(మీనాక్షి సుందరం చెన్నై నుంచి)
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మ్యాజిక్ చెన్నైలో పని చేయలేదు.
యాగాలు నిర్వహించి, ఎంతో నిష్టగా పూజలు చేసి, గుళ్లు గోపురాల ప్రదర్శనలు తిరిగి… ఫెడరల్ ఫ్రంటు విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు చివరకు కలిసింది ఇద్దరు నాస్తికులను. అందుకే అచ్చొచ్చినట్లు లేదు. వారం రోజుల కిందట మొదట కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నుకలిశారు. ఆయన నాస్తికుడు. ఈ రోజు డిఎంకె నేత స్టాలిన్ ను కలిశారు. ఆయన నాస్తికుడే. అందుకే కెసిఆర్ పూజల ప్రభావం వాళ్లిద్దరిమీద పనిచేసినట్లు లేదు.
కేరళ ముఖ్యమంత్రి విజయన్ కెసిఆర్ వాదనను తోసిపుచ్చకపోయినా, సాదరంగా చూద్దాం అని చెప్పి పంపిస్తే, స్టాలిన్ ఫెడరల్ ఫ్రంటు కుదరదు పొమ్మన్నారు. అంతేకాదు, అట్లాంటి ఆలోచనలు మానుకుని , కాంగ్రెస్ నాయకత్వంలోని ఫ్రంటులోకి రమ్మన్ని ఆహ్వానించారు.
కారణం, కెసిఆర్ అజండాను డిఎంకె శంకిస్తూ ఉంది. ఆయన బిజెపి తరఫునే ఈ పని చేస్తున్నారని డిఎంకె నేతలు అనుమానిస్తున్నారు. దీనికి తగ్గట్టుగా ఆయన ఎఐడిఎంకె నేతలను ఎందుకు కలవడం లేదు. ఎఐడిఎంకె కూడా ప్రాంతీయ పార్టీయే కదా? ప్రాంతీయ పార్టీల ఫెడరల్ ఫ్రంటు అయినపుడు ఎఐడిఎంకె నేతలను కూడా కలవాలిగా. అంటే కెసిఆర్ కాంగ్రెస్ మిత్రులను బిజెపి వైపు కాకపోయిన కాంగ్రెస్ నుంచి దూరంచేయాలని చూస్తున్నారనేది డిఎంకె వర్గాల్లోవచ్చిన అనుమానం. అందుకే సమావేశంలో స్టాలిన్ జంకు గొంకు లేకుండా అసలు విషయం చెప్పారు.
అదేమో గాని, ఫెడరల్ ఫ్రంటు ఆలోచన ఏ క్షణాన వచ్చిందో, దానికి ఎవరు ముహూర్తం పెట్టారో ఆ ఆలోచన కెసియార్ నోరు దాటి వెళ్లడం లేదు. ఆయనేమో అన్ని వైపులా కదులుతున్నారు, ఫెడరల్ ఫ్రంటే ఎటూ కదలడం లేదు.
మొదట మమతా బెనర్జీని కలిశారు. ఆమె ప్రాంతీయ పార్టీల ఫెడరల్ ఫ్రంటు ఆలోచన అచరణ సాధ్యం కాదు పొమ్మన్నారు. అయినాసరే, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఫ్రంటేమిటి, కాంగ్రెస్ లేేకుండా ఫ్రంటేమిటి? అలాంటిది వీలు కాదని చెప్పారు.
తర్వాత జార్ఖండ్ నాయకుడు హేమంత్ సోరెన్ హైదరాబాద్ కు వచ్చి కెసియార్ తో ఫెడరల్ ఫ్రంటు గురించి మాట్లాడారు. కెసిఆర్ చెప్పిందానికంతా తలూపారు. ఆ తర్వా త రెండు రోజులకే ఆయన ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి పొత్తు పెట్టుకున్నారు. ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఫ్రంటులంటే పట్టి పట్టనట్టంటున్నారు. ఆయన ఎలాంటి ఫెడరల్ సౌండ్ చేయడం లేదు.
ఈ రోజేమో డిఎంకె నేత స్టాలిన్ నిర్మొహమాటంగా ఫెడరల్ ఫ్రంటు ఆలోచన మానేసి రాహుల్ గాంధీని ప్రధానిగా సమర్థించండని ఎదురుదెబ్బ వేశారు.
జగన్, తన బలం రెండు కలపుకుని దాదాపు 40 మంది (టిఆర్ ఎస్ 15,జగన్ 25)ఎంపిలతో పార్లమెంటులో ప్రవేశించి ప్రధాని పదవికిపోటీ పడదామని చూస్తుంటే స్టాలిన్ ఏకంగా రాహుల్ గాంధీని ప్రధానిగా ఒప్పకోమనడం కెసిఆర్ ను అవమానపర్చడమే.
కెసిఆర్ ప్రతిపాాదించిన ‘బిజెపి వ్యతిరేక- కాంగ్రెస్ వ్యతిరేక’ ఫ్రంటు అనే కాన్సెప్ట్ నే స్టాలిన్ తిరస్కరించట్లు తెలిసింది.
తాము బిజెపి వ్యతిరేకులమని అయితే కాంగ్రెస్ మిత్రులమని చాలా స్పష్టంగా చెప్పినట్లు తెలిసింది. ‘కాంగ్రెస్ వ్యతిరేక’ అని కెసిఆర్ చేస్తున్న ప్రతిపాదన మీద స్ఫష్టత ఇస్తూ తాము కాంగ్రెస్ తో ఎన్నికల ముందునుంచే పొత్తు పెట్టుకున్నామని, దాన్నుంచి బయటకు వచ్చే ఆలోచన లేదని అంతేకాదు, రాహుల్ నుప్రధానిగా సమర్థిస్తున్నామని స్టాలిన్ చెప్పారని డిఎంకె వర్గాలు చెబుతున్నాయి.
‘ఆయన ఒక అజండాతో వచ్చారు. అది మాకు ఆమోదయోగ్యం కాదు. మేం కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఉన్నాం. రాహుల్ గాంధీ ప్రధాని గా ఉండాలని మొదట ప్రతిపాదించింది మేమే. ఈ విషయంలో రాజీ ఉండదని మేం చంద్రశేఖర్ రావుకు చెప్పం,’అని డిఎంకె నేత ఒకరు దక్కన్ హెరాల్డ్ కు చెప్పారు.
ఈ సమావేశం జరగడమే డిఎంకె కుఇష్టం లేదు. ఎందుకంటే, కెసిఆర్ బిజెపి ప్రోద్బలంతో ఈ ఫెడరల్ ఫ్రంటు కార్యక్రమం మీద పనిచేస్తున్నారని డిఎంకె అనుమానిస్తున్నది.
‘ఇదోక మర్యాద పూర్వక కలయిక. సమావేశం వీలుకాదని చెప్పలేం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కోరినపుడు అప్పాయంట్ మెంట్ ఇవ్వకపోవడం సరికాదు,’ అని మరొక డిఎంకె నేత చెప్పారు.
అంతేకాదు,సమావేశం ఏ మాత్రం కెసిఆర్ కు అనుకూలంగా సాగలేదు. బిజెపి, కాంగ్రెస్ లకు ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశం రాదని, దానిని ప్రాంతీయ పార్టీలు, దక్షిణాది పార్టీలు ఉపయోగించుకుని పండగ చేసుకోవాలన్న కెసిఆర్ దూరదృష్టిని డిఎంకెనేత వ్యతిరేకించినట్లు పార్టీ వర్గాలను ఉంటంకిస్తూ దినతంతి ఇంగ్లీష్ వెబ్ సైట్ డిటి నెక్స్ టు రాసింది.
కెసిఆర్ ఫెడరల్ ఫ్రంటు ప్రతిపాదన స్పందిస్తూ, అలాంటి అత్యాశ పనికిరాదని, రాజకీయ వాతావరణం కాంగ్రెస్ కే అనుకూలంగా ఉందని డిఎంకె నేత చెప్పినట్లు ఈ వెబ్ సైట్ రాసింది.
సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి టిఆర్ బాలు, మరొక సీనియర్ నాయకుడు దొరై మురుగన్ కూడా ఉన్నారు.
డిఎంకె బృందం తమ అతిధికి ప్రాంతీయ పార్టీల పొత్తుల గురించి మరొక విషయం కూడా స్పష్టం చేశారు.
అదేమిటంటే…‘జాతీయ పార్టీ లతో నిమిత్తం లేకుండా విభిన్నధోరణలున్న ప్రాంతీయ పార్టీలతో ఏర్పాటయ్యే కూటమి నిలవదు.’అని కెసిఆర్ ఢిల్లీకలల మీద నీళ్లు చల్లారు.
ఈ సమావేశం కెసిఆర్ అజండా కు ఏ మాత్రం అనుకూలంగా లేకపోవడంతో స్టాలిన్ ఇంటిబయట ఎదురుచూస్తున్నవందలాది మంది విలేకరులను కలవకుండానే కెసిఆర్ హైదరాబాద్ వెళ్లి పోయారు.
Our leader @mkstalin persuades Telengana CM KCR to support the congress alliance in a crucial meeting today! #Elections2019 State leaders will be the heroes after #23May2019
— Saravanan Annadurai (@asaravanan21) May 13, 2019