సినిమా రంగం నుంచి రాజకీయాలలోకొచ్చిన నటుడు కమల హాసన్ మరొకసారి హిందూత్వ వాదులను గిల్లాడు.
స్వతంత్ర భారత దేశపు మొట్టమొదటి టెర్రరిస్టు హిందువు అనేశాడు. ఆయన ఇలా మాట్లాడటం కొత్త కాదు. గతంలో హిందూ టెర్రరిజం అనేది కూడా భారతదేశంలో ఉందని చెప్పారు.
ఇపుడు దీనికి సాక్ష్యంగా అన్నట్లు ఇండియాలో మొదటి టెర్రరిస్టు హిందువు అని కూడా ప్రకటించారు.అదెవరో కూడా చెప్పారు.
భారత జాతిపితను హత్య చేసిన నాధూరామ్ వినాయక్ గాడ్సే మొట్టమొదటి హిందూటెర్రరిస్టు అని అన్నారు.
తమిళనాడులో అరవకురిచ్చి అసెంబ్లీ నియోజకవర్గం లో పార్టీ అభ్యర్థి మోహన్ రాజ్ తరఫున ప్రచారం చేస్తూ ఆయన వ్యాఖ్య చేశారు. అరవకురిచ్చిలో ముస్లిం ఓటర్లు ఎక్కువ.
ఇస్లామిక్ టెర్రరిజం మీద చర్చ జరుగుతున్న నేపథ్యంలో హిందూ టెర్రరిజం అనేది కూడా ఉందని అన్నందుకు తనకు చాలా సార్లు బెదిరింపులు వచ్చాయని చెబుతూ టెర్రరిజానికి మతం అనేది లేదని కమల్ అన్నారు.
‘ టెర్రరిజం రాంగ్ అని నేను చెప్పాను. హిందూ మతం కానీయండి, ఇస్లాం కానీయండి ఏమతమూ టెర్రరిజాన్ని అంగీకరించదు. ఏ మతం కూడా హింసను ప్రోత్సహించదు. ఈ సభలో ఉన్న ముస్లింలు దీన్నర్థం చేసుకోగలరనుకుంటున్నా. తాము టెర్రరిజం పంధాలో లేమని ఇక్కడ సమావేశమయిన ముస్లింలంతా అంగీకరిస్తారని భావిస్తున్నాను. ప్రేమించడమే తమ మార్గమని ఇక్కడున్న వాళ్లంతా వాళ్ల పవిత్ర గ్రంథం (ఖురాన్ ) మీద ప్రమాణం చేసి చెబుతారు,’ అని అదివారం రాత్రి ఒక సభలో మాట్లాడుతూ ఆయన అన్నారు.
కులాన్ని మతాన్ని తీసుకువచ్చి ప్రజలను విభజించాలనుకుంటున్న బిజెపి ని వోడించాలని ఆయన పిలుపు నిచ్చారు.
‘ఇక్కడేదో ముస్లిం జనాభా ఎక్కువగా ఉందని నేనీమాట అనడం లేదు. ఇండియా హిందూ టెర్రరిజం కూడా ఉందని అన్నందుకు బిజెపి వాళ్లు నామీద దాడులు మొదలుపెట్టారు. అయితే, నేను మళ్లీచెబుతున్నా, స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి టెర్రరిస్టు ఒక హిందువు. అతని పేరు నాధూరామ్ గాడ్సే. అక్కడి నుంచే టెర్రరిజం మొదలయింది. అందుకే మేం ప్రజలందరి సమాన గౌరవం ఉండే ఇండియా కావాలనికోరుకుంటున్నాం,’ కమల్ అన్నారు.
అరవకురిచ్చిఅసెంబ్లీ నియోజకవర్గంలో మే 19 ఉప ఎన్నిక జరగుతూ ఉంది.