(బి వి మూర్తి, యనమల నాగిరెడ్డి)
రిసార్టుల దారిలో ఎమ్మెల్యేలు…కర్ణాటక దారెటు?ఎమ్మెల్యేలను రిసార్టుల్లో డిపాజిట్ చేసే ప్రక్రియ షురూ!
బెంగుళూరు: తమ తమ ఎమ్మెల్యేలను రిసార్టులకు తరలించే ప్రక్రియకు కర్ణాటక రాజకీయ పక్షాలు ఈ సరికే శ్రీకారం చుట్టాయి. మొత్తమ్మీద లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కర్ణాటకలో భారీ రాజకీయ పరిణామాలు చోటు చేసుకోగలవని అన్ని రాజకీయ పక్షాలూ, టెలివిజన్ ఛానెళ్లూ కోడై కూస్తున్నాయి. వీళ్లందరూ చేస్తున్న హడావుడి చూసి జనం కూడా దారీ తెన్నూ లేని ఈ అనిశ్చిత పరిస్థితి తొలగి పోతేనే మేలని అనుకుంటున్నారు.
రెండు విడతల్లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ అయిపోగానే వెధవ పెంట ముగిసి పోయిందని చేతులు కడుక్కుందామనుకుంటే అందుకు అవకాశమివ్వకుండా కర్ణాటకలో కుందగోళ (ధార్వాడ జిల్లా), చించోళి (గుల్బర్గా) శాసన సభ ఉపఎన్నికలొచ్చిపడ్డాయి. మంత్రి సిఎస్ శివళ్లి హఠాన్మరణం వల్ల కుందగోళలోనూ, ఉమేష్ జాధవ్ కాంగ్రెస్ నుంచి బిజెపిలోకి దూకి గుల్బర్గా లోక్ సభ స్థానంలో పోటీ చేయడానికై ఎమ్మెల్యే గిరీకి రాజీనామా చేయడం వల్ల చించోళిలోనూ 19న పోలింగ్ జరుగుతున్నది.
కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహించిన ఈ రెండు స్థానాలను గెల్చుకుంటేనా నా సామి రంగా ఇక కుమారస్వామి ప్రభుత్వాన్ని కూల్చెయ్యడమే తరువాయి అంటూ బిజెపి నాయకులు తొడ కొడుతున్నారు. గెలుపు మాదంటే మాదే నంటూ అటు బిజెపి, ఇటు కాంగ్రెస్సూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ రెండు చోట్ల ఒకవేళ బిజెపి గెలిస్తే 224 మంది సభ్యుల అసెంబ్లీలో బిజెపి సంఖ్యాబలం 104 నుంచి 106కు పెరుగుతుంది. మెజారిటీ మ్యాజిక్ ఫిగర్ 113కు బిజెపి మరింత చేరువవుతుంది.
ఎన్నికల ఫలితాలు ఒక వేళ కాంగ్రెస్ కు అనుకూలంగా వస్తే ముఖ్యమంత్రి పదవి కోసం ఆ పార్టీ నాయకుల ప్రయత్నాలు మరింతగా ఊపందుకోక తప్పదు. అంటే ఇప్పుడు కొనసాగుతున్న కాంగ్రెస్-జెడిఎస్ సంకీర్ణ ప్రభుత్వానికీ, కుమారస్వామి ముఖ్యమంత్రిత్వానికి పదవీగండం తప్పదు.
కాంగ్రెస్-జెడిఎస్ ఉమ్మడి పోరాటానికి కూడా ఎదురొడ్డి నిలిచి భారతీయ జనతా పార్టీ తన ఎంపీల సంఖ్యను పెంచుకోగలిగితే ఇక యడ్యూరప్పకు పట్టపగ్గాలుండవు. అంటే అప్పుడు కూడా కుమారస్వామి ప్రభుత్వానికి పదవీగండం తప్పదు. తన రాజకీయ మంత్రదండాన్ని అటు ఇటు తిప్పి ప్రత్యర్థి పక్షాల ఎమ్మెల్యేలను చిటికెలో తన శిబిరంలోకి ఆకర్షించడం యడ్యూరప్పకు వెన్నతో పెట్టిన విద్య.
కాంగ్రెస్, బిజెపిల జయాపజయాలతో నిమిత్తం లేకుండా ఒక తాతా, ఇద్దరు మనవళ్లతో బాటు పోటీ చేస్తున్న మొత్తం ఆరింటిలో ఇంకొక్క ఎంపి సీటు గెల్చినా దేవేగౌడ కుటుంబాన్ని, ముఖ్యంగా ముఖ్యమంత్రి కుమారస్వామిని పట్ట శక్యం గాదు. కుమారస్వామి ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగిపోయి కర్ణాటక మొత్తం మాది మా సొంతం అన్నా ఆశ్చర్యం లేదు. బైట బిజెపితో, లోపల్లోపల కాంగ్రెసోళ్లతో, అప్పుడప్పుడూ తమ వాళ్లే అయిన జెడిఎస్ నాయకులతో నానా తంటాలూ పడుతూ తన ప్రియాతిప్రియమైన సిఎం పదవిని గట్టిగా అంటిపెట్టుకుని వేలాడుతున్న కుమారస్వామికి ఎన్నికల ఫలితాల అనంతరం ప్లాన్ ఏ, ప్లాన్ బి వగైరా తన వ్యూహాలు తన కున్నాయని విభిన్న కథనాలు వెలువడుతున్నాయి.
సంకీర్ణ పక్షాల్లో కాంగ్రెస్ సంఖ్యాబలం ఎక్కువ గనుక ముఖ్యమంత్రి పదవి కాంగ్రెస్ కే దక్కాలంటూ సిద్ధరామయ్య వర్గీయులు ఓ వారం కిందట రాజకీయ కూనిరాగాలు మెదలెట్టారు. దీన్ని కౌంటర్ చేయడానికన్నట్టు చించోళి ఉపఎన్నికలో ప్రచారం చేస్తూ కుమారస్వామి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గెను పని కట్టుకుని పొగిడారు. ఖర్గె ఏనాడో ముఖ్యమంత్రి కావలసిందనీ, గతంలో ఎన్నోసార్లు అవకాశం వచ్చినా ఆయన ఇతరుల కోసం త్యాగాలు చేశారని పరోక్షంగా సిద్ధరామయ్యకు చురకలంటించారు.
ఆ వెంటనే సిద్ధరామయ్య మరో సందర్భంలో మాట్లాడతూ, జెడిఎస్ లో మాత్రం సిఎం పదవికి అర్హులకు కొదవా, అన్ని అర్హతలూ గల రేవణ్ణ ఏనాడో ముఖ్యమంత్రి కావలసింది, పాపం ఇంతదాకా ఒక్కసారి కూడా అవకాశం దక్కనే లేదని సానుభూతి ఒలకబోశారు.
ఇటీవలి కాలంలో రాహుల్ గాంధీతోనే భుజం భుజం కలిపి తిరుగుతూ ఇప్పుడు మన స్థాయి పెరిగిందంటూ పోజు పెడుతున్న కుమారస్వామికి అటు బిజెపిలో మోదీ, అమిత్ షా ల నుంచే నేరుగా ఓ ఆఫర్ వచ్చినట్టు రాజకీయవర్గాల భోగట్టా. లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ కంటే కాస్త ముందుగా జరిగిన సంగతిది. కేంద్ర ఉపాధి హామీ పథకం నిధుల విడుదలకై విజ్ఞప్తి చేసేందుకు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని కలిసినప్పుడు ఈ ఆఫర్ వచ్చిందనీ, బిజెపి, జెడిఎస్ సంకీర్ణానికి అంగీకరిస్తే ముఖ్యమంత్రి పదవి మీదేనంటూ మోదీ, షా ద్వయం కుమారస్వామికి చెప్పారనీ జెడిఎస్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ సంగతి చూద్దామంటూ కుమారస్వామి బిజెపి ఆఫర్ ను పెండింగ్ లో పెట్టారట.
కర్ణాటకలో ఇప్పుడు విదూషకుల రాజ్యం నడుస్తున్నది. కాంగ్రెస్, జెడిఎస్ లలో అంతర్గత కుమ్ములాటలపై, ఇద్దరి మధ్యా సయోధ్య ఛిద్రమైపోతుండటంపై స్థానిక టివి ఛానెళ్లు గంటకో బ్రేకింగ్ న్యూస్ ను, దినపత్రికలు రోజుకో సంచలన వార్తను ప్రసారం చేసి, ప్రచురించి తమ తమ టిఆర్ పి రేటింగ్స్, సర్క్యులేషన్లు అమాంతం పెరిగిపోయాయంటూ లోలోపల మహదానంద పడిపోతుంటే, ఇటు జనం మాత్రం థూ గబ్బు వాసన అని ముక్కు మూసుకుంటున్నారు.
కర్ణాటక ప్రజల ఖర్మ కొద్దీ, ఇంతకు ముందు లాగే ఇప్పుడు కూడా బేరసారాల్లో జెడిఎస్ కే ఎక్కువ ఆప్షన్లున్నాయి. దళాధిపతులు కాంగ్రెస్ కు బై బై చెప్పి బిజెపితో చేతులు కలిపి కింగ్ మేకర్ లం మేమే అంటూ మరోసారి వెకిలి నవ్వు విసిరినా భరించ వలసిందే. తాతా మనవళ్ల గొంతెమ్మ కోర్కెలన్నీ తీర్చడంతో పాటు వాళ్ల పార్టీ విధించే దిక్కుమాలిన షరతులన్నింటికీ ఒప్పుకుంటేనే సంకీర్ణం బతుకుతుంది.
2004 శాసనసభ ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలే బహుశ పునరావృతం కానున్నాయి. అప్పట్లో అత్యధిక స్థానాలు గెల్చిన బిజెపిని (79) పక్కకు నెట్టి కాంగ్రెస్-జెడిఎస్ (65+58) సంకీర్ణం 20 నెలల పాటు రాజ్యమేలింది. తర్వాత కాంగ్రెస్ ను థూ కొట్టి బిజెపితో 20:20 ఒప్పందంతో సిఎం అయిన కుమారస్వామి తన ఇన్నింగ్స్ ముగిశాక యడ్యూరప్పకు బ్యాటింగ్ ఇవ్వడానికి నిరాకరించాడు. అటు తర్వాత రాష్ట్రపతి పాలన, ఆ పై మధ్యంతర ఎన్నికలు వచ్చిపడ్డాయి. తాజా రిసార్టు రాజకీయాలు మే 23 తర్వాత బహుశ అదే దారిలో పయనించగలవేమో వేచి చూడాలి.