మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా ఈ రోజు మోదీ గురించిన ఒక రహస్యం బయటపెట్టారు.
సిన్హా ప్రధాని వాజ్ పేయి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్నారు.
గుజరాత్ హింసాకాండ మీద ప్రధాని వాజ్ పేయి బాగా ఆగ్రహంతో ఉన్నారు. లోక్ సభలో ఆగ్రహంతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నరేంద్రమోదీ రాజధర్మంపాటించాలని ఒక చారిత్రాత్మక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
అయితే, అది అక్కడితో ఆగిపోలేదు, వాజ్ పేయి అసలు మోదీని ముఖ్యమంత్రి పదవి నుంచే తప్పించాలనుకున్నారు. ఈ విషయాన్ని భోపాల్ లో విలేకరులతో మాట్లాడుతూ యశ్వంత్ సిన్హా వెల్లడించారు.
‘గుజరాత్ మత కల్లోలం, మారణకాండ తర్వాత ముఖ్యమంత్రి పదవి నుంచి నరేంద్రమోదీని తొలగించాలని ప్రధాని వాజ్ పేయి నిర్ణయించారు. 2002 గోవాలో జరుగనున్న భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గం సమావేశానికి వెళ్లే దారిలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజీనామా చేయడానికి మోదీ తిరస్కరిస్తే గుజరాత్ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేస్తాం,’ అని వాజ్ పేయి స్పష్టంగా నిర్ణయించుకున్నారని ఆయన చెప్పారు.
‘ పార్టీలో అంతరంగిక కమిటీ ఒకటి ఉంటుంది. ఈ కమిటీ సమావేశంలో అద్వానీజీ వాజ్ పేయి నిర్ణయాన్ని ,అంటే మోదీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలన్ని నిర్ణయాన్ని, తిరస్కరించారని నాకు తెలిసింది. అద్వానీ వాజపేయికి తన అభిప్రాయం స్పష్టంగా చెప్పారు- మోదీని తొలిగిస్తే తాను క్యాబినెట్ లో ఉండానని అద్వానీ వాదన. దీనితో తన వాజ్ పేయి నిర్ణయాన్ని మార్చుకున్నారు. నరేంద్ర మోదీ పదవిలో కొనసాగారు,’అని సిన్హా చెప్పారు.