గత రెండునెలలుగా సర్వత్రా ఉత్కంఠత రేపుతున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల కోసం దేశం మొత్తం ఆతృతగా ఎదురు చూస్తున్నది. ప్రధానంగా పోటీ పడిన రూలింగ్ తెలుగుదేశం, ప్రతిపక్ష వైసిపి ఒకరిని మించి ఒకరు ఎత్తులు వేయడంతో పాటు ఆర్థిక, అంగ బలాలు, ప్రచార సాధనాలు, కార్యకర్తలు లాంటి అన్ని బలగాలను సమీకరించుకొని హోరా హోరి పోరాడారు. జనసేన ఒకరకమైన పోటీ ఇస్తుందనుకున్నా చివరిలో చేతులు ఎత్తి వేసి ఎవరో ఒకరి కొంపకు నీళ్లు తెచ్చింది. ఇకపోతే మేము బరిలో ఉండామని కాంగ్రెస్, బీజేపీ లు తమ అభ్యర్థులను రంగంలోకి దించినా అవి నామకార్దమే.
ఈ ఫలితాల పట్ల ప్రధాన రాజకీయ పక్షాలైన టీడీపీ,వైసిపి ఎంత ఆతృతగా ఉన్నాయో, ఈ ఫలితాలపై పందేలు కాసిన బెట్టింగ్ రాయుళ్లు అంతకు రెండింతలు ఉద్వేగంగా ఎదురు చూస్తున్నారు. ఈ ఫలితాలు తమను ముంచుతాయో? లేక తెలుస్తాయో? అన్న సందేలహాలతో ఎన్నో నిద్ర పట్టని రాత్రులతో బీపీలు పెంచుకోవడం, గుండె పోటు వస్తుందేమోనని తల్లడిల్లుతున్నారు. రకరకాల సర్వేలు, రకరకాల అంచనాలు, పొంతన లేని ఎక్జిట్ ఫలితాలు వీరిని మరింత అయోమయంలోకి నెట్టుతున్నాయి. ఈ నేపథ్యంలో రేపు ఏం జరుగుతుందో నని పందేల రాయుళ్లు తీవ్ర ఉత్కంఠతతో రేపటికోసం ఎదురు చూస్తున్నారు.
పందేల జోరు – విలువ వేలకొట్లే!
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై కాసిన పందేల విలువ వేల కోట్లలోనే ఉంటుందని అంచనా వేస్తున్నారు రాజకీయ పండితులు. చిన్న పల్లెటూరు నుండి పెద్ద పట్టణం వరకు బెట్టింగుకు అలవాటు పడిన ప్రభువులంతా ఈ ఎన్నికల ఫలితాలపై పందేలు కాసారు. అవి వేలరూపాయల నుండి ఆస్తులవరకు ఉన్నట్లు తెలుస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పందేలు 10 వేల కోట్లకు పైగా ఉంటాయని ఒక అంచనా.
పోటీ చేసిన అభ్యర్థులు మొదలుకొని పార్టీలకు చెందిన రెండవ శ్రేణి నాయకులు, కార్యకర్తలు, వ్యాపారులు, పందెం రాయుళ్లు ఫలితాలపై పందేలు కాసారని తెలుస్తున్నది. సింపుల్ మెజారిటీ నుండి ఇన్ని స్థానాలు ఒక పార్టీకి వస్తాయి అనే అంశం నుండి వారికి నమ్మకమైన స్థానాలలో మెజారిటీ పైన, గెలుపు పైన, ఈ జిల్లాలో ఎన్ని స్థానాలు ఈ పార్టీ గెలుస్తుందనే అంశం నుండి అనేక అంశాలపైన వీరు పందేలు కాశారు. డబ్బు రూపంలోనే కాకుండా స్థలాలు, ఇళ్ళు, ఇతర స్థిరాస్తులు, బంగారు తో సహా పందాలు కాసారట. క్రికెట్ బెట్టింగ్ తరహాలో ఈ ఎన్నికల బీట్టింగులు కూడా సాగాయని, నమ్మకం పైనే ఈ మార్పిడి సాగుతుందని అంటున్నారు. ఈ పండేలా వల్ల ఎంత మంది మునిగితే అంట మంది తేలగలరని బెట్టింగ్ పండితుల అంచనా. ఈ సంఖ్య వేలల్లోనే ఉంటుందని చెప్పవచ్చు.
పందేలకు భీమవరమే రారాజట!!
రాష్ట్రంలో పందేలకు పేరు కాంచిన భీమవరం పట్టణమే ఈ ఎన్నికల పందేలతో కూడా రారాజని కృష్ణా జిల్లాకు కు చెందిన ఓ నాయకుడు వివరించారు. కొన్ని వేలకోట్ల పందేలు భీమవరంలోనే కాశారని, ఆతర్వాతనే విజయవాడ, విశాఖపట్టణం, తిరుపతి లాంటి పట్టణాలు ఉంటాయని, గుంటూరు, నెల్లూరు, కర్నూల్, కడప, ప్రొద్దటూరు, మదనపల్లి, ఆదోని, ఇంకా అనేక ముఖ్య పట్టణాలు, వ్యాపార నగరాల లో భారీగా పందేలు సాగితే, రెండవశ్రేణి పట్టణాలు ఎవరికీ తీసిపోలేదని పెండెం రాయుళ్లు అంటున్నారు. ఒక్కొక్క నియోజకవర్గం లో కనీసం ఐదు కోట్లకు తక్కువ లేకుండా ఇరవై, ముప్పై కోట్ల వరకు పందేలు సాగాయని తెలుస్తున్నది. తెలుగు వాళ్ళు అధికంగా ఉన్న హైదరాబాదు, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలకు కూడా ఈ పెందేల వ్యాపారం విస్తరించిందని, పూర్తీ వివరాలు తెలియడం మాత్రం అసాధ్యమని ఆ రంగంతో పరిచయం ఉన్నవారు అంటున్నారు.
ఇకపోతే జాతీయ రాజకీయాలపైన కూడా పందేలు సాగాయని, అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై కాసినన్ని పందేలు ఎక్కడా జరగలేదని అంటున్నారు.
నాయకులు గెలిస్తే అధికార పీఠం అలంకరిస్తారు. ఓడితే వచ్చే ఐదేళ్ల వరకూ చేయాల్సిన యుద్ధం గురించి ప్రణాలికలు వేసుకుంటూ, ఆ తర్వాత గెలుపు కోసం సిద్దమవుతుంటారు. పందెం రాయుళ్లలో గెలిచిన వారు పండగ చేసుకోగా ఓడిన వారికి మాత్రం శంకరగిరి మాన్యాలే ఖాయం!!