(అహ్మద్ షరీఫ్*)
సంతోష మనేది ఒక మానసిక స్థితి. అన్నీ వుండి కూడా సంతోషంగా ఉండని వాళ్లు, ఏమీ లేకుండా సంతోషంగా వుండే వాళ్ళు చాలామంది వుంటారు. నిజమైన ఆనందం చాలా చవగ్గా దొరుకుతుంది. అయినా మనం దాని నకిలీ రూపాన్ని ఎంతో ధర పెట్టి కొంటాం.
చాలా మంది ఈ కథ వినేవుంటారు అయినా ఇప్పుడు సముచితం కాబట్టి, మళ్ళీ ఒకసారి చూద్దాం. ఒకరోజు బుద్ధుడి దగ్గరికి ఒక మనిషి వచ్చి తనకు సంతోషం కావాలని అడిగాడట. అప్పుడు బుద్ధుడు అ విషయాన్ని ఒక పలక మీద రాయమన్నాడట. అ వ్యక్తీ పలకమీద “నాకు సంతోషం కావాలి” అని రాశాడట. ఆ వాక్యాన్ని చూపించి బుద్ధుడు దీనిలో “నాకు” అనే పదం అహాన్ని సూచిస్తుంది. ఎక్కడైతే “నేను, నాది, నాకు” అనే భావం వుంటుందో అక్కడ సంతోషం వుండదు. ఆ పదాన్ని తీసేయి అన్నాడట. అ వ్యక్తి అ పదాన్ని తుడిపేశాడట. అప్పుడు బుద్ధుడు మళ్ళీ పలక తీసుకుని ఇందులో “కావాలి” అనే పదం కోరికను సూచిస్తుంది, కోరికలుండటం సంతోషాన్ని పొందటానికి అవరోధ మవుతుంది, ఆ పదాన్ని తీసేయి అన్నాడట. ఆ వ్యక్తి “కావాలి” అనే పదాన్ని తుడీపేశాడట. ఈ రెండుపదాలు తుడిపేశా క పలకమీద “సంతోషం” అనే పదం మాత్రం మిగిలింది, ఆ పలకను బుద్ధుడు ఆ వ్యక్తికి ఇస్తూ “ఇదిగో నీకు కావలసిన సంతోషం తీసుకెళ్ళు” అన్నాడట.
మనకందరికీ సంతోషం కావాలి. అయితే సంతోషం పొందడం కోసం మనం ఏం చేయాలనుకుంటాం ? డబ్బు, హోదా, పలుకుబడి, వస్తువులను కలిగివుండటం మొదలైనవి మనకు సంతోషా న్నిస్తాయని అనుకుంటాం. వాటిని సంపా దించాలనుకుంటాం. ఇవి కొంతవరకు సంతోషా న్నిస్తాయేమో కానీ,, కాలం గడిచేకొద్దీ వీటి ప్రభావం తగ్గిపోతుంది. నిజానికి తిండి, బట్ట, వసతి లాంటి ప్రాధమిక అవసరాలు తీరాక, ఆ అవసరాలకి ఇంకా వనరులని జోడిస్తూ పోయినా అవి సంతోషపు స్థాయిని పెంచలేవు. చిన్నప్పుడు నాన్నగారు ఒక సైకిల్ కొనిస్తే కలిగిన సంతోషం ఈ రోజు ఒక కారు కొన్నప్పుడు ఉండక పోవచ్చు
మనుషులు సంతోషంగా ఉండటం లో ఈ క్రింది విషయాలు ప్రముఖ పాత్ర వహిస్తాయని మానసిక శాస్త్ర వేత్తల పరిశోధనల్లో తేలింది.
ఆశావాదం :
ఏ విషయాన్నైనా పాజిటివ్ గా చూడటం నేర్చుకోవాలి. ఒక గ్లాసులో సగం నీళ్ళు వుంటే, ఆ గ్లాసు సగం ఖాళీ గా వుంది అని కాకుండా, సగం నిండుగా వుంది అని చూడగలగాలి. చాలామంది, విషయాల్ని నెగటివ్ గా చూడటం, ప్రతి విషయం లో లోపాలు వెదకడం, తప్పులు పట్టడం చేస్తూ వుంటారు. ఇది అలవాటు. సరియైన కౌన్సిలింగ్ వల్ల, అభ్యాసం వల్ల ఇలాంటి వైఖరికి దూర మవ్వొచ్చు..
కృతజ్ఞతా భావం :
మన దగ్గర వున్న వస్తువుల, విషయాల పట్ల కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి. కొంత మంది ఎప్పుడూ వారి కంటే ఎక్కువ వున్న వాళ్ళ తో పోల్చుకుని బాధ పడుతూ వుంటారు. మన దగ్గర వున్నదాని కంటే తక్కువ ఉన్నవాళ్ళ గురించి ఆలోచిస్తే మన దగ్గర వున్న వస్తువుల విలువ తెలుస్తుంది. మోటార్ సైకిల్ వున్న వాడు సైకిల్ మీద వెళ్ళే వాడి గురించి ఆలోచిస్తే, మోటార్ సైకిల్ విలువ తెలుస్తుంది. అంతే కానీ కారులో వెళ్ళే వాడి గురించి ఆలోచిస్తే అసంతృప్తే మిగులుతుంది.
వర్తమానం :
గతం లో జరిగిన విషయాల గురించి బాధపడటం, భవిష్యత్తు లో జరుగబోయే విషయాల గురించి భయపడటం మానేసి వర్తమానం లో జీవించడం నేర్చుకోవాలి. జరిగిపోయినవాటిని మార్చలేము , జరుగబోయే వాటిని ఉహించలేము. ఈ రెండు పనుల వల్ల వర్తమానం లో జీవితాన్ని వృధా చేసుకుంటాము. ఈరోజు, ఈక్షణం, ఇవే ముఖ్యం. వీటిలో వీలైనంత ఆనందాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నం చేయాలి.
కనికరం:
మన మీద, ఎదుటివారి మీద మనం కనికరం కల్గి వుండాలి. మనల్ని మనం ప్రేమిచుకోవాలి. ఏవైనా పనులు జరగనప్పుడు కొంతమంది తమకు తామే నిందించుకోవడం, చికాకు పడటం చేస్తూ వుంటారు. ఇటువంటి వారు సంతోషంగా ఉండలేరు. ఇతరుల అవసరాలు, భావాలు గుర్తించి వాటి పట్ల అప్రమత్తంగా వుండటం దయా గుణం తో ఆదుకోవడం లాంటివి చేయడం వల్ల సంతోషం పెరుగుతుంది. మనం అమితంగా ప్రేమించే వారి పట్ల (ఉదాహరణకి మన పిల్లలు) మనం ఇలా ప్రవర్తించమా? సంతోషాన్ని పొందమా ?
పరిమితమైన ఆశలు :
ఒక్కోసారి మనం మననుండి, ఎదుటివారినుండి కొంచం ఎక్కువగానే ఆశిస్తాం. ఆశించినది దొరకనప్పుడు అతిగా నిరాశ పడిపోతాం. అలా కాకుండా మనం ఆశించిన విషయాలు దొరకనప్పుడు “ఇట్స్ ఒకే” అనుకో గలగాలి. మనం ఆశించే విషయాలు సబబైనవిగా వుండాలి. సహేతుకమైనవి గా వుండాలి. మననుండి, ఎదుటి వారినుండి దోషరాహిత్యాన్ని ఆశించడం అసంతృప్తి కి దారి తీస్తుంది. మన సంతోషాన్ని హరించి వేస్తుంది.
ఒత్తిడి :
ఈరోజుల్లో ప్రతి ఒక్కరికి ఒత్తిడి ఉంటోంది.. చేయలేని పనుల వల్ల, ఇతరులకిచ్చే ప్రాముఖ్యత వల్ల, విపరీత పరిణామాలు ఊహిస్తూ వుండటం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. కొత్త విషయాలను నేర్చుకోవడం, పుస్తకాలూ చదవడం, యోగా, మెడిటేషన్ మొదలైన విషయాలతో సాధ్యమైనంత ప్రశాంతంగా వుండటం నేర్చుకోవాలి.
శారీరక, మానసిక ఆరోగ్యం :
రోజును గడిపేయడం లో మనం మన శారీరక మానసిక ఆరోగ్యాలను అశ్రద్ధ చేస్తాం. శారీరక ఆరోగ్యం, ఆధ్యాత్మికత, ప్రశాంతత మానసిక ఆరోగ్యాన్ని సమకూరుస్తాయి. తద్వారా సంతోషానికి దారి చూపుతాయి.
ఇంతకీ చెప్పోచ్చేదేమిటంటే, జీవిత పరమార్థం సంతోషంగా వుండటం. ఇది “వన్ టైం లైఫ్”. ఇప్పుడే ఆనందంగా జీవించాలి. మరో సారి చూద్దాం అనుకోడానికి లేదు.
(*Ahmed Sheriff, PMP, CMQ/OE, ACS, FLMI, PSM, Consultant, PMP Certification, Project Management, Quality
Mob: +91 9849310610)
I always enjoy Mr Sheriff articles as they carry lot of insight in human life aspects.