వృథాగా పోరాదీ రైతు హక్కుల చైతన్యం!

(బి వి మూర్తి)

బెంగుళూరు: గుజరాత్ రైతులు, పెప్సీకో బహుళ జాతి సంస్థ మధ్య చెలరేగిన వివాదం వల్ల మన వ్యవసాయ రంగానికి అంతో ఇంతో అనుకూల ఫలితాలే వచ్చాయి. మన రైతుల విత్తన హక్కులపై పెల్లుబుకిన చైతన్యాన్ని దీర్ఘకాలిక ప్రయోజనాలు సాధించే క్రియాశీలక శక్తిగా రూపొందించుకోవలసిన అవసరం ఉంది.

బహుళ జాతి సంస్థలూ, ఇక్కడి దేశీయ సంస్థల్లో సైతం రైతుల రక్తం రుచిమరిగిన భారీ ఆహరోత్పత్తి సంస్థల నుంచి భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలూ, సవాళ్లను ఎదుర్కొనే లక్ష్యంతో బీజ్ అధికార్ మంచ్ (రైట్స్ ఫర్ సీడ్స్ ఫోరం, ఆర్ఎస్ఎఫ్ ) ఆవిర్భవించింది. రైతులతో పాటు న్యాయ నిపుణులు, శాస్త్రజ్ఞులు, విద్యావేత్తలు సభ్యులుగా ఏర్పాటైన ఈ మంచ్ కు జతన్ ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షుడు కపిల్ షా కో ఆర్డినేటర్.

తేమ శాతం తక్కువగా ఉన్న ఎఫ్ సి 5 రకం ఆలుగడ్డలు పెప్సీ వారి లేస్ బ్రాండ్ చిప్స్ తయారీకి అనువైనవి. ఈ రకం ఆలుగడ్డల విత్తనం తాము ప్రత్యేకంగా సృష్టించుకున్నదని పెప్సీ వాదిస్తున్నది. ఉత్తర అమెరికాలోని పెప్సీ అనుబంధ సంస్థ ఫ్రిటో-లే కు ఎఫ్ సి 5 పై 2023 దాకా పేటెంట్ ఉంది. భారతదేశంలో పిపివి అండ్ ఎఫ్ ఆర్ చట్టం కింద 2031 జనవరి దాకా పిఐహెచ్ పేటెంట్ హక్కులు పొందింది. మన దేశంలో 1989లో ఫ్రిటో లేస్ ఉత్పత్తి ఆరంభించింది.

గుజరాత్ పశ్చిమ ప్రాంతాల్లో ఆలుగడ్డలు విరివిగా పండిస్తారు. తమ దగ్గర ఎఫ్ సి 5 ఆలు విత్తనాలు తీసుకుని పంట సాగు చేసి ఆలుగడ్డలను తిరిగి తమకే విక్రయించేలా పిఐహెచ్ చాలా మంది రైతులతో ఒప్పందం కుదుర్చుకున్నది. అన్నీ కారుచవకగా లభించే భారత దేశంలో రైతులతో కుదుర్చుకున్న ఈ ఒప్పందం కూడా  మంచి లాభసాటి యవ్వారంగా అనిపించడంతో మరింత భారీ సంఖ్యలో రైతులను తమ ఒప్పందం ఉచ్చులోకి లాగి, గుజరాత్ లోనే సబర్కంత ప్రాంతంలో ఓ చిప్స్ ఉత్పత్తి ప్లాంటును ఏర్పాటు చేయాలని పిఐహెచ్ పథక రచన చేసింది. ఒప్పందం ప్రకారం 45 మిల్లీమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ వ్యాసం గల పెద్దపెద్ద ఆలుగడ్డలను మాత్రమే పిఐహెచ్ కొనుగోలు చేస్తుంది.

రైతులు చేస్తున్నది ఒప్పందపు సేద్యమైనప్పుడు పండిన ఆలుగడ్డల్లో పెద్దవైనా చిన్నవైనా అన్నీ ఒప్పందపు కంపెనీయే కదా కొనుగోలు చేయాలి? అలా చేయనప్పుడు చిన్నసైజు ఆలుగడ్డలను రైతు మళ్లీ పంట కోసం నిల్వ చేస్తాడో లేక నెత్తిన పెట్టుకుని ఊరేగుతాడో అతనిష్టం. అంతేగానీ కొనకుండా రైతు దగ్గిరే వదిలేసిన పంటపై కాంట్రాక్టు కంపెనీ పెత్తనం చేస్తానంటే ఒప్పుకోడానికి వీలయ్యేపనేనా? తమ కాంట్రాక్టులో లేని నలుగురు రైతులు తమకు పేటెంట్ హక్కులున్న ఎఫ్ సి 5 రకం ఆలుగడ్డలను తమ అనుమతి లేకుండా అక్రమంగా పండించారన్నది పెప్సీకో చేస్తున్న అభియోగం. పెప్సీకో తో కాంట్రాక్టులో లేనప్పుడు రైతులు ఎవరికి వారే సర్వతంత్ర స్వతంత్రులు. కాంట్రాక్టులో ఉన్న రైతులు, కాంట్రాక్టులో లేని రైతుల మధ్య సంబంధ బాంధవ్యాలు, ఇచ్చి పుచ్చుకోవడాలను ప్రశ్నించే హక్కు పెప్సీకో కు లేదు. తమ కాంట్రాక్టు పరిధిలో లేని రైతుల విత్తన సేకరణ విధానాలను శాసించే అధికారం పెప్సీకో కు కాదు గదా ఈ భూమ్మీద ఏ శక్తికీ లేదు.

గుజరాత్ రైతుల తరఫున పోరాటానికి సిద్ధమైన అఖిల భారత కిసాన్ సభ, స్వయంపోషిత, సమగ్ర వ్యవసాయ కూటమి (ఆషా…అలియెన్స్ ఫర్ సస్టెయినబుల్ అండ్ హోలిస్టిక్ అగ్రికల్చర్) వంటి సంస్థల ప్రకారం పెప్సీ ఆడుతున్న ఉల్లంఘన కేసులు, ఉపసంహరణ డ్రామా అంతా ఓ పెద్ద కుట్ర. కేసులు, భారీ నష్టపరిహారం పేరుతో రైతులను భయపెట్టి మెడలు వంచి తమ కాంట్రాక్టు ఉచ్చులోకి లాగడం వారి అంతిమ లక్ష్యం.

కోర్టు వెలుపల రాజీ ఒప్పందానికై పెప్సీకో రైతులకిస్తున్న రెండు ఐచ్ఛికాల్లో కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోడం ఒకటి కాగా ఇకపై ఎఫ్ సి 5 కాకుండా ఇతరేతర ఆలు రకాలు పండించుకోవడం రైతుల కివ్వబోయే ఐచ్ఛికాల్లో రెండవదట.

ఈ మొత్తం ఉదంతాన్ని ఇప్పుడు ఓ పది మంది గుజరాత్ రైతులూ, పెప్సీకో ల మధ్య వివాదంగా పరిగణిస్తున్న వారెవరూ లేరు. భారతీయ రైతులు తాము వేసే పంటలకు విత్తనాలను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ, సొంతంగా విత్తనాలను తయారు చేసుకునే విత్తన సార్వభౌమాధికార (సీడ్ సావర్నిటీ) హక్కులతో ముడిపడిన పెనుసమస్యగా దీన్ని పరిగణించవలసి వస్తున్నది.

ఓ మూడు దశాబ్దాల వెనక్కి వెళ్లి చూస్తే పంట ఇంటికి రాగానే రైతు కుటుంబాల వారు నాణ్యమైన విత్తనాలను ఏరి ఎంపిక చేసి తదుపరి పంటకై నిలువ చేసుకునే వారు. స్వయం సమృద్ధితో ముడిపడిన ఇలాంటి మంచి సేద్యపు సంప్రదాయాలు క్రమంగా కనుమరుగయ్యాక రైతులు విత్తనాల కోసం ప్రభుత్వ పంపిణీ కేంద్రాల వద్ద రోజుల తరబడి పడిగాపులు కాయడం, ఈ కేంద్రాల వద్ద తోపులాటలు, ఉద్రిక్తతలు, ఒక్కోసారి కాల్పులకు దారి తీయడం వంటి దురదృష్ట కర సంఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రైవేటు కంపెనీల బ్రాండెడ్ విత్తనాల జోరు ఎక్కువయ్యాక గత రెండు దశాబ్దాల్లో విత్తనాలు అసలు మొలకెత్తక పోవడం, ఒక్కోసారి ఏపుగా పెరిగిన పైర్లు పంట ఇవ్వకుండా మొరాయించడం, మరోసారి వ్యవసాయ శాస్త్రవేత్తలకు కూడా అంతుబట్టని వింత తెగుళ్లతో ఎకరాలకు ఎకరాలు పంట నాశనం కావడం వంటి సంఘటనలూ జరిగాయి.

డెబ్భై రెండేళ్లలో ఈ స్వతంత్ర భారతంలో రైతన్నల బతుకు మూడు కడుపు కోతలూ, ఆరు ఆత్మహత్యలుగా

సాగుతున్నది. ప్రభుత్వాలూ, రాజకీయ పక్షాలకూ, చివరకు రైతులను నిలువునా ముంచే భారీ ఆహారోత్పత్తి సంస్థలకు సైతం రైతు సంక్షేమమే నిత్య తారక మంత్రం. సేద్యం కోసం వినియోగించే నేల వ్యర్థం, సేద్యం కోసం ఇచ్చే నీరు వ్యర్థమని వాదిస్తూ పుస్తకం కూడా రాసిన ఓ గొప్ప దార్శనికుడు నేటికీ ముఖ్యమంత్రిగా రాజ్యమేలుతున్న దేశం మనది. అతివృష్టి, అనావృష్టి, పైసాకు తరంగాని పంటల బీమా, రుణాల ఊబి, ఎరువుల కొరత, విత్తనాల కొరత, నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందులు, నీటి కొరత, విద్యుచ్ఛక్తి కొరత…..ఇక్కడ రైతు సమస్యలు కోకొల్లలు.

బడా పారిశ్రామిక వేత్తలు విసిరేసే కమిషన్ ల కుక్క బిస్కెట్ ల కోసం కాచుకు కూర్చునే మన రాజకీయ నాయకులు, ప్రభుత్వాల వల్ల రైతులకు న్యాయం జరుగుతుందని ఆశించలేం. పెప్సీకో ప్రతినిధులు బైటకు వివరాలేవీ పొక్కకుండా గుజరాత్ ప్రభుత్వంతో గుంభనంగా చర్చలు జరపడం కూడా ఈ సంగతినే స్పష్టం చేస్తున్నది.

సోషల్ మీడియాలో నిరసనల ప్రభంజనానికి ఓ గ్లోబల్ జైంట్ భయపడి తోక ముడిచిన గుజరాత్ ఉదంతంలో ఉవ్వెత్తున ఎగసిపడిన ప్రజా చైతన్యం వృథా పోరాదు. ఇదివరకు బీజ్ అధికార్ మంచ్ వంటి సంస్థలెన్నో పుట్టి గిట్టి ఉండవచ్చు. కానీ ఈ మంచ్ ను బతికించుకుని, దేశవ్యాప్తంగా విస్తరించి, పూర్తి స్థాయిలో చైతన్యవంతం చేయడం నేటి చారిత్రకావసరం. రాజకీయ దుర్మార్గుల అడ్డాగా మారకుండా కేవలం రైతు ప్రయోజనాల కోసం పోరాడే సిసలైన రైతు సంస్థగా దీన్ని నిలబెట్టుకోవడం జీవన్మరణ సమస్య వంటి అతి పెద్ద సవాలు. పెప్సీకో ఉదంతంలో సోషల్ మీడియా నిర్వహించిన పాత్రను దృష్టిలో ఉంచుకుని ఆ రంగంలో నిష్ణాతులైన వారిని నియమించుకుని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అన్నదాతలందరినీ ఒక్కటి చేసి, కష్టసుఖాలు పంచుకునేలా, సవాళ్లను సమైక్యంగా ఎదుర్కొనేలా సమాయత్తం చేయగలగాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *