్చేటప్పటికి అతివిశ్వాసంతో పొత్తులను నిర్లక్ష్యం చేయటంతో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఏది ఏమైనా రాహుల్ తన టీమ్‌ను పునర్వ్యవస్థీకరించి పార్టీలో కొత్త రక్తాన్ని ఎక్కించాలి. మోదికి దీటైన ప్రత్యర్థి అని ప్రజల్లో నమ్మకం కలిగేలా చేయాలి. కుర్రతనంతోనూ, అమ్మచాటు బిడ్డలాగానూ కాకుండా బలమైన వ్యక్తిత్వం ఉన్న నేతగా ఎదిగితేనే రాహుల్‌కు, కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే గ్రాండ్ ఓల్డ్ పార్టీ చరిత్రలో కలిసిపోతుంది.
(*శ్రవణ్ బాబు దాసరి, సీనియర్ జర్నలిస్టు,హైదరాబాద్ ఫోన్ నెం.9948293346)