(బి వెంకటేశ్వర మూర్తి)
బెంగుళూరు: ఆధునిక కన్నడ నాటక రంగ వైతాళికుడు మాస్టర్ హిరణ్ణయ్య జీవిత నాటకానికి శాశ్వతంగా తెరపడింది. సినిమాలు, టివిలు, యూట్యూబ్ సంస్కృతి నరనరాన జీర్ణించుకుపోయిన ఈ ఇరవయ్యొకటో శతాబ్దంలో కూడా రంగస్థల నాటకరంగాన్ని పూర్తి జవసత్వాలతో నిలబెట్టిన ఓ మహా వ్యక్తిత్వం ఈ భూమిపై తన పాత్ర ముగించి అనంతవాయువుల్లోకి నిష్క్రమించింది.
లివర్ వ్యాధితో ఆస్పత్రిలో చేరిన 85 ఏళ్ల మాస్టర్ ఈ నెల రెండో తేదీన తుది శ్వాస వదిలారు. ఆయన రచించి, నటించి దర్శకత్వం వహించిన `లంచావతార’ నాటకం 11,000కు పైగా ప్రదర్శనలతో రికార్డు సృష్టించింది. 1959లో ఆరంభించి దాదాపు 45 ఏళ్ల పాటు నిరాఘాటంగా సాగిన ఈ ప్రదర్శనలు ఊరూరా హౌస్ ఫుల్ కలెక్షన్ లతో సాగాయంటే నటుడుగా ప్రయోక్తగా హిరణ్ణయ్య ప్రతిభా పాటవాలు ఎంత గొప్పవో ఊహించుకోవలసిందే. మూల కథ అదే అయినా, సన్నివేశాలూ అవే అయినా, ప్రతి ప్రదర్శనలోనూ ఆనాటి సామాజిక, రాజకీయ సంఘటనల ప్రాతిపదికగా అప్పటికప్పుడు కొత్త సంభాషణల్ని సంధించి లంచావతారాన్ని నిత్యనూతనంగా ప్రత్యక్షం చేసేవారాయన.
“రాజ్యమంత్రిగళగె నూరారు కోటి, కేంద్ర మంత్రిగళగె సావిరారు కోటి, ఖజానా లూటీ, నినగు ననగు లంగోటీ’’ (రాష్ట్ర మంత్రులకు వందలాది కోట్లు, కేంద్ర మంత్రులకు వేలాది కోట్లు, ఖజానా లూటీ, నీకు నాకు లంగోటి), లంచావతార నాటకంలో ఇదో డైలాగు. ప్రజాజీవితంలో అవినీతిని, మానవ సంబంధాల్లో అనైతికతను ఉతికి ఆరెయ్యడంలో హిరణ్ణయ్యకు దయాదాక్షిణ్యాలు అస్సలుండేవి కావు. 1970 నాటికి కన్నడ నాట నలుచెరగులా సుప్రసిద్ధమైన లంచావతార నాటకం వర్తమాన రాజకీయ, సామాజిక సంఘటనలపై తీవ్ర వ్యంగ్యోక్తులు, చురకలతో కూడిన రన్నింగ్ కామెంటరీగా కొనసాగేది. నైతికత లేని దుష్ట రాజకీయాలపై సామాన్యుడి గొంతుక తానై ప్రతిధ్వనించిన మాస్టర్ నిర్భయత్వానికి పెట్టింది పేరు. తన సన్నిహిత మిత్రులే ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా రాజ్యమేలినా వారిని సైతం ఆయన వదిలిపెట్టలేదు. స్టేజీ మీద పాత్రలో ఒదిగిపోతూ వారూ వీరని తేడా లేకుండా కొమ్ములు తిరిగిన నాయకులను కూడా పేరు పెట్టి మరీ వెటకారాలతో చావగొట్టేవారు. 1975-77 అత్యవసర పరిస్థితి కాలంలో ముఖ్యమంత్రి నిజలింగప్ప, ప్రధాని ఇందిరా గాంధీలపై వెటకారాలతో విరుచుకు పడుతున్నందుకు మాస్టర్ హిరణ్ణయ్యను అరెస్టు చేసేందుకు ప్రభుత్వం శతవిధాలా యత్నించి విఫలమైంది. ప్రభుత్వాధికారులు, పోలీసుల్లోని అభిమానులెవరో ఒకరు మాస్టర్ కు ఉప్పందించేవారు. లంచావతారం హఠాత్తుగా అక్కడ మాయమై మరో చోట ప్రత్యక్షమయ్యేది. తాను అనదల్చుకున్న నాలుగు మాటలూ అనేసి అరెస్టుకు దొరక్కుండా పారిపోయే వారాయన. నాటకాల్లోని తన పాత్రల్లో సామాన్యుడి గొంతుకగా మారి నాయకులు, అధికారులపై విరుచుకుపడినందుకు ఆయన ఎన్నెన్ని కేసులు ఎదుర్కొన్నారో, ఎన్ని సార్లు కోర్టు విచారణలకు హాజరయ్యారో ఆయనకే తెలీదు. ఎన్ని విఘాతాలెదురైనా అవినీతిని అనైతికతను చీల్చి చెండాడే ఆయన తీరు మారలేదు. 1980 దశాబ్దంలో ఆడియో క్యాసెట్ల విక్రయాల్లో లంచావతార రికార్డు సృష్టించింది.
మిత్రుడు ఉప్పల నరసింహం అధ్యక్షతలోని `నటన’ సంస్థ ఆధ్వర్యంలో బెంగుళూరులోని ఓ ఆడిటోరియంలో మాస్టర్ హిరణ్ణయ్యను సన్మానించిన కార్యక్రమంలో పాల్గొనడం ఈ విలేఖరి గొప్ప అదృష్టంగా భావిస్తున్నాడు. అంతక్రితం ఎన్నోసార్లు చెప్పినట్టుగానే, టికెట్టు కొని నాటకశాలకు వచ్చి ఓపికగా తన ప్రదర్శన వీక్షించే ప్రేక్షకులకు మాత్రమే విలువ ఇస్తాననీ, వారి స్పందనలను శిరోధార్యంగా భావిస్తానని మాస్టర్ మరో సారి నాటి సభలో ప్రకటించారు. ఏ విషయంపై అయినా, ఒక్కోసారి విషయం అంటూ ఏదీ లేకపోయినా సరే అనర్గళంగా, అడుగడుగునా ప్రేక్షకులను నవ్విస్తూ గంటల తరబడి జనరంజకంగా ప్రసంగించడం మాస్టర్ కు దేవుడిచ్చిన వరం.
ప్రస్తుతం కర్ణాటకలో స్టాండప్ కామెడీల హవా జోరుగా నడుస్తున్నది. హరటె, హాస్యవల్లరి, హాస్య సంజె…ఇలా రకరకాల పేర్లతో గంగావతి ప్రాణేశ, కృష్ణే గౌడ, తాజాగా పవన్ వేణుగోపాల్, సుదర్శన్ రంగప్రసాద్ వంటి మాటకారి కళాకారుల షోలకు ఆడిటోరియంలు క్రిక్కిరిసి పోతున్నాయి. అయితే ఈ సోలో కామెడీ షోలకు ఆద్యుడు ముమ్మాటికీ మాస్టర్ హిరణ్ణయ్యే. ఆయన మాటల్లోని నేటివిటీ, నిజాయితీ, అపారమైన విషయ పరిజ్ఞానం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసేవి. నిరంతర అంతర్వాహినిగా ప్రవహించే హాస్యస్ఫోరకత ప్రేక్షకులకు ఆయాసం వచ్చేలా నవ్విస్తూనే ఉండేది. కేవలం పాండిత్య ప్రదర్శన కోసం కాకుండా సందర్భోచితంగా ప్రాచీన కన్నడ, సంస్కృత, ఇంగ్లీషు, హిందీ సాహిత్యాల నుంచి ఉటంకిస్తుంటే ఈ మనిషి చదివింది ఇంటర్మీడియెట్ వరకేనా అని ఆశ్చర్యం వేసేది.
ఆరోగ్య కారణాల వల్ల నాటక ప్రదర్శనలకు స్వస్తి పలికాక, మొన్న మొన్నటి ఓ షోలో ఆయన తన సహజ ధోరణిలో పూర్తిస్థాయి హావభావాలతో చేసిన ఓ వ్యాఖ్య కర్ణాటకలోని అగ్రనాయకులకు తగలరాని చోట తగిలింది. “దేవేగౌడ్రన్న మదివె మనెగె, సదానంద గౌడ్రన్న సత్తవర మనెగె కరెయ బారదు అంతా నానొందు గాథె హేళుత్తిద్దె (దేవేగౌడ గారిని పెళ్లింటికి, సదానంద గౌడ గారిని చావు జరిగిన ఇంటికి పిలవకూడదు అంటూ నేనో సామెత చెప్పేవాడిని.)’’ దేవేగౌడ ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నట్టు ముఖం ముటముటలాడిస్తూ ఏడుపు మొహంతో ఉంటారనీ, బిజెపి నాయకుడు, కేంద్ర మంత్రి సదానందగౌడ ముఖం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఎప్పుడూ నవ్వుతూ పండ్లికిలిస్తున్నట్టుగా ఉంటుందని అందరికీ తెలిసిందే. పెళ్లి కొడుకు, పెళ్లికూతురి మధ్య నిలబడి దేవేగౌడ ఏమిటో ఈ పెళ్లి నాకెంత మాత్రం నచ్చలేదన్నట్టు అతి దారుణంగా దీనాతిదీనంగా మొహం పెట్టడాన్నీ, “ఏనప్పా నిమ్మ తందేవ్రు హోద్రంతల్వా’’ (ఏమయ్యా మీ తండ్రిగారు చనిపోయారట కదా…) అంటూ సదానందగౌడ అమాయికంగా అలవాటైన ధోరణిలో పళ్లికిలించినట్టు మొహం పెట్టడాన్నీ మాస్టర్ అభినయిస్తుంటే ప్రేక్షకులు కుర్చీల్లో ఎగిరెగిరి పడి నవ్వసాగారు. అయితే తన మొదటి మనవరాలి పెళ్లికి వచ్చిన దేవేగౌడ, తమ జెడిఎస్ కు బద్ధ శత్రువైన బిజెపికి చెందిన నాయకులు అనంతకుమార్, అశోక్ లతో కలిసి ఆహాహా ఓహోహో అంటూ నవ్వుతుండటం చూశాక ఈ సామెతను మార్చుకోక తప్పలేదని మాస్టర్ చెప్పుకొచ్చారు. దేవేగౌడ స్థానంలో బిజెపి నాయకుడు యెడ్యూరప్పను చేర్చవలసి వచ్చిందనీ, దేవేగౌడ అయినా ఏదో పొరపాటునైనా నవ్వుతాడేమో గానీ యెడ్యూరప్ప మాత్రం చచ్చినా నవ్వడని తేల్చిచెప్పారు.
మక్మమల్ టోపీ, చంచావతార, భ్రష్టాచార, అనాచార, డబుల్ తాళి, కన్యాదహన, సన్యాసి సంసార, నడుబీది నారాయణ, హాస్యదల్లి ఉల్టాపల్టా, కపిముష్టి వంటి మరెన్నో నాటకాలను హిరణ్ణయ్య రచించి, నటించి, జనరంజకంగా ప్రదర్శించారు. మాస్టర్ దాదాపు 30 సినిమాల్లోనూ నటించారు. హాస్యలాస్య, రంగతరంగ, హిరణ్య వల్లరి, నెనపినంగళదల్లి, కన్నడ భారత భారతి వంటి అనేక గ్రంథాలను కూడా ఆయన రాశారు. స్వయంగా టివి, రంగస్థల కళాకారుడైన మాస్టర్ హిరణ్ణయ్య కుమారుడు బాబు హిరణ్ణయ్య తన తండ్రి నాటక సాహిత్యం సమగ్ర సంపుటాలు ముద్రించాలని నిర్ణయించారు.
సమాజంలోని అన్ని పార్శ్వాలను వివిధ కోణాల్లో దర్శింప జేస్తూ, సుఖదుఃఖాలు, ఆర్ద్రతలు, అనుభూతులతో నిండిన సప్త వర్ణ సంభరితమైన సంపూర్ణ జీవితచిత్రాన్ని ఆ పాతిక అడుగుల రంగభూమిపై ఆవిష్కరించిన హిరణ్ణయ్య నాటకాలు ఆధునిక కన్నడ సాహిత్యరంగంలో, నాటకరంగంలో అతులిత సంపదగా మిగిలిపోతాయి.