పంతొమ్మిదో శతాబ్దంలో ఇంగ్లీషు విద్యద్వారా మొదలైన సంఘ సంస్కరణ అనేదాన్ని ఒక్కో వర్గం తమదైన దృక్పధంతో నిర్వచించుకుందని చెప్పాలి. అణగారిన వర్గాలు అనుభవించే దుర్భరమైన అంటరానితనం, వెట్టిచాకిరీ, అవిద్య, పేదరికం వంటి సమస్యలను సంస్కరణవాద దృష్టితో పరిష్కరించాలనే ప్రయత్నాలు ఫూలే తర్వాత దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ముందుకు తీసుకెళ్ళిన ఫూలే ఉద్యమ వారసుడు భాగ్యరెడ్డి వర్మ. అప్పట్లో దేశవ్యాప్తంగా ముందుకు వస్తున్న ‘ఆది’ ఉద్యమాన్ని తెలుగు నాట ప్రారంభించించి హైందవ సమాజం చేత జంతువులకంటే హీనంగా పరిగణించబడే మాల, మాదిగలే ‘ఆది ఆంధ్రులు’ అని ఒక ఆత్మగౌరవ ప్రకటన చేశాడు. పంజాబ్ లో మంగూరాం(ఆది ధర్మి), వుత్తరప్రదేశ్ లో స్వామి అచ్యుతానంద(ఆది హిందూ), తమిళనాడులో పండిత అయోతీదాస్(శాక్య బౌద్ధ సమాజం), కేరళలో అయ్యంకాళి యిదే తరహాలో దళితులు యీ దేశ మూలవాసులనే ఆత్మగౌరవ ప్రకటన చేసి వారిలో చైతన్యాన్ని ప్రోది చెయ్యడం జరిగింది. వుత్తర భారతంలో బ్రహ్మసమాజం, ఆర్యసమాజం ల ప్రభావంతో దళితులపరంగా’ఆది హిందూ’ అనే పదాన్ని యెక్కువగా వుపయోగిస్తే దక్షిణ భారత దేశంలో ‘ఆది ద్రావిడ’, ‘ఆది కన్నడ’, ‘ఆది ఆంధ్ర’ అనేవి ప్రాచుర్యంలోకి వచ్చాయి.
భాగ్యరెడ్డి వర్మ కి తల్లిదండ్రులు పెట్టిన పేరు ‘మదారి భాగయ్య’. అయితే ఆయన పేరులో ఒక శైవమత గురువు ‘రెడ్డి’ అనే పేరు జతచేయగా ‘భాగ్యరెడ్డి’ గా మారిన ఆయన సేవలకు గుర్తుగా ఆర్య సమాజం ఆయనకు ‘వర్మ’ అనే బిరుదు ఇచ్చాక భాగయ్య ‘భాగ్యరెడ్డి వర్మ’ అయ్యాడు. అయితే తర్వాత ఆయన ఆర్య, బ్రహ్మ సమాజాల ప్రభావం నుండి బైట పడే దశలో ‘వర్మ’ అనే పేరును వొదిలేసాడు.
తెలుగు నేల మీద ఆయనకు ముందు దళితులు సంఘటితమైనట్టు పెద్దగా తెలీదు. దళిత వుద్యమపరంగా ఆయన స్థాపించిన ‘జగన్ మిత్ర మండలి’ మొట్టమొదటి సంస్థ అనుకోవచ్చు. దీని ద్వారా భాగ్యరెడ్డి దళిత సమాజంలో అంతరంగికంగా సంస్కరణలు తీసుకురావడానికి ప్రయత్నాలు చేశాడు. భజన మండళ్ళు ఏర్పాటు చేసి దళితులకు పరిశుభ్రత గురించి చెప్పడం, మధ్యపానం, మాంసాహారం, మానిపించడానికి కృషి చెయ్యడం, స్త్రీ విద్యను ప్రోత్సహించడం వంటివి యిందులో కొన్ని.
అనంతరం భాగ్యరెడ్డి 1911 లో ‘మాన్య సంఘం’, 1912 లో ‘అహింసా సమాజ్’ ‘స్వస్తి దళ్’ , 1915 లో హైదరాబాద్ చుట్టుపక్కల పల్లెల నుంచి పొట్టకూటికోసం వచ్చి ఇళ్ళల్లో పనులు చేసే వారికోసం ‘డొమెస్టిక్ సర్వెంట్స్ యూనియన్’ 1922 లో ‘ఆదిహిందూ సోషల్ సర్వీస్ లీగ్’ అనే ఉద్యమ సంస్థల్ని ఏర్పాటు చేశాడు. ‘భాగ్యనగర్’ అనే పత్రికను స్థాపించి దానిద్వారా జనంలో భావ చైతన్యాన్ని పెంపొందించాడు.
ఆయనకి తర్వాత కాలంలో కుసుమ ధర్మన్న, అరిగే రామస్వామి, వేముల కూర్మయ్య, జాలా రంగస్వామి, బత్తుల వెంకటరావు(హైదరాబాద్ అంబేడ్కర్)వంటి మెరికల్లాంటి అనుచరులు వుద్యమ భాగస్వాములయ్యారు. వీరంతా కలిసి దళిత ఆత్మగౌరవ వుద్యమాన్ని హైదరాబాద్ రాష్ట్రంతో పాటు కోస్తాంధ్రలో కూడా విస్తరింపచేశారు.
దళితులు యీ దేశపు మూలవాసులని(Sons of the soil), బ్రాహ్మణ వాద సాహిత్యాన్ని దళిత కోణం నుంచి భాగ్యరెడ్డి విశ్లేషించాడు. ఆ రోజుల్లో దేశవ్యాప్తంగా బ్రాహ్మణ బనియాల నాయకత్వంలో జాతీయోద్యమం జరుగుతుంటే దేశ వ్యాప్తంగా దళితులు ఆత్మగౌరవ వుద్యమాన్ని ప్రారంభించి మాకు తెల్ల దొరలకంటే యిక్కడి పెత్తందారులైన నల్లదొరల నుంచి స్వతంత్ర్యం కావాలని ‘స్వరాజ్యం, ‘స్వతంత్ర్యం’ అనే విషయాలలో తమ ఆకాంక్షలను వ్యక్తం చేశారు.
భాగ్యరెడ్డి విస్తృతంగా పర్యటించి దేశదేశాల్లో వున్న దళితులను చైతన్య పరిచాడు. బర్మాలో కూలిపనికోసం వెళ్ళిన దళితులను కలిసి వారిని సంఘటిత పరిచాడు. అంబేడ్కర్ని కలుసుకుని వుద్యమాన్ని మరింత పదునెక్కించాడు. అంబేద్కర్ హాజరైన రెండవ రౌండ్ టేబుల్ సమావేశాన్ని పురస్కరించుకుని 1931 డిశంబర్ లో లక్నోలో జరిగిన ఆది హిందూ డిప్రస్సడ్ క్లాసెస్ సభకు అధ్యక్షత వహించి దళితుల రాజకీయ ఆకాంక్షలను ప్రధానంగా చర్చించాడు. అంబేద్కర్ తో సైద్ధాంతిక పరమైన అంశాలపై విస్తృతంగా చర్చించాక భాగ్యరెడ్డి బ్రహ్మ సమాజ ప్రభావం నుంచి బయటపడ్డాడని చెప్పొచ్చు. ఆది ఆంధ్ర వుద్యమానికి భాగ్యరెడ్డి స్థాపించిన ‘భాగ్యనగర్’, కుసుమ ధర్మన్న స్థాపించిన ‘జయభేరి’ పత్రికలు గొంతునిచ్చాయి.
దళిత వుద్యమకారులు విజయవాడలో పెద్ద యెత్తున సభ నిర్వహించబోతున్నారని తెలిసి బ్రాహ్మణ వాదుల గుండెల్లో రైళ్ళు పరుగెత్తాయి. అప్పట్లో దేశవ్యాప్తంగా దళితుల దేవాలయ ప్రవేశ వుద్యమాలు జరుగుతున్నందున వీరు గుడిలోకి యెక్కడ వస్తారోనని ఆ మూడు రోజులూ కనకదుర్గ గుడిని మూసి వుంచారు. స్థానికంగా కార్యక్రమాన్ని నిర్వహించేవారు ‘పంచమ మహాసభ’ గా బ్యానర్లు కట్టగా, భాగ్యరెడ్డి ‘పంచమ’ పదం తమను అవమానించడానికి బ్రాహ్మణ మత సాహిత్యం వుపయోగించింది కనుక దాన్ని తీసి వేయించి ‘ఆది ఆంధ్ర మహాసభ’ గా సవరించి రెండో రోజు బ్యానర్లలో కూడా పేరు మార్చి దళిత ఆత్మ గౌరవ పతాకను విజయవాడ నడిబొడ్డున యెగరవేశారు. స్వీయ సంస్కరణతో మొదలైన తొలితరం దళిత వుద్యమం తర్వాత అంబేడ్కర్ ప్రభావంతో కొంతమేరకు రాడికల్ గా మారింది. బౌద్ధాన్ని హిందూమతానికి ప్రత్యామ్నాయంగా భాగ్యరెడ్డి ప్రతిపాదిస్తూ 1913 నుంచి ప్రతి సంవత్సరం హైదరాబాద్ లో బుద్ధపూర్ణిమ వుత్సవాలను విర్వహిస్తూ దళితుల సాంస్కృతిక అస్తిత్వం బౌద్ధంలో వున్నదని చాటి చెప్పాడు.
భాగ్యరెడ్డి స్త్రీ విద్య కోసం సుమారు ముప్పైకి పైగా పాఠశాలల్ని యేర్పాటు చేశాడు. ఆయనకి ఈ విషయంలో నిజాం రాజుల తోడ్పాటు లభించింది. దళిత స్త్రీల పరంగా గ్రామాలలో కొనసాగే జోగిని ఆచారాన్ని నిర్మూలించడానికి ‘మురళి నివారణ మండలి’ అనే వొక సంస్థని(మహారాష్ట్ర సరిహద్దుల్లో జోగినీ ఆచారాన్ని ‘మురళి అంటారు) నెలకొల్పాడు. ఆది ఆంధ్ర వుద్యమంలో స్త్రీలు కూడా భాగస్వాములయ్యారు. జాల మంగమ్మ అనే ఆమె పేరు కోస్తాలో ప్రముఖంగా కనిపిస్తున్నప్పటికీ తెలంగాణాలో కనీసపు గుర్తింపులేని యెందరో స్త్రీలు భాగ్యరెడ్డి స్థాపించిన పాఠశాలలో చదువుకుని చైతన్యవంతమయ్యారు. ఈశ్వరీభాయి వంటి వున్నత వ్యక్తిత్వంగల దళిత మహిళా నాయకురాలు ఆది ఆంధ్ర వుద్యమం నుంచి యెదిగి వచ్చిందంటే అది ఆ వుద్యమం యొక్క గొప్పదనంగా భావించవచ్చు. ఆపదలో వున్నవారికి స్వచ్చందంగా సేవ చెయ్యడానికి ‘స్వస్థిదళ్’ అనే వొక వాలంటరీ ఫోర్స్ ని యేర్పాటు చెయ్యగా అందులో పనిచేసే యువకులు కలరా, ప్లేగు వంటి భయంకరమైన వ్యాధులు ప్రబలినప్పుడు ప్రజలకు సేవ చెయ్యడమే కాకుండా అనాధ శవాలకు దహన సంస్కారాలు నిర్వహించడం జరిగింది. యీ సంస్థ వొకరకంగా సమతా సైనిక దళ్ వంటిది. ఆయన చేబట్టిన కార్యక్రమాలు, ప్రభుత్వాలకు సమర్పించిన ఆర్జీల వలనే మద్రాసు ప్రభుత్వం అప్పటి వరకూ దళితుల పరంగా అధికార పత్రాలలో ఉపయోగించే ‘పంచమ’ అనే పేరును తొలగించి ‘అది ఆంధ్ర’ అనే పేరును, దక్షిణాది ప్రాంతాలలో ‘ఆది ద్రావిడ’ అనే పేరును చేరుస్తూ జీ.వో ను జారీ చేసింది.
భాగ్యరెడ్డి ప్రారంభంలో బ్రహ్మ, ఆర్య సమాజాల ప్రభావానికి గురైనప్పటికీ క్రమంగా దళిత తాత్వికతతో ముందుకెళ్ళి ఆనాటి మనువాదానికి ముచ్చెమటలు పట్టించాడు. భాగ్యరెడ్డి వర్మ గొప్ప ఉపన్యాసకుడు. తన ఉద్వేగభరితమైన ఉపన్యాసాలతో దళిత ప్రజల్ని ఎంతో చైతన్యపరిచాడు. దేశమంతా విస్తృతంగా తిరిగి అనేక కార్యక్రమాలలో ముఖ్యవక్తగా, సభాధ్యక్షుడుగా, ముఖ్య నిర్వాహకుడిగా అనేక పాత్రల్లో విరామం లేకుండా పర్యటించి అనారోగ్యం పాలై 51 సంవత్సరాలకే మరణించాడు. తెలుగునాట భాగ్యరెడ్డి లేని దళిత ఆత్మగౌరవ ఉద్యమాన్ని ఊహించలేం.
• మే 22 భాగ్యరెడ్డి వర్మ జయంతి. ఆయన 1888 లో జన్మించి 1939 లో మరణించాడు.
(ఈ వ్యాసం నచ్చితే అందరికి షేర్ చేయండి, మంచి జర్నలిజానికి చేయూతు నీయండి)