ఐపిఎల్ అయిపోయింది…సినిమాలూ, సీరియల్సూ ఇక మీ ఇష్టం

ఐపిఎల్ అయిపోయిందంటే ఏదో వెలితి. క్రికెట్ పిచ్చోళ్లు ఇకపై రాత్రి ఎనిమిది తర్వాత టివిల్లో ఏవో కొత్త ప్రోగ్రాంలు వెదుక్కోవాలి. కాదు కాదు, ఈ పిచ్చి పురుషాహంకార సమాజంలో గత నెలరోజులుగా నలిగిపోతున్న మహిళలు ఇకపై స్వేచ్ఛగా తిరిగి తమ తమ టివి సీరియల్ వ్యసనంలో హాయిగా కూరుకుపోవచ్చు.

ఆదివారం రాత్రి జరిగిన తుదిసమరంలో చెన్నై సూపర్ కింగ్స్ పై ఒకే ఒక్క పరుగు తేడాతో గెలిచాక ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, కీరన్ పొలార్డ్ బృందం లసిత్ మలింగను భుజాల మీది కెత్తుకుని ఊరేగింది. చివరి బంతిపై విజయం కోసం చెన్నైకి రెండు పరుగులు కావాలి. ఒక్క పరుగు చేస్తే పోటీ టై అయి సూపర్ ఓవర్ కు దారి తీస్తుంది. మిడిల్ స్టంప్ పై ఆఫ్ కట్టర్ ను పిడిబాకులా యార్కర్ వేయడంతో శార్దూల్ ఠాకుర్ ఎల్ బి డబ్ల్యు అయ్యాడు. ఇటు ముంబై జట్టు గాల్లోకి పిడికిళ్లు విసిరి ఎగిరెగిరి గంతులేస్తుంటే, ఆ క్షణం దాకా ఉవ్వెత్తున లేచి పడుతున్న ధోనీ, రైనా పగటి వేషగాళ్ల పసుప్పచ్చ తరంగాలు హఠాత్తుగా తీరానికి తలబాదుకుని నిశ్శబ్దంగా రోదించాయి.

ప్రపంచ వ్యాప్తంగా కోటానుకోట్ల అభిమానులను తన చుట్టూ పరిభ్రమింప జేసుకున్న ఐపిఎల్-2019కి ఇంతకంటే మహాద్భుతమైన పతాక సన్నివేశాన్ని ఊహించలేము. ముంబై రూ. 20 కోట్లు, చెన్నై రూ. 12.5 కోట్లు ప్రైజ్ మనీ సొంతం చేసుకున్నయి. 2018 లో రూ. 44 వేల కోట్లున్న ఐపిఎల్ వ్యాపార విలువ ఈ ఎడిషన్ లో బహశ రూ. 50 వేల కోట్లు చేరి ఉండాలి.

తనతో సహా అందరూ రిటైర్ మెంట్ కు సిద్ధంగా ఉన్నవాళ్లు, ఇప్పటికే రిటైరయిపోయినవాళ్లతో కూడిన చెన్నై జట్టుకు డ్యాడీస్ జట్టుగా ముద్దుపేరు. కెప్టెన్ కూల్ ధోనీ, చెన్నై పిచ్ హోమ్ అడ్వాంటేజ్ ల ఆసరాతో ఆ జట్టు ఫైనల్ దాకా రావడమే ఓ నమ్మ శక్యం గాని అద్భుతం. ఫైనల్లో కూడా వాళ్ల ప్రయత్నలోపం లేదు గానీ కేవలం తమ శౌర్య ప్రతాపాలతోనే ఒంటి చేత్తో విజయాలు సాధించి పెట్టగల ధోనీ, వాట్సన్ ఇద్దరూ కీలక ఘట్టంలో రనౌట్ కావడం వారికి దురదృష్టంగా పరిణమించింది. ఒక్క పరుగుతో ఓడినా, అంతిమ సమరాన్ని అత్యంత ఉత్కంఠభరితం చేసిన అద్భుత జట్టుగా ధోనీ సేన అభిమానుల హృదయాలను గెల్చుకున్నది.

మరోవైపు ఈ ఐపిఎల్ లో ముంబై ఘనవిజయం ఘనత నూటికి నూరు పాళ్లూ బౌలర్లకే దక్కుతుంది. బ్యాటింగ్ లో అంతగా నిలకడ లేకపోయినా, ఫైనల్ తో సహా ప్రతి పోటీలోనూ ఆల్ రౌండర్ లు పొలార్డ్, హార్దిక్ పాండ్య ఆపద్బాంధవుల్లా ఆదుకున్నారు. జరిగిన అన్ని పోటీలు గమనిస్తే డికాక్, రోహిత్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ లలో ఏ ఒక్కరూ టోర్నీ ఆద్యంతం నిలకడగా ఆడింది లేదు. అందరూ అప్పుడప్పుడూ ఒక్కోసారి జట్టును ఆదుకున్నారు. అదే బౌలర్లను తీసుకుంటే, బుమ్రా, మలింగ ప్రధాన శక్తిగా మారి ఆద్యంతం అద్భుతమనిపించారు. ఇదివరకటి టోర్నీలతో పోల్చితే హార్దిక్ పాండ్య బౌలింగ్ ఎంతగానో మెరుగుపడింది. కృనాల్ పాండ్య ఫర్వాలేదనిపించగా రాహుల్ చహార్ ఈ టోర్నీతోనే వెలుగులోకి వచ్చిన సరికొత్త స్పిన్నర్ గా అవతరించాడు. బుమ్రా నాలుగు ఓవర్లను బంగారంలా వాడుకున్న రోహిత్ శర్మ కెప్టెన్సీలో శభాషనిపించాడు. అంతక్రితం వాట్సన్, బ్రేవో ద్వయానికి 20 పరుగులు సమర్పించుకున్న మలింగను 20వ ఓవర్ చేయడానికి రప్పించడం రోహిత్ కు అతనిపై గల నమ్మకానికి అద్దం పడుతున్నది. తిరుగులేని ఈ అంతిమ వ్యూహం పాశుపతాస్త్రంలా పని చేసి ముంబైకి కప్పు సాధించి పెట్టింది.

క్రికెట్ ఉత్కంఠతో ఉర్రూతలూపిన ఈ ఐపిఎల్ సీజన్ లో వివాదాలకూ కొదువ లేకుండా పోయింది. చెన్నైలో జరిగిన ఆరంభపోటీలో బెంగుళూరు 70 పరుగులకు కుప్పకూలడం సంచలనం కాగా స్పిన్నర్ల స్వర్గంలా, బ్యాట్స్ మెన్ మరుభూమిగా మారిన చెన్నై వికెట్ పై తీవ్ర విమర్శలు చెలరేగాయి. మరోవైపు ఫిరోజ్ షా కోట్ల వికెట్ ఢిల్లీ క్యాపిటల్స్ కు తప్ప మిగతా అన్ని జట్లకు ఎంతో అనుకూలమైన పిచ్ గా మారడంపై కోచ్ రికీ పాంటింగ్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. నో బాల్ వివాదాల్లో ఆర్ సి బి కెప్టెన్ విరాట్ కోహ్లీ అంపైర్ లపై విరుచుకు పడ్డాడు. ప్రత్యర్థి బౌలర్ మలింగ చివరి బంతిపై గీత దాటినా చూడకుండా కళ్లు మూసుకున్నందుకు అంపైర్ ఎస్ రవి పైనా, తమ బౌలర్ ఉమేష్ యాదవ్ గీత దాటకపోయినా అనవసరంగా నో బాల్ ప్రకటించినందుకు అంపైర్ నీగెల్ లాంగ్ పైనా కోహ్లీ కోప్పడ్డాడు. మాకు మాత్రం కోపతాపాలుండవా అని నిలదీస్తున్నట్టు అంపైర్స్ గదిలో తలుపు బద్దలు కొట్టిన లాంగ్, వెంటనే తమాయించుకుని బెంగుళూరు స్టేడియం అధికారులకు రూ. 5,000 ముట్టజెప్పి మీ పగిలిపోయిన తలుపులు రిపేరు చేయించుకోండేం అని సలహా ఇచ్చి ఇంగ్లాండ్ లో వాళ్లూరికి వెళ్లిపోయాడు. రాజస్థాన్ రాయల్స్ నాన్ స్ట్రైకర్ బ్యాట్స్ మన్ జాస్ బట్లర్ అత్యుత్సాహంతో మునుముందుకు వెళ్తుండటంతో వొళ్లు మండి బంతి బౌల్ చేయకుండా రవిచంద్రన్ అశ్విన్ రనౌట్ చేయడం `మంకేడింగ్’ పై తాజా చర్చలకు తెర లేపింది. రానున్న ప్రపంచకప్ పోటీల్లో నాన్ స్ట్రైకర్ బ్యాట్స్ మన్ అతికి పోకుండా హద్దుల్లో ఉండటానికి బహుశ ఈ అశ్విన్ మంకేడింగ్ దోహదం చేయగలదేమో.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *