ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మీద శివసేన పార్టీ చరకలేసింది. కేంద్రంలో బిజెపియేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆయన ఇంకా అటూ ఇటూ తిరిగి ప్రయాస పడుతుండటం మీద సానుభూతి చూపింది.
‘అవసరం లేక పోయినా చంద్రబాబు నాయుడు ఇంతగా ఆయాస పడుతున్నారు. ఆయన ఉత్సాహం మే 23 దాకా కొనసాగాలనే ఆశిద్దాం,’ అని శివసేన పార్టీ అధికార పత్రిక సామన (Saamana) లో రాసింది.
‘ ప్రతిపక్ష గుంపులో కనీసం అయిదు మంది ప్రధాని పదవి కోసంపోటీ పడుతున్నారు. వాళ్లందరికి ఆశాభంగమయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయి. కేంద్రంలో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారనే ప్రశ్నకు సమాధానం స్పష్టం తెలిసిపోయింది. బిజెపికి 300 సీట్లు వస్తాయని పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఇప్పటికే చెప్పారు. అయిదో దశ ఎన్నికల నాటికే బిజెపి ఆ సంఖ్యకు చేరుకుంది,’ అని శివసేన పేర్కొంది.
ఇంత తెలిసినా, చంద్రబాబు నాయుడు ఇంకా ఢిల్లీ వెళ్లి హడావిడి చేయడం, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని, సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ ను, ఎన్ సిపి నేత శరద్ పవార్ ను, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ణు, ఇతర నాయకుడు మాయావతి, మమతాబెనర్జీ ని కలవడంలో తమాషా ఏమిటని శివసేన వ్యంగ్యంగా ప్రశ్నించింది.