ఆల్ పార్టీ దీక్షలో కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ మీద దాడి చేసిన నగేష్ ముదిరాజ్ ను పార్టీ నుంచి బహిష్కరించేందుకు రంగం సిద్ధం అయింది.
ఈ ఘటనపై అత్యవసరంగా సమావేశమైంది క్రమశిక్షణ సంఘం. చైర్మన్ కోదండ రెడ్డితో పాటు సభ్యులు పాల్గొన్నారు.
ఇందిరాపార్క్ వద్ద అఖిల పక్ష సమావేశంలో మాజీ ఎంపీ విహెచ్ పైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నగేష్ ముదిరాజ్ దాడి చేసినట్టు భావిస్తున్నామని సంఘము సభ్యులు చెప్పారు.
ఏఐసీసీ ఇంచార్జ్ కార్యదర్శి ఆర్సీ కుంతియా సభలో పాల్గొన్న సమయంలో వి.హెచ్ పైన దాడి జరగిందని భావిస్తున్నట్లు తెలిపారు.
సీనియర్ నాయకులు, పార్టీ లో అనేక పదవులు నిర్వహించిన వి.హెచ్ పైన నగేష్ ముదిరాజ్ అనుచితంగా ప్రవర్తించి భౌతిక దాడికి దిగడాన్ని తీవ్రంగా ఖండించింది క్రమశిక్షణ సంఘం.
క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించేది లేదని తేల్చిచెప్పింది క్రమశిక్షణ సంఘం.
ఈ అంశంపైనా అక్కడ సభలో ఉన్న కార్యనిర్వాహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్, మండలి విపక్ష మాజీ నేత షబ్బీర్ అలీ లను కమిటీ నివేదిక ఇవ్వమని సూచించారు కుంతియా.
ప్రాథమికంగా ఉన్న సమాచారం ప్రకారం వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా నగేష్ ముదిరాజ్ పైన చర్యలు తీసుకునెందుకు రంగం సిద్ధం చేసింది క్రమశిక్షణ సంఘం.
క్రమశిక్షణ విషయంలో ఎలాంటి వారినైనా, ఎంత పెద్ద వారైనా చర్యలు తప్పవని హెచ్చరించింది.