మే 23న దేశ ప్రజలు ప్రధానిగా నరేంద్ర మోదీని తిరస్కరించబోతున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మోదీ టీమ్ ను అని చెబుతూ అంపైర్లు లేకుండా చేసి, రిఫరీ సిస్టమ్‌నే ధ్వంసం చేసేలా వ్యవహరిస్తున్న మోదీ టీమ్‌కు పరాజయం ఖాయమని ఆయన కొద్ది సేపటి కిందట ట్వీట్ చేశారు.
నిబంధనల ప్రకారం సక్రమంగా ఆడే కొత్త టీమ్‌ను ప్రజలే ఎంపిక చేసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటారని ముఖ్యమంత్రి అన్నారు. అంతేకాదు, ప్రధాని ప్రచార శైలిని కూడా చంద్రబాబు తప్పు పట్టారు.
మే 23న దేశ ప్రజలు ప్రధానిగా @narendramodi, అతని టీమ్‌ను తిరస్కరించడం ఖాయం. అంపైర్లు లేకుండా చేసి, రిఫరీ సిస్టమ్‌నే ధ్వంసం చేసేలా వ్యవహరిస్తున్న మోదీ టీమ్‌కు పరాజయం ఖాయం. నిబంధనల ప్రకారం సక్రమంగా ఆడే కొత్త టీమ్‌ను ప్రజలే ఎంపిక చేసుకుంటారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటారు.
— N Chandrababu Naidu (@ncbn) May 11, 2019
‘రాజకీయ లాభం కోసం ఎప్పుడో చనిపోయిన నాయకులను, చివరికి నాయకుల కుటుంబ సభ్యులను కించపరిచేందుకు కూడా మోదీ వెనుకాడరు,’ అని విమర్శించారు. ఎన్నికల్లో గెలిచేందుకు మోదీ వేయని ఎత్తులేదని అన్నారు.
‘రక్షణ శాఖను, సైన్యాన్నీ వాడుకుంటారు. మతాల మధ్య చిచ్చు పెట్టి, రాజకీయ నాయకత్వాన్ని చంపేస్తారు. అలాంటి ట్రాక్ రికార్డు ఉన్న ఆయన మాకు నీతిపన్నాలు ప్రబోధిస్తారు,’ అని అన్నారు.
వివిప్యాట్ ల లెక్కింపు ను పెంచాలన్న తన వాదనను ఆయన సమర్థించుకున్నారు. ఎక్కువ సంఖ్యలో వివిప్యాట్లను లెక్కిస్తే ఫలితాలు ప్రకటించడం జాప్యం అవుతుందన్న వాదనను ఆయన తోసిపుచ్చారు.
‘ఎన్నికల షెడ్యూల్‌కు 73 రోజులు తీసుకున్న ఈసికి 50% వీవీ ప్యాట్ల లెక్కింపునకు మరో 6 రోజులు తీసుకోవడానికి ఎందుకంత అభ్యంతరం..? నరేంద్రమోదీ ఎందుకు భయపడుతున్నారు..? 50% వీవీ ప్యాట్లు లెక్కించాలని ఈసిని ప్రతిపక్షాలు అడిగితే మోదీకి ఏం సంబంధం, ఆయనెందుకు ఉలిక్కిపడుతున్నారు..?,’ అని విమర్శించారు.